Sudhir Mungantiwar
-
బ్రిటన్ వెళ్లి ఛత్రపతి శివాజీ ఖడ్గాన్ని తెచ్చేందుకు యత్నిస్తా!
మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ తాను వచ్చే నెలలో యూకే వెళ్తున్నానని, ఛత్రపతి శివాజీ ఖడ్గాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన రాయ్‌గఢ్ జిల్లాలోని ఖర్ఘర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హజరైన కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ముంగంటివార్ ఈ వ్యాఖ్యలు చేశారు. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం 350వ వార్షికోత్సవాన్ని త్వరలో జరుపుకోనున్నట్లు కూడా చెప్పారు. ఈ సందర్భంగా తాను వచ్చే నెలలో బ్రిటన్‌ని సందర్శస్తానని, అక్కడ 17వ శతాబ్ధపు యోధుడు ఛత్రపతి శివాజీ ఉపయోగించిన జగ్దాంబ(ఖడ్గం), వాఘ్-నఖ్(పులి గోళ్లలా కనిపించే బాకు) తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మరాఠీ ప్రజల వీక్షించేలా అందుబాటులో ఉంచడం కోసం దీని గురించి బ్రిటిస్ డిప్యూటీ హైకమిషనర్ అలాన్ గెమ్మెల్, రాజకీయ ద్వైపాక్షిక వ్యవహారాల డిప్యూటీ హెడ్ ఇమోజెన్ స్టోన్‌తో కూడా చర్చించానని చెప్పారు. తాను మే మొదటి వారంలో బ్రిటన్‌కు వెళ్తున్నానని, శివాజీ పట్టాభిషేకం 350వ వార్షికోత్సవం కల్లా వాటిని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ దేశం ప్రపంచం సెల్యూట్ చేసేలా ఆ వార్షికోత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకుందాం అన్నారు మహారాష్ట్ర మంత్రి ముంగంటివార్. (చదవండి: యూపీలో మరో వ్యక్తి కొంగ స్నేహం..ఏం జరుగుతుందో చూడాలి..) -
‘శివ’సైనికుడే సీఎం
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం గడిచినా.. మెజారిటీ సాధించిన మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య అధికారం పంపిణీపై అవగాహన కుదరకపోవడంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. నవంబర్ 7వ తేదీలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడనట్టయితే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందని బీజేపీ నేత, ఆర్థికమంత్రి ముంగంతివార్ పేర్కొన్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి నవంబర్ 8వ తేదీతో ముగుస్తుంది. దీపావళి పండుగ కారణంగా శివసేన, బీజేపీల మధ్య చర్చలు ప్రారంభం కాలేదని, ఒకట్రెండు రోజుల్లో అవి ప్రారంభమవుతాయని ముంగంటివార్ తెలిపారు. ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా ప్రజలు తీర్పునివ్వలేదని, బీజేపీ, సేన కూటమికి వారు మద్దతిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ‘మా కూటమి ఫెవికాల్ కన్నా, అంబుజా సిమెంట్ కన్నా దృఢమైనది’అని వ్యాఖ్యానించారు. మరోవైపు, శివసేన వ్యక్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ సేన నేత సంజయ్ రౌత్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘సేన కోరుకుంటే.. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల మద్దతు కూడగట్టుకోగలదు’అన్నారు. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే ప్రతిపాదనకే మహారాష్ట్ర ప్రజలు ఓటేశారన్నారు. అతివృష్టితో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందాల్సి ఉందని శివసేన పత్రిక సామ్నా పేర్కొంది. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తాం ఒకవేళ బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే.. