అడిషనల్ డీజీపీ ఇంట్లో పాము కలకలం
చిలకలగూడ (హైదరాబాద్): అడిషనల్ డీజీపీ ఇంట్లో పాము కలకలం సృష్టించింది. లక్డీకపూల్‌లోని తెలంగాణ డీజీపీ కార్యాలయం సమీపంలోని భవనంలో అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) సుదీప్ లక్తాకియా ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో లక్తాకియా ఇంట్లోకి పాము ప్రవేశించింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని అధికారులకు తెలిపారు.
డీజీపీ కార్యాలయం సెక్యూరిటీ అధికారులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యుడు, పాముల పట్టడంలో దిట్ట అయిన చిలకలగూడ ఠాణా కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న వెంకటేష్‌నాయక్ అర్ధగంట పాటు శ్రమపడి ఆరు అడుగుల పాము (జెర్రిపోతు)ను పట్టుకోవడంతో అడిషనల్ డీజీపీ కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.