కర్రా బిళ్లా VS క్రికెట్
దేడ్ కహానీ
లగాన్ అంటే పన్ను, శిస్తు. ‘శిస్తువేత్తి, పస్తువేత్తి - వేత్తి కనకవర్షం సుమీ’... ఇదీ కొత్త సామెత. లగాన్ సృష్టించిన చరిత్ర, కురిపించిన కాసులు ఒక ఎత్తయితే... తెల్ల దొరల పాలనలో పన్నుల బాధల్ని ఎంతో ఎంటర్టైనింగ్గా చెప్పిన చిత్రం అయినందుకు నల్ల దొరల పాలనలో వినోద ‘పన్ను’ మినహాయింపులు పొందడం ఎంత గొప్ప! 15 జూన్ 2001 భారతీయ సినీచరిత్రలో గుర్తించుకోదగిన రోజు. 1983 నుంచీ మన దేశంలో అనధికార మతంగా ఎదిగిన క్రీడ క్రికెట్. దాని మూలాలు బ్రిటిష్వాళ్లవే.
స్వాతంత్య్రానికి పూర్వం భారతీయ బానిసత్వం నేపథ్యంగా వచ్చిన చిత్రాలన్నీ స్ఫూర్తిమంతమైన, దేశభక్తిపూరిత చిత్రాలుగా మాత్రమే ఉంటాయి. కానీ అదే స్ఫూర్తి, దేశభక్తిని క్రికెట్ అనే క్రీడావినోదంతో ముడిపెట్టవచ్చనే ఆలోచన దర్శక రచయిత అశుతోష్ గోవారికర్కి రావడమే అద్భుతం. దాన్ని ఆమిర్‌ఖాన్ అంగీకరించి స్వయంగా నిర్మించడానికి పూనుకోవడం మహాద్భుతం.
‘లగాన్’కి తొమ్మిదేళ్లకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బాజీ’ అనే మాస్ మసాలా సినిమా అట్టర్‌ఫ్లాప్. ఆ భయంతోనే ఏమో అశుతోష్ ‘లగాన్’ కథని వేరే హీరోలందరికీ వినిపించాడు ముందర. అన్నిచోట్లా తిరస్కారానికి గురైన ఆ కథ, చివరకు ఆమిర్‌ఖాన్ ఒప్పుకోవడంతో తెరకెక్కి... అత్యున్నత పురస్కారాలను, ప్రేక్షకుల నీరాజనాలను అందుకోవడానికి తయారైంది.
ఈ సినిమా మీద నేను నాలుగు పేజీల వ్యాసం రాయలేను. కనీసం నాలుగొందల పేజీల పుస్తకం రాయాలి. మస్తిష్కం ఉపయోగించి తీసిన సినిమాలు కమర్షియల్‌గా హిట్ అవుతాయి. కానీ, మనసుపెట్టి తీసిన సినిమాలు హిట్‌తో పాటు ప్రేక్షకుడి మస్తిష్కాన్ని మధిస్తాయి. ప్రేక్షకుడి మనసు మీద చెరగని ముద్ర వేస్తాయి. ‘లగాన్’ ఆ కోవకు చెందిన సినిమా.
పోస్టర్ చూశాక:
ఓ స్వాతంత్య్ర సమరయోధుడి ప్రేమకథ కాబోసు అని డౌట్ వచ్చింది. ఓ పక్క బ్రిటిష్ యువరాణి, మరోపక్క సంప్రదాయ భారత వనిత, మధ్యలో చిన్న రూరల్ గెటప్‌లో అందమైన ఆమిర్‌ఖాన్. ఇంతకన్నా ఏం చేసుకుంటాడులే - అనుకున్నా.
థియేటర్లో కూర్చున్నాక:
గంభీరమైన అమితాబ్ బచ్చన్ స్వరంతో... స్వాతంత్య్రం రాకముందు తెల్లదొరలు స్థానిక రాజుల్ని వశపర్చుకుని సామాన్య ప్రజలకి పన్నులెలా బాదేవారు? గుజరాత్‌లోని చంపానెర్ అనే కుగ్రామంలో జరిగిన కథ అని మొదలై... పాత్రలు ఒక్కొక్కటిగా పరిచయం అవుతూ బ్రిటిష్ సైనికుల దౌర్జన్యం కనపడుతుంది. ఇదేదో ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ అయ్యుంటుంది అనుకున్నా.
భువన్ గురించి వేరే పాత్రలు మాట్లాడుకున్నాక, దొంగతనంగా జింకల్ని రాళ్లతో కొడుతున్న భువన్. సరిగ్గా జింకల పక్కనున్న చెట్టుకి రాయి తగిలి జింకలు పరుగెత్తడం, అదే చెట్టుకి ఓ తుపాకీ గుండు తగలడం, ఆ తుపాకీని పేల్చిన తెల్లదొర కెప్టెన్ రసెల్ కనబడటం క్షణాల్లో జరుగుతుంది. భువన్ జింకల్ని కొట్టట్లేదు. ఆ తుపాకీ గుళ్ల నుంచి వాటిని కాపాడుతున్నాడని అర్థమైంది. భువన్ పాత్రని, ఆ పాత్రనలా పరిచయం చేసిన దర్శకుణ్ని ప్రేమించేయడం మొదలుపెట్టాను. ‘ఆహా! ఏం ఐడియా’ అనుకున్నాను.
భువన్ మెడమీద తుపాకీ పెట్టి, జింకల్ని కాలుస్తాడు కెప్టెన్ రసెల్. భువన్‌కి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. హీరో ఫెయిల్యూర్‌తో సినిమా స్టార్ట్ అయ్యింది. చివ్వరి రీలు దాకా ఆ ఓటమి పరంపరలోనే సినిమా అంతా నడుస్తుంది. అయినా అతని పాత్రలోని మొక్కవోని ధైర్యం, పట్టుదల, తెగింపు, దేశభక్తి చూసి చూసి చూసి... చివరి బాల్కి వీడు సిక్స్ కొట్టకపోతే మనం సీట్లోంచి లేచి తెరమీద సిక్స్ కొట్టి భారతీయుల్ని గెలిపించాలన్నంత కసి వచ్చేస్తుంది. ‘చిన్న చిన్న కళ్లల్లో పెద్ద పెద్ద కలలు...’
భువన్ పాత్రని తిడుతూ గ్రామస్తుల మాటలు...
క్రికెట్‌ని తేలిక చేస్తూ భువన్ ‘ఇది మా గిల్లీ దండా ఆటే... చిన్నప్పట్నుంచీ చూస్తున్నాను’ అనడం చప్పట్లు కొట్టించింది. ఈ కథని రాయకూడదు. అనుభవించాలి. ఎందుకంటే... ఈ సినిమాని దర్శకుడు తీయలేదు, తీయగా మలిచాడు కాబట్టి.
విశేషాలు:
నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉండటానికి అనువైన చిన్న హోటల్ కూడా లేని పల్లెటూళ్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్‌మెంట్‌ని పూర్తిచేసి, అన్ని ఫ్లాట్లూ అద్దెకు తీసుకుని, వంటవాళ్లని, సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని మరీ షూటింగ్ చేయడం గొప్ప విషయం.
ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా దర్శకుడికి వెన్నులో డిస్కు స్లిప్ అయితే ముప్ఫై రోజుల పాటు మానిటర్ పక్కనే బెడ్‌మీద పడుకుని డెరైక్షన్ చేయడం ఇంకా గొప్ప విషయం. షూటింగ్ జరిగిన ఏడాది తర్వాత, గుజరాత్‌లోని కచ్ దగ్గర, భుజ్ గ్రామ సమీపంలో భూకంపం వచ్చి అక్కడి జనం ఆస్తి, ధన, ప్రాణ నష్టాలకు గురైతే... ‘లగాన్’ యూనిట్ అంతా కలిసి తమ తమ వేతనాల్లోంచి ఆ ప్రాంతానికి అండగా నిలబడటం మరో గొప్ప విషయం.
