ఇక్కడో మాట..అక్కడ మరోమాట
బాబుపై దిగ్విజయ్‌సింగ్ ధ్వజం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్‌లో చెబుతున్న చంద్రబాబు వరంగల్ వెళ్లి.. తాను లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చినట్లు చెబుతున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు. ద్వంద్వ వైఖరితో ఏ ప్రాంతానికి వెళితే ఆ మాట మాట్లాడుతూ ప్రజలను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు.
విజయవాడలో రెండురోజులపాటు జరిగిన ఏపీసీసీ మేధోమథన సదస్సు శనివారం ముగిసింది. అనంతరం దిగ్విజయ్‌సింగ్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పోలవరానికి జాతీయ హోదా, రెవెన్యూ లోటు భర్తీ వంటి అనేక హామీల్ని కేంద్రం నెరవేర్చాల్సి ఉన్నా సీఎం చంద్రబాబు వారిపై ఒత్తిడి తేవట్లేదని, భాగస్వామ్యపక్షం కావడంతో రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా మాట్లాడడంలేదని తప్పుపట్టారు. ఈ అంశంపై పెద్దఎత్తున సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేస్తున్నామని, పార్లమెంటులోనూ దీనిపై పోరాడతామని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
నాగార్జున్‌సాగర్ డ్యామ్‌పై ఏపీ, తెలంగాణ అధికారులు ఘర్షణకు దిగడం సరికాదు. ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
ప్రధాని మోదీ ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తూ అన్నీ చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయనపై భ్రమలు తొలగిపోయాయనడానికి ఢిల్లీ ఫలితాలే నిదర్శనం.
పార్టీని కిందిస్థాయి నుంచి పునర్నిర్మిస్తాం.
పార్టీ రూపురేఖల్ని మారుద్దాం..
రాబోయే రోజుల్లో దేశం సరికొత్త కాంగ్రెస్‌ను చూడబోతోందని, పార్టీ రూపురేఖల్ని పూర్తిగా మార్చేద్దామని దిగ్విజయ్ స్పష్టం చేశారు. పరిస్థితులకనుగుణంగా మౌలిక సిద్ధాంతాన్ని మార్చుకుని ముందుకెళ్లాల్సి ఉందన్నారు.