summative
-
జిరాక్స్ సెంటర్లలో సమ్మెటీవ్–1 ప్రశ్నాపత్రాలు
– ఒక రోజు ముందుగానే విద్యార్థుల చేతుల్లోకి – ప్రైవేటు పాఠశాలల మాయాజాలం పత్తికొండ రూరల్: పబ్లిక్ పరీక్షల తరహాలో సమ్మెటీవ్–1 పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దొడ్డిదారి వెతుకున్నారు. తమ పాఠశాలల విద్యార్థులకు ఒకరోజు ముందుగానే ప్రశ్నాపత్రాలను అందించి, వీటినే చదువుకుని రావాలని సూచిస్తూ వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీలను విద్యార్థులకు అందించినట్లు సమాచారం. గురువారం నిర్వహించాల్సిన ఏడో తరగతి ఇంగ్లిష్ ప్రశ్నపత్రం బుధవారమే పట్టణంలోని ఓ జిరాక్స్ సెంటర్లో దర్శనమివ్వడమే అందుకు నిదర్శనం. ఎమ్మార్సీ నుంచి బయటకెలా వచ్చాయి? విద్యార్థుల మూల్యాంకన పత్రాలను కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసే నిబంధన ఉండటం వల్ల వారు అడ్డదారిని వెతుక్కున్నట్లు తెలుస్తుంది. గురువారం పరీక్ష జరగాల్సిన 7వ తరగతికి చెందిన ఇంగ్లిష్ ప్రశ్నాపత్రం బుధవారం ‘సాక్షి’ చేతికి చిక్కింది. నిబంధనల ప్రకారం మండల రిసోర్స్ కేంద్రంలో భద్రపరచిన ప్రశ్నపత్రాలను ఏరోజు పేపర్‌ను ఆరోజు కేవలం 15నిమిషాల ముందు మాత్రమే సీల్ తెరవాలి. అయితే నిబంధనలను తుంగలో తొక్కిన కొందరు ప్రభుత్వ అధికారుల సహకారం వల్లనే ప్రశ్నాపత్రాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పేపర్ లీకేజీపై ఎంఈఓ కబీర్‌ను వివరణ కోరగా అలాంటివేమీ లేదన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే విచారణ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పాఠశాల వేళల్లో మార్పు
ప్రాథమిక స్కూళ్లలో 8 నుంచి 12.30 గంటల వరకు తరగతులు – మద్యాధ్యాహ్నం పరీక్షల నిర్వహణ – ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు స్టడీ అవర్స్ – 2 నుంచి 4.45 గంటల వరకు పరీక్షలు – ‘సాక్షి’ కథనాని స్పందన కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమన్యాల కింద నడుస్తున్న పాఠశాలల వేళల్లో మార్పు చేశారు. ఈ మేరకు జిల్లా కామన్ పరీక్షల బోర్డు చైర్మన్, డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13 నుంచి స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నెల 14 నుంచి సమ్మెటివ్–3 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో తికమక నెలకొందని ఈ నెల 10న ‘గందరగోళం’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి పరీక్షలకు, విద్యార్థుల తరగతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వేళల్లో కొంత మార్పు చేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించాలి. ప్రాథమికోన్నత పాఠశాలల్లో టీచర్లను సైతం ఉదయం తరగతులకు సగం మంది, మధ్యాహ్నం పరీక్షలకు సగం మంది టీచర్లు హాజరు కావాలని డీఈఓ సూచించారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 12 గంటల నుంచి స్టడీ ఆవర్స్ నిర్వహించి, 2 నుంచి 4.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలి. ప్రశ్నపత్రాలు లీకేజీ అయితే హెచ్‌ఎంలదే భాద్యత సమ్మెటివ్–3 పరీక్షలు మంగళవారం నుంచి మొదలయ్యాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు ఉండే పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి 12 గంటలకు తీసుకుపోయి 2 గంటలకు పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని, ఎక్కడైనా మాస్ కాపీయింగ్, ప్రశ్నపత్రాలు లీకేజీ అయితే ఆయా స్కూళ్ల హెచ్ఎంలే బాధ్యత వహించాలన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత 8, 9 తరగతులకు సంబంధించిన సమాధాన పత్రాల బండిళ్లను 100 శాతం బహిరంగా ముల్యాంకనానికి విద్యార్థుల పూర్తి వివరాలు తెలుపూ నమునాను జత పరిచి సంబంధిత ఎంఈఓ కార్యాలయాలకు భద్రతతో అందజేయాలన్నారు. -
పక్కాగా సమ్మెటివ్ అసెస్మెంట్
– జంబ్లింగ్‌లో స్పాట్ వాల్యుయేషన్ – నూరుశాతం ఆధార్ ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే సమ్మెటీవ్ అసెస్మెంట్ను పకడ్బందీగా చేపట్టాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి డీవైఈఓలు, ఎంఈఓలను ఆదేశించారు. పదో తరగతి తరహాలో పరీక్షలు జరపాలన్నారు. సీసీఈ పద్ధతిలో ప్రభుత్వం సమ్మెటివ్ పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా కొన్ని ఇబ్బందులున్నా పొరపాట్లకు తావులేకుండా పరీక్షలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఎస్ఎస్ఏ సమావేశ మందిరంలో డీవైఈఓలు, ఎంఈఓలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లతో సమ్మెటివ్ అసెస్మెంట్పై మీక్షించారు. సమ్మెటీవ్ పరీక్షలకుమండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలని, అందులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులందరిని భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో జరిగే పరీక్షలకు అబ్జర్వర్లు, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించాలని కోరారు. పరీక్ష ముగిసిన వెంటనే జవాబుపత్రాలను ఎంఈఓలకు అందజేయలన్నారు. వాటిని జంబ్లింగ్ పద్ధతిలో మండల స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో దిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఫార్మేటివ్ అసెస్మెంట్–1 మార్కుల ఆన్లైన్ నమోదులో నిర్లక్ష్యం వహించకుండా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 100 శాతం ఆధార్ ఎన్రోల్మెంట్ పూర్తి కాలేదని, అందులో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ పీఓ వై.రామచంద్రారెడ్డి, డీవైఈఓలు తహెరాసుల్తానా, శివరాముడు, వెంకటరామిరెడ్డి, ఎస్ఎస్ఏ ఎఎంఓ హుస్సేన్ సాహేబ్ పాల్గొన్నారు.