పక్కాగా సమ్మెటివ్ అసెస్‌మెంట్
పక్కాగా సమ్మెటివ్ అసెస్‌మెంట్
Published Thu, Sep 15 2016 10:10 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
– జంబ్లింగ్‌లో స్పాట్ వాల్యుయేషన్
– నూరుశాతం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేయాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే సమ్మెటీవ్ అసెస్‌మెంట్‌ను పకడ్బందీగా చేపట్టాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి డీవైఈఓలు, ఎంఈఓలను ఆదేశించారు. పదో తరగతి తరహాలో పరీక్షలు జరపాలన్నారు. సీసీఈ పద్ధతిలో ప్రభుత్వం సమ్మెటివ్ పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా కొన్ని ఇబ్బందులున్నా పొరపాట్లకు తావులేకుండా పరీక్షలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఎస్‌ఎస్‌ఏ సమావేశ మందిరంలో డీవైఈఓలు, ఎంఈఓలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లతో సమ్మెటివ్ అసెస్‌మెంట్‌పై మీక్షించారు. సమ్మెటీవ్ పరీక్షలకుమండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలని, అందులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులందరిని భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో జరిగే పరీక్షలకు అబ్జర్వర్లు, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించాలని కోరారు. పరీక్ష ముగిసిన వెంటనే జవాబుపత్రాలను ఎంఈఓలకు అందజేయలన్నారు. వాటిని జంబ్లింగ్ పద్ధతిలో మండల స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో దిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఫార్మేటివ్ అసెస్‌మెంట్–1 మార్కుల ఆన్‌లైన్ నమోదులో నిర్లక్ష్యం వహించకుండా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 100 శాతం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ పూర్తి కాలేదని, అందులో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ పీఓ వై.రామచంద్రారెడ్డి, డీవైఈఓలు తహెరాసుల్తానా, శివరాముడు, వెంకటరామిరెడ్డి, ఎస్‌ఎస్‌ఏ ఎఎంఓ హుస్సేన్ సాహేబ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement