సాక్షి, ముంబై: రాబోయే ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కూడా భారీ ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుణ్ని మార్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న ఏక్‌నాథ్ ఖడ్సే గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన స్థానంలో మహారాష్ట్ర బీజేపీశాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్‌కు ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు అప్పగించాలనే విషయంపై బీజేపీలో చర్చలు నడుస్తున్నాయి. నాగపూర్‌లో శీతాకాల సమావేశాలు మొదలయ్యేలోపే మునగంటివార్‌కు బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తోంది.
ప్రస్తుతం ఖడ్సే అనారోగ్యంతో ఉండడంతో ఆయన ప్రతిపక్ష నాయకుని పదవికి న్యాయం చేయలేకపోతున్నాడనే వాదనలు ఉన్నాయి. సమన్యాయంతో ముందుకు వెళ్తున్న బీజేపీలో ప్రతిపక్ష నాయకుని పదవిని మునగంటివార్‌కు అప్పగిస్తే అంతర్గత విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బీజేపీలో అధ్యక్షుని పదవి విదర్భ ప్రాంత నాయకునికి, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడి పదవి ఖాందేష్ ప్రాంతానికి, కొంకణ్‌కు విధానపరిషత్ నేతృత్వాన్ని కట్టబెడుతున్నారు. ఊహించని విధంగా పదవి మార్చాల్సి వస్తే మళ్లీ ఖాందేష్ ప్రాంతానికి చెందిన నాయకుని ఇవ్వాలని కొందరు పట్టుపట్టే అవకాశాలున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో సమర్థుడైన ప్రతిపక్ష నాయకుడు అవసరమని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సుధీర్ మునగంటివార్ పేరు అందరికంటే ముందుందని తెలిసింది.
గడ్కరీ వర్గం ఎత్తుగడతోనే...?
బీజేపీలో గత కొంతకాలంగా వర్గపోరు కొనసాగుతోంది. పార్టీ పదవులతోపాటు లోక్‌సభ, అసెంబ్లీ ఇతర ఎన్నికలు ఇలా ఏ ఎన్నికల్లోనైనా నితిన్ గడ్కరీ వర్గం, గోపీనాథ్ ముండే వర్గం పేర్లు వినిపిస్తాయి. తమ వర్గానికి ప్రాధాన్యం లభించాలంటే, తమ వర్గానికి ప్రాధాన్యం లభించాలని వీరు పోటీ పడుతుంటారు. అవకాశం దొరికిన ప్రతిసారి తమ వారికి అవకాశం ఇప్పించుకోవడానికి ఇరు వర్గాలూ ప్రయత్నిస్తాయి.
గడ్కరీ వర్గం వ్యక్తిగా భావించే సుధీర్ మునగంటివార్‌కు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం రాకుండా గోపీనాథ్ ముండే వర్గం అడ్డుకోగలిగింది. తాజాగా ప్రతిపక్ష నాయకుని పదవి ఆయనకు కట్టబెట్టేందుకు గడ్కరీ వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. శీతాకాల సమావేశాలలోపు ఎట్టిపరిస్థితిలోను ఆయనకు బాధ్యతలు అప్పగించాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టు సమాచారం.