Sushil ravela
-
పోలీసుల ముందు హాజరైన రావెల సుశీల్
ఓ మైనారిటీ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి నిర్భయ చట్టం కింద కేసులో బుక్కయిన మంత్రి రావెల కిశోర్ తనయుడు సుశీల్, అతని కారు డ్రైవర్ రమేష్‌లు ఆదివారం బంజారాహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యారు. షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్న వీరు కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేశారు. ఈ నెల 3న బంజారాహిల్స్ అంబేద్కర్ నగర్లో ఓ మహిళా టీచర్ నడుచుకుంటూ వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న రావెల సుశీల్ ఆమె పట్ల అసభ్యకరంగా వ్యవహరించి, కారులో లాగేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
రావెల సుశీల్ కారు సీజ్
బంజారాహిల్స్: ఏపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు రావెల సుశీల్(24) పోలీసు కస్టడీ గురువారం కూడా కొనసాగింది. ఆయనను బంజారాహిల్స్ పోలీసులు రెండో రోజైన గురువారం కూడా ఘటన వివరాలపై విచారించారు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రావెల కిశోర్ తన కారులో వెళ్తూ.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఫాతిమా బేగం అనే యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు జైలులో ఉన్న ఆయనతో పాటు డ్రైవర్ రమేష్‌ను తమ కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ రోజు వీరు ప్రయాణించిన కారు(ఏపీ 07 సీకే 1777)ను సీజ్ చేశారు. ఈ కారు నారాయణ స్వామి అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయి ఉందని పోలీసులు విచారణలో తెలిసింది. కొద్ది రోజులు వాడుకోవడానికి తన బంధువైన నారాయణ స్వామి నుంచి కారును తీసుకున్నట్లు సుశీల్ దర్యాప్తులో వెల్లడించారు. కాగా, ఈ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. -
రావెల సుశీల్‌కు రెండు రోజుల కస్టడీ
హైదరాబాద్: మహిళా టీచర్ ఫాతిమా బేగం పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఏపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు సుశీల్(24)ను రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 6న సుశీల్‌ను నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి అడిగారు. మంగళవారం వాదోపవాదాలు విన్న అనంతరం కోర్టు ఈ నెల 9, 10 తేదీల్లో కస్టడీకి అనుమతించింది. బుధవారం ఉదయం జైలు నుంచి బంజారాహిల్స్ స్టేషన్‌కు సుశీల్‌ను తీసుకురానున్నారు. విచారణ అనంతరం గురువారం సాయంత్రం 5 గంటల్లోపు తిరిగి జైలులో అప్పగిస్తారు. ఇదిలా ఉండగా సుశీల్ కారు డ్రైవర్ రమేశ్‌ను కూడా రెండు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
సుశీల్‌ను కