supervisors posts
-
అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు
సాక్షి, అమరావతి: మహిళా, శిశుసంక్షేమశాఖలో అంగన్వాడీ వర్కర్లను గ్రేడ్–2 సూపర్వైజర్లుగా నియమించేందుకు ఉద్దేశించిన ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. సూపర్ వైజర్ల నియామక ప్రక్రియ కొనసాగించేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ విషయంలో గతంలో ఉన్న స్టేను హైకోర్టు ఎత్తేసింది. అంగన్వాడీ వర్కర్లను సూపర్వైజర్లుగా నియమించేందుకు వీలుగా జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అంగన్వాడీ వర్కర్లను గ్రేడ్–2 సూపర్వైజర్లుగా నియమించేందుకు వీలుగా 560 పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి రాతపరీక్ష నిర్వహించింది. రాతపరీక్షకు 45 మార్కులు, ఇంగ్లిషులో ప్రావీణ్యానికి 5 మార్కులు నిర్ణయించింది. కొందరు అభ్యర్థులు తమకు రాతపరీక్ష మాత్రమే నిర్వహించి, ఇంగ్లిషు ప్రావీణ్యపరీక్షను నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇంగ్లిష్ ప్రావీణ్యపరీక్ష నిర్వహించకుండానే తుది మెరిట్ లిస్ట్ ప్రకటించేందుకు అధికారులు రంగం సిద్ధంచేస్తున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని వారు కోరారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. నియామక ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. ప్రభుత్వ న్యాయవాది శశిభూషణ్‌రావు వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్‌కు అనుగుణంగానే పోస్టుల భర్తీప్రక్రియ చేపట్టామన్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికే ఇంగ్లిష్ ప్రావీణ్యపరీక్ష నిర్వహిస్తామని, ఈ విషయాన్ని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు. మెమో ద్వారా కూడా స్పష్టతనిచ్చామన్నారు. స్టే వల్ల భర్తీప్రక్రియ మొత్తం నిలిచిపోయిందని, దీనివల్ల పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ గతంలో విధించిన స్టే ఎత్తేశారు. పిటిషన్లను కొట్టేశారు. -
మద్యం షాపులో పనిచేస్తా.. నిషేధానికి కృషి చేస్తా
సాక్షి, చెన్నేకొత్తపల్లి: అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం వెంకటంపల్లికి చెందిన ఈమె పేరు వన్నా స్వప్న. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశారు. తానూ ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేస్తానంటూ సూపర్వైజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. భర్త వ్యవసాయం చేస్తుండగా.. ఆ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన స్వప్నను.. మహిళగా ఈ ఉద్యోగం ఎలా చేయగలరని పలువురు ప్రశ్నించారు. ఆమె సమాధానమిస్తూ.. ‘నా భర్త మల్లికార్జునరెడ్డి సహకారంతోనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేశా. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. స్వచ్ఛమైన మనసుండాలే కానీ.. ఏ ఉద్యోగమైతే ఏంటి. నాకు ఈ ఉద్యోగమొస్తే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా. మద్యం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తా’ అని చెప్పింది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు సూపర్వైజర్స్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేల్స్‌మెన్ ఉద్యోగ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించినట్టు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ఎక్సైజ్ అధికారులు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. జిల్లాలో 198 సూపర్వైజర్ పోస్టులకు 5019 మంది, 495 సేల్స్‌మెన్ పోస్టులకు 4208 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఇందులో వికలాంగులు సూపర్వైజర్ ఉద్యోగాలకు 165 మంది, సేల్స్‌మెన్ ఉద్యోగాలకు 111 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరికి 1శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. గైర్హాజరైన వారిని అనర్హులుగా ప్రకటిస్తామన్నారు. 13న ఇంటర్వ్యూలు ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగాలకు (సూపర్వైజర్స్, సేల్స్‌మెన్) సంబంధించి ఈనెల 13న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ ఎస్. డిల్లీరావు తెలిపారు. ఇంటర్వ్యూలు ఉదయం 9 గంటల నుంచి కదిరి, కళ్యాణదుర్గం, అనంతపురం, పెనుకొండ, ధర్మవరం రెవెన్యూ డివిజినల్ అధికారి(ఆర్డీఓ) కార్యాలయాల్లో నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా సూపర్వైజర్ పోస్టులకు, అనంతరం సేల్స్‌మెన్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని అభ్యర్థులు సంబంధిత ఆర్డీఓ అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని సూచించారు. ఇంటర్వ్యూ బోర్డులో ఆర్డీఓ చైర్మన్‌గా, కో–ఆపరేటివ్, ఎక్సైజ్ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సిన అభ్యర్థుల సెల్‌కు సంక్షిప్తం సందేశం పంపుతామని పేర్కొన్నారు. -
వైద్యంపై నిర్లక్ష్యం
సాక్షి, మంచిర్యాల : పల్లెల్లో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. గ్రామీణులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ల(ఆరోగ్య కార్యకర్త) నియామకాలు చేపట్టకపోవడంతో గ్రామీణులకు వ్యాధులపై అవగాహన కరువైంది. పురుష ఆరో గ్య కార్యకర్తలు మలేరియా, పైలేరియా, డెంగీ ఇతర సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేయడం, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంతోపాటు నెలకోసారి గ్రామంలో ప్రతి ఇంటికీ తిరిగి ప్రజలకు ఆరోగ్య విషయాలు తెలపాలి. మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఇమ్యూనైజేషన్(పల్స్ పోలియో, గర్భిణులు, బాలింతల కు అవగాహన) కార్యక్రమాలు చేపట్టాలి. అయితే జిల్లాలో సిబ్బంది కొరత కారణం గా పనిభారం ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తు న్న వారిపైనే పడుతోంది. చాలా గ్రామాల్లో ఇరువురు కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తలను ఆశ్రయించి వారి ద్వారా రిపోర్టులు సేకరించి అధికారులకు నివేదిస్తున్నట్లు సమాచారం. వీరి అలసత్వం కారణంగా పల్లెల్లో వ్యాధులపై ప్రజలకు అవగాహన కరువవుతోంది. సగం పోస్టులు ఖాళీ జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 7,25,048 మంది, సాధారణ ప్రాంతాల్లో 20,63,596 మంది మొత్తం 27,88,644 మంది జనాభా ఉంది. గిరిజన ప్రాంతాల్లో 3 వేలు, సాధారణ ప్రాంతాల్లో 5 వేల జనాభాకు ఒక్కొక్కరి చొప్పున జిల్లాలో మొత్తం 653 మంది మహిళ, అంతే మంది పురుష ఆరోగ్య కార్యకర్తలు ఉండాలి. అయితే జిల్లా వ్యాప్తంగా 653 మహిళ కార్యకర్తలకు 518 పోస్టులు మంజూరయ్యాయి. అందులో కేవలం 420 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 653 మంది పురుష కార్యకర్తల పోస్టులకు గానూ 304 పోస్టులు మాత్రమే మంజూరు కాగా అందులో 140 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న పురుష, మహిళ కార్యకర్తల్లో 20 మంది మాత్రమే రెగ్యులర్ గా ఉన్నారు. మిగిలిన వారందరూ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. దీనికి తోడు ఆరోగ్య కార్యకర్తల పనులు పర్యవేక్షించాల్సిన 36 హెల్త్ సూపర్ వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 95 పురుష సూపర్ వైజర్ పోస్టులు మంజూరు కాగా 70 మంది పనిచేస్తున్నారు. 97 మహిళా సూపర్వైజర్లు పోస్టులుంటే 86 మంది ఉన్నారు. ఎనిమిదేళ్ల నుంచి నియామకాలు లేవు.. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పురుష అభ్యర్థులు బోగస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందారని ఎనిమిదేళ్ల క్రితమే కేంద్రం గుర్తించింది. జూన్, 2002కు ముందు సర్టిఫికెట్లు పొందిన వారికే ఉద్యోగాలు కల్పించాలంటూ అప్పట్లోనే ఆదేశించింది. దీంతో ఆ తర్వాత విద్యార్హత పొందిన అభ్యర్థులు మాకూ అవకాశం కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఇంతవరకు ఆ తీర్పు వెలువడలేదు. దీంతో పురుష మల్టీపర్పస్ హెల్త్ నియామకాలకు బ్రేక్ పడింది. మరోపక్క ఏ సమస్య లేని మహిళా ఆరోగ్య కార్యకర్తల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో పోస్టుల భర్తీకి గ్రహణం పట్టుకుంది. దీంతో గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాలో సగానికి పైగా పోస్టులు ఖాళీలు ఉండడం, పనిచేస్తున్న వారందరూ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తుండడంతో పల్లెల్లో వైద్యసేవలు అందడం లేదు. కొరవడిన పర్యవేక్షణ పల్లెల్లో పర్యటించి వ్యాధులపై అవగాహన కల్పించాల్సిన సిబ్బంది సరిగా పని చేస్తున్నారా? లేదా? అని తెలుసుకోవాల్సిన వైద్యాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విషజ్వరాలు, మలేరియా ప్రబలి పరిస్థితి చేయి దాటిన ప్పుడే స్పందించడం అధికారులకు పరిపాటిగా మారింది. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుంది. హెల్త్ సూపర్వైజర్లు పదవీ విరమణ పొందుతుంటే ఆ పోస్టులు హెల్త్ వర్కర్లతో భర్తీ చే స్తున్న ప్రభుత్వం ఆరోగ్య కార్యకర్తల పోస్టులను భర్తీ చేయకపోవడంతో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి జిల్లాలో ఖాళీగా ఉన్న ఆరోగ్య కార్యకర్తల పోస్టులు వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా మలేరియా అధికారి అల్హం రవి అడుగగా.. పురుష మల్టీ పర్పస్ హెల్త్‌వర్కర్ల అంశం కోర్టులో ఉండడంతో నియామకాలు చేపట్టడం లేదన్నారు. మహిళ వర్కర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉంది.