super speciality
-
సూపర్ స్పెషాలిటీగా ఆర్టీసీ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: ఇంతకాలం సంస్థ ఉద్యోగులకే పరిమితమైన తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి సాధారణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అవతరించింది. ఇటీవలే సాధారణ ప్రజల(ఆర్టీసీ ఉద్యోగులు కానివారు)కు ఔట్ పేషెంట్లుగా చికిత్స ప్రారంభించిన ఆర్టీసీ.. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ సేవలతో ముందుకొచ్చింది. ఇందుకోసం 16 పడకలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను సిద్ధం చేసింది. నాలుగు ఆపరేషన్ థియేటర్లను కూడా కొత్తగా ఏర్పాటు చేసుకుంది. వీటిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం ఉదయం ప్రారంభించనున్నారు. ఏడు ఆపరేషన్ థియేటర్లు.. గతంలో అత్యవసర వైద్య సేవలు అందించే పరిస్థితి లేకపోవటంతో ఇక్కడికి వచ్చే రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేసేవారు. ఆ స్థితి నుంచి క్రమంగా కీలక చికిత్సలు, అత్యవసర ఆపరేషన్లు చేసే స్థాయికి తార్నాక ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. కొత్తగా మరో నాలుగు ఆపరేషన్ థియేటర్లను సిద్ధం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ భవనంపై కొత్తగా ఐసీయూ బ్లాక్‌ను నిర్మించారు. ఇందులో 16 బెడ్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులే కాకుండా సాధారణ ప్రజలకూ ఇందులో చికిత్స అందిస్తారు. నిమ్స్ తరహాలో తక్కువ చార్జీలు వసూలు చేయనున్నారు. రోజుకు రూ.3 వేలు, అంతకంటే తక్కువే వసూలు చేయనున్నట్టు సమాచారం. త్వరలో సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆధునిక వసతులతో ఉండే సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను కూడా ఆర్టీసీ ఆసుపత్రిలో సిద్ధం చేశారు. త్వరలో దీన్ని వినియోగంలోకి తేనున్నారు. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ ప్రారంభించిన తర్వాత, ఎస్ఐసీయూ బ్లాక్‌లో ఫ్యూమిగేషన్ చేసి, బ్యాక్టీరియా కల్చర్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ రిపోర్టు వస్తే వెంటనే దాన్ని అందుబాటులోకి తెస్తారని సమాచారం. సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందిన వారు, కీలక ఆపరేషన్లు చేయించుకున్న రోగులు.. కొంతకాలం ఐసీయూలో ఉండాల్సి వస్తే ఇందులో ఉంచుతారు. వార్డులో ఓవైపు దీన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇక ప్రతి డిపోలో హెల్త్ వాలంటీర్లు.. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ హిస్టరీతో కూడిన రికార్డులను సిద్ధం చేశారు. గుండె సమస్యలు, ఇతర తీవ్ర ఆరోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నట్లు గుర్తించిన ఉద్యోగులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తూ, వారు క్రమపద్ధతిలో మందులు వాడేలా చూస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలున్నాయని తేలిన 278 మంది ఉద్యోగుల్లో ఇద్దరు మందుల వాడకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొద్ది రోజుల్లోనే వారు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితి మిగతావారికి రావద్దనే ఉద్దేశంతో ప్రతి డిపోలో సుశిక్షితులైన ఇద్దరు హెల్త్ వర్కర్లను నియమించాలని ఆర్టీసీ నిర్ణయించింది. వీరు ఉద్యోగులకు ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించడంతోపాటు వారి హెల్త్ హిస్టరీ ఆధారంగా మందులు వాడేలా చూస్తారు. అలాగే వీరి వద్ద డిజిటల్ బీపీ చెకింగ్ యంత్రాలుంటాయి. వాటి ద్వారా బీపీని మానిటర్ చేస్తూంటారు. ఉద్యోగులకు సీపీఆర్‌పై శిక్షణ ఇస్తారు. ఇప్పుడు ఈ హెల్త్ వర్కర్లకు శిక్షణ ప్రారంభించనున్నారు. -
సర్కారీ వైద్యం సూపర్
జిల్లా కేంద్రానికి దూరంగా.. నల్లమల అభయారణ్యానికి దగ్గరగా ఉన్న మార్కాపురం పట్టణంలో గత ప్రభుత్వంలో మెరుగైన వైద్యం అందేది కాదు. ఇక్కడి జిల్లా వైద్యశాలలో వైద్యుల కొరతతో పాటు సరైన మౌలిక సదుపాయాలు కూడా ఉండేవి కావు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వైద్యశాల రూపురేఖలు మారిపోయాయి. మెరుగైన వైద్యసేవలందించేందుకు కోటి రూపాయలతో అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు అవసరమైన స్పెషలిస్టు వైద్యులు, సిబ్బందిని నియమించారు. ఫలితంగా ఈ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. మార్కాపురం(ప్రకాశం జిల్లా): గత ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. 2019 వరకు మార్కాపురం జిల్లా వైద్యశాలలో 10 నుంచి 12 మంది మాత్రమే డాక్టర్లు ఉండేవారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చిన తరువాత వైద్య రంగానికి మహర్దశ పట్టింది. ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు–నేడు పథకాన్ని అమలు చేశారు. ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి జిల్లా వైద్యశాలకు కో చైర్మన్‌గా ఉన్నారు. ఇక్కడి సమస్యలను ఆయన ప్రభుత్వం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లటంతో పశ్చిమ ప్రకాశం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో స్పెషలిస్టు డాక్టర్లను నియమించారు. పశ్చిమ ప్రకాశం ముఖ్య కేంద్రమైన మార్కాపురంలోని జిల్లా వైద్యశాలలో ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వం 12 మంది డాక్టర్లను నియమించింది. దీంతో మొత్తం 32 మంది డాక్టర్లు ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లోని సుమారు 8 లక్షల మంది ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత తీరింది. ప్రభుత్వం ఇటీవల ఇద్దరు పీడియాడ్రిక్, ముగ్గురు గైనకాలజిస్టులు, ఇద్దరు జనరల్ సర్జన్లు, ఇద్దరు ఈఎన్టీ సర్జన్లు, ఒక డెర్మటాలజిస్టు, ఇద్దరు ఆప్తమాలజిస్టులు, ఇద్దరు ఎనస్తీషియన్లు, ఒక మైక్రోబయాలజిస్టు, ఇద్దరు ఆర్ధోపెడిక్లు, ఇద్దరు జనరల్ మెడిసిన్, ఒక ఫోరెన్సిక్ డాక్టర్‌ను నియమించారు. వీరు కాక ఐదుగురు హౌస్ సర్జన్లు కూడా అందుబాటులోకి వచ్చారు. నెలకు 300 ఆపరేషన్లు పూర్తిగా డాక్టర్ల నియామకంతో నెలకు 300 సాధారణ కాన్పులు జరుగుతున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం 15 రోజుల వ్యవధిలో సాధారణ డెలివరీలు, ఈఎన్టీ సర్జరీలు, ఆర్ధో సర్జరీలు, సిజేరియన్లు, పిండి కట్టులతో కలిపి సుమారు 150 జరిగాయి. 24 గంటలు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 400 నుంచి 450 మందిదాక ఔట్ పేషెంట్లు వైద్యశాలకు వచ్చి చికిత్స పొందుతున్నారు. వంద బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వైద్యశాలలో ఈసీజీ, వెంటిలేటర్లు, కంప్లీట్ ఆటో ఎనలైజర్, డయాలసిస్, హార్మోన్స్ ఎనలైజర్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కిడ్నీ, లివర్, సీరమ్ అన్ని రకాల రక్త పరీక్షలు హార్మోన్స్ టెస్టు, థైరాయిడ్, గ్యాస్ ఎనాలసిస్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు మంచి సేవలు అందించండి ప్రజలకు జిల్లా వైద్యశాల వైద్యులు మంచి సేవలు అందించాలి. డాక్టర్ల కొరత కూడా తీరింది. వైద్యశాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది వచ్చినా పరిష్కరిస్తాం. వైద్యశాలలో ఆధునిక వైద్య పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. – కేపీ నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే సేవలు అందించేందుకు సిద్ధం మార్కాపురం జిల్లా వైద్యశాలలో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. సిబ్బంది కొరత కూడా తీరింది. రోజూ 450–500 మంది వరకు ఓపీ చూస్తున్నాం. నెలకు 300 వరకు వివిధ రకాల ఆపరేషన్లు చేస్తున్నాం. 