రంగంపేటకు స్మార్ట్ కిరీటం?
తిరుపతి నగరం స్మార్ట్ సిటీ కిరీటం దక్కించుకోవడం దాదాపుగా ఖరారైనట్టే కనిపిస్తోంది. రెవెన్యూ అధికారులు ఇందుకు కావాల్సిన భూమిని సైతం సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు చంద్రగిరి మండలం ఏ.రంగంపేట అటవీ ప్రాంతంలో స్మార్ట్ సిటీ నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు ఎస్వీ జూ పార్క్ దాటిన తరువాత కల్యాణి డ్యాం వరకు ఉన్న అటవీ ప్రాంతంలో స్మార్ట్ సిటీ నిర్మాణం జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తుడా, రెవెన్యూ విభాగాల్లోని కీలక అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నారు.
- అన్ని అర్హతలతో నివేదికలు రెడీ 50 బ్లాకులు..
- 500 ఎకరాల భూముల గుర్తింపు
తిరుపతి తుడా : తిరుపతి నగరం ఎస్వీ జూ పార్కు వరకు విస్తరించడం, అక్కడి నుంచి కల్యాణి డ్యాం వరకు ప్రభుత్వ, అటవీ భూములు పుష్కలంగా ఉండటం స్మార్ట్ సిటీకి అనుకూలం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్మార్ట్ సిటీకి రంగంపేట పరిసర ప్రాంతం అన్ని విధాల అనుకూలంగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ఈ క్రమంలో అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. స్మార్ట్ సిటీ అభివృద్ధికి కావాల్సిన 500 ఎకరాల భూమితో పాటు అదనంగా మరో 2 వేల ఎకరాల వరకు ఇక్కడ అటవీ భూమి ఉంది. నీటి వనరులకు కల్యాణి డ్యాం, మరో పక్క గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఎస్వీ జూ పార్కు వరకు వస్తుంది. దీంతో నీటి వనరు సమస్య ఉండదు.
అటవీ ప్రాంతం కావడంతో భూములన్నీ ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు వాలుగా ఉంటాయి. డ్రైనేజీ వ్యవస్థకు ఇవి అనుకూలంగా ఉంటాయి. అనంతపురం- నాయుడుపేట రహదారికి ఇదే మార్గం మీదుగా వెళతాయి. మరో పక్క ఎస్వీ జూ పార్కు మీదుగా అలిపిరి బైపాస్ రోడ్డు ఇలా ఏ రంగ ంపేట పరిసర ప్రాంతం స్మార్ట్ సిటీకి అర్హతలు ఉన్నాయని రెవెన్యూ, తుడా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే ప్రభుత్వం ఎక్కడ నిర్మిస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. సొంత మండలానికి ఏమి చేయలేదని అపవాదు నుంచి బయటపడేందుకు ఇక్కడే స్మార్ట్ సిటీ నిర్మించాలనేది సీఎం చంద్రబాబు కోరికగా కనిపిస్తోంది. ఆ మేరకు అనధికారికంగా ఆయన ఇక్కడే స్మార్ట్ సిటీ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని జిలా ఉన్నతాధికారికి చెప్పినట్టు మరో అధికారి చెప్పారు.
భూముల గుర్తింపు
స్మార్ట్ సిటీకి అవసరమయ్యే భూముల వివరాలను రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే అందజేశారు. రంగంపేట, ఏర్పేడు, రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో బ్లాకులుగా భూములను గుర్తించి నివేదికను అందజేశారు. అయితే ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాలు కేంద్రం విధించిన నిబంధనలకు విరుద్ధంగా నగరానికి చాలా దూరంగా ఉన్నాయి. ఇప్పటికే ఐఐటీ ఇతర ప్రాజెక్టులన్నీ ఈ ప్రాంతాలకే రాబోతున్నాయి. దీంతో ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాలు స్మార్ట్కు అనుకూలంగా లేవని అధికారులు చెబుతున్నారు.
ఇక రేణిగుంట మండలం విషయానికి వస్తే తాత్కాలికంగా అభివృద్ధికి భూములు ఉన్నా భవిష్యత్ అవసరాలకు ఇక్కడ భూములు లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఇక మిగిలింది ఏ.రంగంపేట మాత్రమే కావడం ఇక్కడ కలిసివచ్చే అంశం. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఎస్వీ జూ పార్కుకు ఆనుకుని సుమారుగా కల్యాణి డ్యాం వరకు ప్రభుత్వ, ఫారెస్టు, డీకేటీ భూములను గుర్తించారు. 50 ఎకరాలను ఒక బ్లాకుగా విభజించారు. ఇలా మొత్తం 50 బ్లాకులను సిద్ధం చేశారు. ఒక్కో బ్లాకులో ఎలాంటి మౌలిక వసతులు లభ్యమవుతున్నాయో నివేదికలో పొందుపరిచారు. స్మార్ట్ సిటీకి అర్హత సాధించేం దుకు పక్కా ప్రణాళికతో కలెక్టర్ నివేదికను సిద్ధం చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పరిశీలిస్తే...
స్మార్ట్ సిటీకి నగరాన్ని ఎంపిక చేయాలంటే ఆ నగరానికి దరిదాపుల్లో 500 ఎకరాల భూములు ఉండాలి. ఆ భూముల్లో అవసరమయ్యే మౌలిక వసతు లు, బ్లాక్లుగా విభజించి అభివృద్ధి చేయడానికి అనువైన పరిస్థితులు ఉండాలి. స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేయడం కోసం ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఉండటంతోపాటు వాటిల్లో పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉండాలి. స్మార్ట సిటీగా ఎంపికైన ప్రాంతంలో విద్యుత్, డ్రైనే జీ, టెలిఫోన్, నీరు తదితర సౌకర్యాలు భూగర్భ విధానంతో కల్పిస్తారు. ఇందుకు అనుగుణంగా ఆప్రాంతం ఉండాలి. నీటి వసతి ఉండే ప్రాంతంగా ఉంటేనే స్మార్ట్ సిటీ ఎంపికకు అర్హత పొందుతుంది.