ఈ చిత్రం పేరుకు తగ్గట్టే ఆమిర్‌ఖాన్ పదిహేనేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పి, పన్ను చెల్లించి, ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్‌రావుని రెండో వివాహం చేసుకోవడం ఓ విచిత్రం. ఆ గొడవల్లో ఆమిర్ దాదాపు నాలుగేళ్లు వృత్తికి దూరంగా ఉండాల్సి రావడం బాధాకరం.
ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఫారిన్ ల్యాంగ్వేజ్ కేటగిరీకి ఎంపికైన మూడవ భారతీయ చిత్రం ‘లగాన్’. వసూళ్లు, అవార్డులు, విమర్శకుల ప్రశంసలు అన్నీ అమితంగా దక్కిన మిలీనియం భారతీయ చిత్రాల్లో ‘లగాన్’ తొలి రెండు, మూడు స్థానాల్లో ఉంటుంది.
గ్రేసీసింగ్, రేచెల్షెల్లీ ఇద్దరూ రాధ, ఎలిజబెత్ పాత్రల్లో అద్భుతంగా రాణించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి ఆయువు పట్టు కావడం మరింత గొప్పగా అనిపించే విషయం.
ఈ చిత్రం డీవీడీ అమ్మకాలు 1975లో విడుదలైన ‘షోలే’ అమ్మకాల రికార్డుల్ని బద్దలుకొట్టాయి. నటుడిగా కెరీర్ ప్రారంభించిన అశుతోష్ గోవారికర్ ఈ చిత్రంతో దర్శకుడు, రచయిత అయ్యాడు. నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆమిర్‌ఖాన్ ‘లగాన్’తో నిర్మాత అయ్యాడు. ఆ విజయం ఇచ్చిన ఊపుతో తర్వాత దర్శకుడూ అయ్యాడు. అదే ఊపుతో అశుతోష్ గోవారికర్ నిర్మాత అయ్యాడు. ఒక ‘సినిమా’ జీవితాల్ని మారుస్తుంది. అదే ‘లగాన్’.
ముస్లిముల్ని, హిందువుల్ని విభజించి పాలించిన తెల్లవారి కుతంత్రం క్రికెట్ ఆటలో కళ్లకు కట్టినట్టు చూపాడు దర్శకుడు. మళ్లీ వారిని ఒకటి చేసి, తెల్లవారిని ఓడించిన భువన్ ఆ క్షణంలో గాంధీ మహాత్ముడిలా కనిపిస్తాడు. నిజంగా ఈ కథ జరిగుంటే భారతదేశమంతా క్రికెట్ ఆడేసేదేమో - భువన్ జాతిపిత అయ్యుండేవాడేమో అనిపిస్తుంది. నిజంగానే క్రికెట్ ఇవాళ మతం అయ్యిందిగా. ‘అనగ అనగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు’ అన్నట్టు తీయగా, తీయగా ఒక్కో తపన కలిగిన దర్శకుడి జీవితంలో ముందో వెనకో మధ్యలోనో ఒక్క సినిమా ‘లగాన్’ అవుతుంది.
ఈ చిత్రం విడుదలైన రోజే స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథ ‘గదర్... ఏక్ ప్రేమ్ కథ’ విడుదలైంది. ఒకే నేపథ్యం ఉన్న కథలు కాబట్టి జనం పోటీగా భావించారు. పైగా ఆమిర్‌ఖాన్, సన్నీడియోల్ హీరోలు, నిర్మాతలు అవ్వడం వలన దాయాదుల పోరు (హిందు, ముస్లింలు)గా అభివర్ణించారు. కానీ ప్రేక్షకులు మాత్రం..? వచ్చేవారం కలుద్దాం... ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ చిత్ర విశేషాలతో!
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు