బడ్జెట్ వరాలపై దేశవ్యాప్త ఆసక్తి
దుగ్గిరాల: సబ్సిడీలు, ప్రణాళికా వ్యయంలో మార్పుల వల్ల ద్రవ్యలోటు 4.5 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగిందని రిజర్వుబ్యాంకు అనుబంధ సంస్థ ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ వైస్ చాన్సలర్ సూర్యదేవర మహేంద్రదేవ్ చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఏ విధంగా ఉంటుందోనని దేశం యూవత్తూ ఎదురుచూస్తోందని అన్నారు.
ప్రముఖ చిత్రకారుడు, సాహితీవేత్త సూర్యదేవర సంజీవదేవ్ శత జయంతి ఉత్సవాల ముగింపు సభ నిర్వహణకు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామం వచ్చిన ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఆదాయ పన్ను పరిమితి పెంపు, గృహనిర్మాణ పన్ను మినహాయింపు, ఊపాధి అవకాశాల కోసం మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
ద్రవ్యోల్బణం తగ్గితే నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టి సాధారణ ప్రజలకు ఉపశమనం లభిస్తుందన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 9 శాతంగా ఉందని చెప్పారు. ప్రస్తుత బడ్జెట్ కంటే వచ్చే ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో సంస్కరణలు ఎక్కువగా ఉంటాయన్నారు. మౌలిక వసతులపై పన్ను పదేళ్ల వెనుక తేదీ నుంచి చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా గ్లోబల్ ఇన్వెస్టర్ల రాక తగ్గిందని పేర్కొన్నారు. అన్ని రకాల పరిశ్రమలు తరలివస్తే సీమాంధ్ర కూడా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. రైతుల రుణ మాఫీపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వివరించారన్నారు.
పంటల మద్దతు ధర పెంచాలని కోరేకన్నా దిగుబడులు పెంచటంపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. సాధార ణ రకం వరికి రూ.1360 మద్దతు ధర ప్రకటించినట్టు చెప్పారు. దేశమంతటా ఒకే మద్దతు ధర ప్రకటించటం వల్ల దిగుబడి ఎక్కువగా ఉండే పంజాబ్ వంటి రాష్ట్రాలకు లాభం ఉంటుందని, దిగుబడి తక్కువగా ఉన్న ఆంధ్ర వంటి రాష్ట్రాలకు అంతగా లాభం ఉండటం లేదని వివరించారు. రాష్ట్రంలో సాగు పద్ధతులు, సాగునీటి సరఫరా విధానాల్లో మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు.