surender rao
-
అప్పు చెల్లించలేదని భార్యను తీసుకెళ్లారు
మంచిర్యాలసిటీ: అప్పు చెల్లించలేదని ఓ వ్యాపారి రుణగ్రహీత భార్య, ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి దాచిపెట్టాడు. సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుడు జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావుకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. నెన్నెల మండలం ఆవ డం గ్రామానికి చెందిన బాసవేన హన్మంతు, సరోజ దంపతులకు, రుషిత్ (3), ఐసు(1) సంతానం. అదే మండలం చిత్తాపూర్‌కు చెందిన రైస్‌మిల్లు వ్యాపారి సందాని వద్ద రెండేళ్ల కిందట రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుంచి అసలుతో పాటు వడ్డీ చెల్లించలేదు. ఈ క్రమంలో హన్మంతు రెండు నెలల కిందట తన కాపురాన్ని ఆవడం నుంచి మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని దీపక్‌నగర్‌కు మార్చాడు. విషయం తెలుసుకున్న సందాని.. హన్మంతు భార్య, ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి ఓ ఇంట్లో దాచి పెట్టాడు. నెల క్రితం హన్మంతు తర్వాత భార్యా పిల్లలు ఉంటున్న ఇంటి అడ్రస్ తెలుసుకొని వెళ్లడంతో సందాని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆదివారం మరోసారి వెళ్లానని, కొడుకు నాన్నా అంటూ నా వెంట రావడంతో తీసుకొచ్చానని తెలిపాడు. ‘అప్పు తీర్చితేనే నీ భార్యా పిల్లలు నీ వెంట వస్తారు.. లేకుంటే చంపేస్తా’ అని బెదిరించడంతో నెన్నెల పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇది సివిల్ కేసు, కోర్టుకు వెళ్లమని ఎస్ఐ చెప్పడంతో గత్యంతరం లేక జేసీకి ఫిర్యాదు చేయడానికి వచ్చానని రోదిస్తూ విలేకరులకు చెప్పాడు. వడ్డీ సహా అప్పు తీర్చుతానని ఎంత ప్రాథేయపడినా వ్యాపారి కనికరించడం లేదని వాపోయాడు. -
వైద్యచికిత్సల కోసం బెయిలివ్వండి: మోపిదేవి వెంకట రమణారావు
సీబీఐ ప్రత్యేక కోర్టుకు మోపిదేవి వినతి సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావుకు వైద్య చికిత్సల కోసం మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది సురేందర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు మోపిదేవి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం విచారించారు. మోపిదేవిని పరీక్షించిన కేర్ వైద్యులు ఆయనకు మొదటగా స్టెరాయిడ్లతో కూడిన ఇంజక్షన్లు ఇవ్వాలని, ఫలితం లేకపోతే శస్త్రచికిత్స చేయాలన్నారని సురేందర్‌రావు వివరించారు. వైద్యం పొందడం పౌరుడి కనీస హక్కని, మోపిదేవి తీవ్రమైన అనారోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు కనీసం మూడు నెలలైనా బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ధారిస్తేనే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఈ కోర్టు గతంలో స్పష్టం చేసిందని, మొదట స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇస్తారని మోపిదేవి చెబుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణార్హం కాదని సీబీఐ స్పెషల్ పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈనెల 16కు వాయిదా వేశారు. -
మూడు నెలలు బెయిల్ ఇవ్వండి: మోపిదేవి వెంకటరమణ
ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మోపిదేవి సీబీఐకి నోటీసులు... విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, వైద్యచికిత్సల కోసం మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. వైఎస్ జగన్ కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న మోపిదేవి తరఫున ఆయన న్యాయవాది సురేందర్‌రావు గురువారం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా తాను తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తాను ఇటీవల కేర్ ఆసుపత్రి వైద్యులతో పరీక్షలు చేయించుకున్నానని మోపిదేవి తెలిపారు. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారని చెప్పారు. ఈ మేరకు కేర్ వైద్యుల అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించారు. చికిత్సలో భాగంగా డాక్టర్ల పర్యవేక్షణలో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్లు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇంజెక్షన్లకు తగ్గకపోతే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో తనకు మూడు నెలల బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు... సీబీఐకి నోటీసులు జారీచేస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.