కార్మికుల ఆందోళనలపై ప్రభుత్వం ఆంక్షలు
వైఎస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి
గుంటూరు వెస్ట్: కార్మికులు తమ హక్కుల కోసం ఆందోళనలు చేయడానికి వీల్లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంక్షలు విధిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సన్నాహంగా గుంటూరులోని మహిమా గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ కార్మికుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఫ్యాక్టరీ చట్టంలో మార్పులు తీసుకువచ్చి యాజమాన్యానికి అనుకూలంగా మార్పులు చేస్తూ కార్మికుల నెత్తిన కుచ్చుటోపీ పెడుతోందని దుయ్యబట్టారు. సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి వహీదా నిజాం మాట్లాడుతూ సెప్టెంబర్ 2న జరిగే సమ్మెలో కార్మికులు ఐక్యంగా పాల్గొని కార్మికసత్తాను పాలకులకు తెలియజేయాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.గఫూర్ మాట్లాడుతూ గత సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో 17 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని అన్నారు. ఆ సమ్మె సందర్భంగా కార్మికసంఘాలతో చర్చిస్తామని చెప్పిన కేంద్రం ప్రభుత్వం 10 నెలలు గడిచినా ఇంకా చర్చించకపోవడం కార్మిక సమస్యలపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి వెల్లడిస్తోందన్నారు.. ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు విస్సా క్రాంతికుమార్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమాలే శరణ్యమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకుడు సీహెచ్.నర్సింగరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు వీరాస్వామి, ఏఐయూటీసీ రాష్ట్ర నాయకులు సుధీర్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామారావు, టీయూసీసీ రాష్ట్ర నాయకులు సుందర రామరాజు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, అధ్యక్షుడు చలసాని రామారావు, ఎంఎల్సీ చంద్రశేఖరరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల సుందర్‌రెడ్డి, కార్యదర్శి రూబెన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకష్ణమూర్తి, వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.