జిరాక్స్ సెంటర్లలో సమ్మెటీవ్–1 ప్రశ్నాపత్రాలు
పబ్లిక్ పరీక్షల తరహాలో సమ్మెటీవ్–1 పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దొడ్డిదారి వెతుకున్నారు.
– ఒక రోజు ముందుగానే విద్యార్థుల చేతుల్లోకి
– ప్రైవేటు పాఠశాలల మాయాజాలం
పత్తికొండ రూరల్: పబ్లిక్ పరీక్షల తరహాలో సమ్మెటీవ్–1 పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దొడ్డిదారి వెతుకున్నారు. తమ పాఠశాలల విద్యార్థులకు ఒకరోజు ముందుగానే ప్రశ్నాపత్రాలను అందించి, వీటినే చదువుకుని రావాలని సూచిస్తూ వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీలను విద్యార్థులకు అందించినట్లు సమాచారం. గురువారం నిర్వహించాల్సిన ఏడో తరగతి ఇంగ్లిష్ ప్రశ్నపత‍్రం బుధవారమే పట్టణంలోని ఓ జిరాక్స్ సెంటర్లో దర్శనమివ్వడమే అందుకు నిదర్శనం.
ఎమ్మార్సీ నుంచి బయటకెలా వచ్చాయి?
విద్యార్థుల మూల్యాంకన పత్రాలను కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే నిబంధన ఉండటం వల్ల వారు అడ్డదారిని వెతుక్కున్నట్లు తెలుస్తుంది. గురువారం పరీక్ష జరగాల్సిన 7వ తరగతికి చెందిన ఇంగ్లిష్ ప్రశ్నాపత్రం బుధవారం ‘సాక్షి’ చేతికి చిక్కింది. నిబంధనల ప్రకారం మండల రిసోర్స్ కేంద్రంలో భద్రపరచిన ప్రశ్నపత్రాలను ఏరోజు పేపర్‌ను ఆరోజు కేవలం 15నిమిషాల ముందు మాత్రమే సీల్ తెరవాలి. అయితే నిబంధనలను తుంగలో తొక్కిన కొందరు ప్రభుత్వ అధికారుల సహకారం వల్లనే ప్రశ్నాపత్రాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పేపర్ లీకేజీపై ఎంఈఓ కబీర్‌ను వివరణ కోరగా అలాంటివేమీ లేదన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే విచారణ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.