‘బంగారు తల్లి’తో మోసం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: బంగారు తల్లి పథకంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలను మోసగిస్తోందని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కారుసాల సుబ్బరావమ్మ ధ్వజమెత్తారు. ఈ పథకానికి సంబంధించి 60 వేల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం నాలుగు వేల మందికి మంజూరు చేశారన్నారు. స్థానిక ఎల్బీజీ భవన్లో గురువారం నిర్వహించిన ఐద్వా ఒంగోలు డివిజన్ విస్తృత సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామంటూ పదేపదే ప్రకటించుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆచరణలో వారిని పూర్తిగా విస్మరిస్తున్నారని విమర్శించారు. బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టినా అర్హులైన వారికి దాన్ని అందకుండా చేస్తున్నారన్నారు.
గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. వయసుతో నిమిత్తం లేకుండా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి కాలం సుబ్బారావు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వం వాటిని నియంత్రించకుండా ప్రేక్షకపాత్ర వహిస్తోందని విమర్శించారు. కనీస వేతనం పదివేల రూపాయలకు పైగా ఉండాలని ప్రభుత్వమే చట్టం చేసినా దానిని ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా వాటిని నియంత్రించకుండా ఆదాయమే పరమావధిగా ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు.
ఐద్వా డివిజన్ కార్యదర్శి యూ ఆదిలక్ష్మి మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఐద్వా నాయకురాలు ఎన్ మాలతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకురాళ్లు ఎస్కే నాగూర్‌బీ, పద్మ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.