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు తాముప్రయత్నిస్తామని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. మరోవైపు, అదే పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మాత్రం.. ప్రతిపక్షంలో కూర్చోమనే ప్రజలు తీర్పిచ్చారని, తాము అదే పాటిస్తామని వక్కాణించారు. గురువారం రాత్రి శరద్‌పవార్ నివాసంలో ఎన్సీపీ నేతల భేటీ అనంతరం అజిత్ పవార్ పై వ్యాఖ్యలు చేశారు. అది బీజేపీ, శివసేన డ్రామా బీజేపీ, శివసేన డ్రామాలో పావు కావద్దొని కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేత సంజయ నిరుపమ్ సూచించారు. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతివ్వాలన్న కాంగ్రెస్ ఆలోచనను ఆయన తప్పుబట్టారు. బీజేపీ, శివసేనల మధ్య విభేదాలను ‘అధికారంలో ఎక్కువ వాటా కోసం ఆడుతున్న తాత్కాలిక డ్రామా’అని ఆయన అభివర్ణించారు. ‘బీజేపీ నీడ నుంచి శివసేన ఎన్నటికీ బయటకు రాదు’అని కాంగ్రెస్‌లో చేరకముందు శివసేనలో కీలక నేతగా వ్యవహరించిన సంజయ్ వ్యాఖ్యానించారు. పొత్తు తేలే దాకా నేనే సీఎం! ఔరంగాబాద్: రాజకీయ అనిశ్చితి కొనసా గుతున్న మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బీజేపీ, శివసేనల మధ్య ఒప్పందం కుదిరేవరకూ తనను ముఖ్యమంత్రిగా చేయాలని ఓ రైతు అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో బీడ్ జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్ విష్ణూ గడాలే గురువారం కలెక్టర్‌ను కలిసి సీఎం పీఠంపై అస్పష్టత తొలిగే వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి, రైతుల సమస్యలు పరిష్కరిస్తానంటూ వినతి పత్రం అందించారు. లేదంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనకు దిగుతా నంటూ ఆ రైతు హెచ్చరించడం కొసమెరుపు! -
మంత్రుల మధ్య ‘అవని’ చిచ్చు
న్యూఢిల్లీ/ముంబై: మ్యాన్ఈటర్ పులి అవనిని చంపిన ఉదంతంలో మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మధ్య వివాదం మరింత ముదిరింది. సుధీర్ ముంగంతివార్‌ను కేబినెట్ నుంచి తొలగించే విషయాన్ని పరిశీలించాలని మేనకా గాంధీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు మంగళవారం లేఖ రాశారు. దీనికి ధీటుగా స్పందించిన ముంగంటివార్..పోషకాహార లోపంలో పిల్లలు చనిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మేనకా గాంధీనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వన్యప్రాణులను కాపాడాల్సిన అటవీ మంత్రే వాటిని సంహరిస్తూ విధుల నిర్వహణలో విఫలమయ్యారని మేనక ఆరోపించారు. పులి అవని గురించి రెండు నెలలుగా ఆయనతో మాట్లాడుతున్నానని, దానికి మత్తు సూది ఇచ్చి పట్టుకోవాలని సూచించానని అన్నారు. మంత్రి కొంత ఓపిక, సున్నితత్వం వహిస్తే పులిని ప్రాణాలతోనే పట్టుకునే వాళ్లమని తెలిపారు. మరోవైపు, అవని హత్యతో తనకేం సంబంధం లేకున్నా మేనకా గాంధీ తనని రాజీనామా చేయాలంటున్నారని ముంగంటివార్ అన్నారు. ‘నాకు సంబంధంలేని దానికి నేను నైతిక బాధ్యత తీసుకోవాలనుకుంటే ఒక షరతు. పోషకాహారం లోపంతో చిన్నారులు చనిపోతున్న ఉదంతాలకు కేంద్ర మంత్రి రాజీనామా చేసి ఆదర్శంగా నిలవాలి’ అని వ్యాఖ్యానించారు. చంపడం పరిష్కారం కాదు.. భారత్‌లో వరసగా జరిగిన రెండు పులుల హత్యపై వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ ఆందోళన వ్యక్తం చేసింది. వన్య మృగాలతో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించేందుకు వాటిని హతమార్చడం పరిష్కారం కాదని పేర్కొంది. ‘మానవుడు–జంతువుల మధ్య ఘర్షణ తలెత్తిన సందర్భాల్లో మానవీయ, ప్రొఫెషనల్ విధానాలు ఆచరించాలి. అన్ని ప్రభుత్వ విభాగాల మధ్య చక్కటి సమన్వయం రాబట్టి, స్థానికంగా నివసించే ప్రజల్లో వన్యప్రాణుల పట్ల సున్నితత్వం పెంచాలి. ఇలాంటి సందర్భాల్లో మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని భారత్‌లో డబ్ల్యూఏపీ డైరెక్టర్ గజేందర్ కె.శర్మ అన్నారు. -
పన్నుల విధానంలో మార్పులు అనివార్యం
ముంబై: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రస్తుత పన్నుల విధానంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునిగంటివార్ స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పన్నుల విధానంలో లోపాలను నిర్మూలించి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీచేస్తామని చెప్పారు. రాష్ట్రానికి ప్రతి యేటా అమ్మకపు పన్ను శాఖ నుంచి రూ.69వేల కోట్లు, ఎక్సైజ్ నుంచి రూ.11,500 కోట్లు, రవాణా శాఖ నుంచి రూ.5,500 కోట్లు ఆదాయం సమకూరుతున్నట్లు మంత్రి సుధీర్ వివరించారు. అలాగే పెట్రోలియం ఉత్పత్తుల నుంచి రాష్ట్ర వాటాగా యేటా రూ.1,500 కోట్లు సమకూరుతోందన్నారు. ఆయా శాఖల్లో సమూల మార్పుల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు తమ ప్రభుత్వం త్వరలో కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. -
పంకజ ముండే సహా 10 మందికి మంత్రి పదవులు
ముంబై: మహారాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా దేవంద్ర ఫడణ్ వీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దివంగత నేత గోపినాథ్ కుమార్తె పంకజ ముండే సహా పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. బీజేపీ కోర్ కమిటీ సభ్యులు ఏక్నాథ్ ఖడ్సే, సుధీర్ మునగంటివార్, వినోద్ తవ్డే, పంకజ ముండే, ముంబై బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ మెహతా, పాల్గార్ జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు విష్ణు సవ్రా, చంద్రాకాంత్ పాటిల్, విద్య థాకూర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా ప్రమాణ స్వీకారోత్సవానికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే హాజరుకానున్నారు. -
సీఎం సీటుపై ఆసక్తి లేదు: గడ్కరీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు. తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తిలేదని పునరుద్ఘాటించారు. 'మహారాష్ట్ర సీఎం రేసులో లేనని ఇప్పటికే స్పష్టం చేశాను. నేను ఢిల్లీలోనే ఉండాలనుకుంటున్నాను' అని గడ్కరీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు గడ్కరీ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు మీడియా వార్తలు వచ్చి నేపథ్యంలో ఆయన వివరణయిచ్చారు. మహారాష్ట్ర మాజీ మంత్రి సుధీర్ మునగంటివార్ సహా పలువురు ఎమ్మెల్యేలు గడ్కరీ పేరు తెరపైకి తెచ్చారు. బీజేపీ అధిష్ఠానం మాత్రం దేవేంద్ర ఫడ్నావిస్ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. -
దేశమంతటా మోడీ హవా:సుధీర్ మునగంటివార్
బీజేపీ నేత మునగంటివార్ భివండీ న్యూస్‌లైన్: దేశం నలుమూలలా మోడీ గాలి వీస్తోందని బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్ పేర్కొన్నారు. భివండీ లోక్‌సభ నియోజకవర్గం బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పద్మనగర్‌లోని గణేశ్టాకీస్ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ‘టోరంట్ పవర్ కంపెనీ దూకుడుకు కళ్లెం పడాలంటే మోడీ ప్రభుత్వం రావాలి. ఇదే టోరంట్ కంపెనీ గుజరాత్లో విద్యుత్‌ను సరఫరా చేస్తుంది. అయితే దాని పప్పులు అక్కడ ఉడకవు’ అని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని సోనియా గాంధీ ఆశిస్తున్నారని, అయితే నరేంద్ర మోడీకి మాత్రం భారత్ అభివృద్ధి కావాలని ఆశిస్తున్నారన్నారు. నరేంద్ర మోడీ గత 15 సంవత్సరాల కాలంలో గుజరాతీయులకు ఎనలేని సేవ చేశారన్నారు. ఇక 125 కోట్ల మందిప్రజలకు సేవలందించేందుకు తహతహలాడుతున్నారన్నారు. ఎవరూ మోడీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. రాహుల్ గాంధీకి మంత్రి బాధ్యతలేమిటో తెలియవని, మోడీ 15 సంత్సరాలు రాష్ట్ర ముఖ్య మంత్రి బాధ్యతలను నిర్వర్తించారని, అంతేకాకుండా గుజరాత్ రూపురేఖలు మార్చిన ఘనతను కూడా దక్కించుకున్నాడన్నారు. దీని దృష్టిలో పెట్టుకుని 24న జరగనున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కపిల్ పాటిల్‌కు అమూల్యమైన ఓటేసి గెలిపించిన ట్టయితే భివండీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రే, శ్యామ్‌జీ అగ్రవాల్, పట్టణ శాఖ అధ్యక్షుడు మహేశ్ చౌగులే, స్థానిక కార్పొరేటర్లు మురళీమచ్చ, మధన్ బువా నాయిక్, అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షుడు కమటం శంకర్, కార్యదర్శి దాసి అంబాదాస్, నిష్కం భైరి, కమటం సుధాకర్, వినోద్ పాటిల్, భీమనాథ్ శివప్రసాద్, కొండ వివేక్, తదితర్లుతో పాటు భారి సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొన్నారు. -
బీజేపీలో భారీ మార్పులు
సాక్షి, ముంబై: రాబోయే ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కూడా భారీ ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుణ్ని మార్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న ఏక్నాథ్ ఖడ్సే గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన స్థానంలో మహారాష్ట్ర బీజేపీశాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్‌కు ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు అప్పగించాలనే విషయంపై బీజేపీలో చర్చలు నడుస్తున్నాయి. నాగపూర్‌లో శీతాకాల సమావేశాలు మొదలయ్యేలోపే మునగంటివార్‌కు బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తోంది. ప్రస్తుతం ఖడ్సే అనారోగ్యంతో ఉండడంతో ఆయన ప్రతిపక్ష నాయకుని పదవికి న్యాయం చేయలేకపోతున్నాడనే వాదనలు ఉన్నాయి. సమన్యాయంతో ముందుకు వెళ్తున్న బీజేపీలో ప్రతిపక్ష నాయకుని పదవిని మునగంటివార్‌కు అప్పగిస్తే అంతర్గత విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బీజేపీలో అధ్యక్షుని పదవి విదర్భ ప్రాంత నాయకునికి, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడి పదవి ఖాందేష్ ప్రాంతానికి, కొంకణ్‌కు విధానపరిషత్ నేతృత్వాన్ని కట్టబెడుతున్నారు. ఊహించని విధంగా పదవి మార్చాల్సి వస్తే మళ్లీ ఖాందేష్ ప్రాంతానికి చెందిన నాయకుని ఇవ్వాలని కొందరు పట్టుపట్టే అవకాశాలున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో సమర్థుడైన ప్రతిపక్ష నాయకుడు అవసరమని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సుధీర్ మునగంటివార్ పేరు అందరికంటే ముందుందని తెలిసింది. గడ్కరీ వర్గం ఎత్తుగడతోనే...? బీజేపీలో గత కొంతకాలంగా వర్గపోరు కొనసాగుతోంది. పార్టీ పదవులతోపాటు లోక్‌సభ, అసెంబ్లీ ఇతర ఎన్నికలు ఇలా ఏ ఎన్నికల్లోనైనా నితిన్ గడ్కరీ వర్గం, గోపీనాథ్ ముండే వర్గం పేర్లు వినిపిస్తాయి. తమ వర్గానికి ప్రాధాన్యం లభించాలంటే, తమ వర్గానికి ప్రాధాన్యం లభించాలని వీరు పోటీ పడుతుంటారు. అవకాశం దొరికిన ప్రతిసారి తమ వారికి అవకాశం ఇప్పించుకోవడానికి ఇరు వర్గాలూ ప్రయత్నిస్తాయి. గడ్కరీ వర్గం వ్యక్తిగా భావించే సుధీర్ మునగంటివార్‌కు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం రాకుండా గోపీనాథ్ ముండే వర్గం అడ్డుకోగలిగింది. తాజాగా ప్రతిపక్ష నాయకుని పదవి ఆయనకు కట్టబెట్టేందుకు గడ్కరీ వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. శీతాకాల సమావేశాలలోపు ఎట్టిపరిస్థితిలోను ఆయనకు బాధ్యతలు అప్పగించాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టు సమాచారం.