12 ఐసీయూ బెడ్లు, 28 వెంటిలెటర్లు, 102 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్, జిల్లా వైద్యశాల, మార్కాపురం రోగులకు మంచి వైద్యం అందుతోంది నేను మార్కాపురం పట్టణంలో విజయ టాకీస్ ఏరియాలో ఉంటాను. ఇటీవల నాకు జ్వరం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం జిల్లా వైద్యశాలకు వెళ్లాను. అక్కడ డాక్టర్లు, సిబ్బంది నాకు అన్ని రకాల పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. జ్వరం తగ్గింది. జిల్లా వైద్యశాలలో ఇప్పుడు రోగులకు మంచి సేవలు అందుతున్నాయి. డాక్టర్ల సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలి. – మీరావలి, మార్కాపురం రూ.కోటితో అభివృద్ధి పనులు గడిచిన ఏడాదిన్నర కాలంలో జిల్లా వైద్యశాలలో కోటి రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్క చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి వైద్యారోగ్యశాఖ మంత్రితో మాట్లాడి రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. ఇందులో ఒకటి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ కాగా మరొకటి ఆక్సిజన్ న్యాచురల్ ప్లాంట్. నిరంతరాయంగా ఒకే సమయంలో వంద మందికి ఆక్సిజన్ అందించే అవకాశం ఉంది. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు 12 ఐసీయూ బెడ్లను కూడా ఏర్పాటు చేశారు. సుమారు రూ.50 లక్షలతో జిరియాట్రిక్ (వృద్దుల వార్డు)ను నిర్మించారు. దీంతోపాటు కరోనా టెస్టులు చేసేందుకు వీఆర్డీఎల్ ల్యాబ్‌ను కూడా నిర్మించారు. -
సామాన్యులకు ఊపిరి పోస్తున్న జీజీహెచ్ ‘సూపర్’
పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందనున్నాయి. సామాన్యులకు ఊపిరి పోస్తున్న జిల్లా సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా జీజీహెచ్ అభివృద్ధికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాజాగా న్యూరో, పీడియాట్రిక్, ప్లాస్టిక్, యూరాలజీలకు సంబంధించి సర్జరీ విభాగాలు, నెఫ్రాలజీ, న్యూరో ఫిజీషియన్ సేవలు అందించేందుకు రంగం సిద్ధమైంది. ఒంగోలు అర్బన్: కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచిన ఒంగోలు జీజీహెచ్‌కు నిత్యం పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. అత్యవసర సేవల కోసం పొరుగు జిల్లాల నుంచి కూడా ఇక్కడకు పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. దీంతో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చొరవతో ఆస్పత్రిలో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను సైతం పూర్తి చేసి మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా దీనిని తీర్చిదిద్దేందుకు ఇటీవల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. జీజీహెచ్‌లో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, అందుకు తాను ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని బాలినేని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. దీంతో సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, ఆర్ఎంఓ చైతన్యవర్మ, ఇతర అధికారులు జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. జీజీహెచ్ భవనంలోని 112 గదిలో సూపర్ స్పెషాలిటీ ఓపీని పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 120లో అత్యాధునిక పరికరాలతో 40 పడకల సూపర్ స్పెషాలిటీ వార్డును సిద్ధం చేయనున్నారు. ఆమేరకు పనులను వడివడిగా నిర్వహిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీలో న్యూరో, పీడియాట్రిక్, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సంబంధించిన విభాగాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. అలాగే నెఫ్రాలజీ, న్యూరో ఫిజీషియర్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అభివృద్ధి ఇలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీజీహెచ్‌లో అభివృద్ధి చేసిన పనుల్లో కొన్ని రూ.2 కోట్లతో 100 పడకల ఐసీయూ కాంప్లెక్స్, రూ.2 కోట్లతో 100 ఆక్సిజన్ బెడ్లతో కోవిడ్ ప్రత్యేక గదులు, టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ఆడిటోరియం రూ.3.5 కోట్లతో పూర్తి చేశారు. అంతేకాకుండా రూ.7.5 కోట్లతో ఎంఆర్ఐ, రూ.2.5 కోట్లతో సిటీ స్కాన్ యంత్రాలు ఏర్పాటు చేసి రోగులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి సేవలందిస్తున్నారు. అలాగే రెండు భారీ ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ప్రజలకు అన్నీ వైద్య సేవలు జీజీహెచ్‌లో అందాలి జీజీహెచ్‌లో ప్రజలకు అన్నీ రకాల వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్నీ విభాగాల్లో సర్జరీలు నిర్వహించేలా చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా అందించాల్సిన సేవలను పూర్తి స్థాయిలో నాణ్యంగా అందించేందుకు అన్నీ విధాలుగా సిద్ధం చేస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ వార్డు ఏర్పాటుతో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలవుతుంది. జీజీహెచ్‌లో వైద్య సేవలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రజలకు మంచి వైద్య సేవలందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. – దినేష్ కుమార్, కలెక్టర్ జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు ఆలోచించి ఆ దిశగా చర్యలు చేపట్టాం. త్వరలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. నిరంతరం సాధారణ ఓపీలను పర్యవేక్షిస్తూ రోగులకు వైద్య సేవలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించేలా చూస్తున్నాం. – భగవాన్ నాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
ఏపీలో సూపర్ స్పెషాలిటీ వైద్యానికి బ్రేక్
-
సూపర్ స్పెషాలిటీ మెడికల్ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): సూపర్ స్పెషాలిటీ (డీఎం/ఎంసీహెచ్) మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం జూలై 31న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. 13 స్పెషాలిటీస్‌లో అడ్మిషన్ల కోసం మొత్తం 752 మంది దరఖాస్తు చేసుకోగా, 709 మంది పరీక్షకు హాజరయ్యారు. డీఎం విభాగం కార్డియాలజీలో డాక్టర్ ఎల్‌కేవీ కుమార్ కేశంశెట్టి (ఏయూ), ఎండోక్రైనాలజీలో డాక్టర్ నామాని జ్ఞానేష్ (ఓయూ), గ్యాస్ట్రో ఎంట్రోలజీలో డాక్టర్ వేముల వంశీకృష్ణ (ఏయూ), నియోనాటాలజీలో డాక్టర్ కోగంటి రాజా అశోక్ (నాన్‌లోకల్), నెఫ్రాలజీలో డాక్టర్ పులగం శివతేజ (ఏయూ), న్యూరాలజీలో డాక్టర్ పప్పాల క్రాంతి (ఏయూ) మొదటి ర్యాంకులు సాధించారు. అలాగే ఎంసీహెచ్ విభాగం కార్డియో థొరాసిక్ సర్జరీ(సీటీసీ)లో డాక్టర్ ఎన్.హర్షవర్థన్ (ఓయూ), జెనిటో యూరినరీ సర్జరీలో డాక్టర్ కిరణ్ యు (ఓయూ), న్యూరో సర్జరీలో డాక్టర్ ఈడ్పుగంటి రాజ్యలక్ష్మి (నాన్‌లోకల్), పీడియాట్రిక్ సర్జరీలో డాక్టర్ రవి హిమజ (ఏయూ), ప్లాస్టిక్ సర్జరీలో డాక్టర్ అమూల్య పేర్ల (ఏయూ), సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో డాక్టర్ డీవీ జయదీప్ నేతా (ఓయూ), సర్జికల్ అంకాలజీలో డాక్టర్ ఫణీంద్రకుమార్ నాగిశెట్టి (ఏయూ) మొదటి ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్లో పొందవచ్చు. -
కలగానే సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి
మంగళగిరి, న్యూస్‌లైన్ :మంగళగిరిలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని నేటి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రులు కె. రోశయ్య, ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ ప్రతిపాదనలు సీఎం షేషీకి పరిమితమయ్యాయి. మంగళగిరిలోనే సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయిస్తామని జిల్లా ప్రజప్రతినిధులు చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చకపోవడంతోనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ - గుంటూరు నగరాల మధ్య వున్న మంగళగిరి టీబీ శానిటోరియం ప్రాంతంలో కోస్తా జిల్లాల ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు వున్నాయి. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంగళగిరి పర్యటనకు వచ్చిన సందర్భంగా మంగళగిరి టీబీ శానిటోరియం ప్రాంగణంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఆయన మరణానంతరం దీనిపై ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. జిల్లాలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఓ కేంద్ర మంత్రి వున్నా ఉపయోగం లేకుండాపోయింది. ఇక ఎమ్మెల్యేల సంగతి సరేసరి. మంగళగిరి, ఆత్మకూరు పరిధిలో 214 ఎకరాల సువిశాలమైన భూమి ఉంది. కాలుష్యరహితంగా రెండు కొండల నడుమ పచ్చదనంతో కళకళలాడుతూ ఉండే వాతావరణంలో 1962లో టీబీ శానిటోరియం ఏర్పాటు చేశారు. 1972లో 50 ఎకరాలను ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌కు కేటాయించారు. మరో 50 ఎకరాలను 2011లో రాష్ట్రంలోనే ప్రపథమంగా ఏర్పాటు చేసిన 10వ జాతీయ ప్రకృతి విపత్తుల సహాయ దళానికి కేటాయించారు. అదే ఏడాది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ సెన్సైస్ రీసెర్చ్ అకాడమీ క్యాంపస్‌కు 75 ఎకరాలు కేటాయించారు. మిగిలిన భూమి ఖాళీగా వుంది. దీనిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 30 నుంచి 40 ఎకరాల వరకు భూమి అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో టీబీ శానిటోరియం ప్రాంగణం సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి అనుకూలంగా వుంటుందని గత ఏడాది శాసనమండలి హామీల అమలు కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఏ విధమైన ఆదేశాలు జారీ కాలేదు. హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ తదితర అధికారులు కూడా అప్పట్లోనే శానిటోరియం ప్రాంగణాన్ని పరిశీలించి వెళ్లారు. ఇదిలావుండగా, విజయవాడ ప్రాంతంలోనే సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయిస్తామని అక్కడి నేతలు గతంలో ప్రకటించారు. దీనిపై వివాదం జరగడంతో శంకుస్థాపన పనులు నిలిచి పోయాయి. రైలు, రోడ్డు రవాణాతో పాటు విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ వున్న జాతీయ రహదారి పక్కనే టీబీ శానిటోరియం ప్రాంగణం వుండటం కూడా ఆసుపత్రి ఏర్పాటుకు ఎంతో అనుకూలంగా వుంటుందని భావిస్తున్నారు. పేద ప్రజలకు అందుబాటులో వుండే విధంగా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని మంగళగిరిలో ఏర్పాటు చేయించేందుకు జిల్లా ప్రజాప్రతినిధులు పోరాడతారో లేక విజయవాడ కు అప్పగిస్తారో వేచి చూడాల్సిందే.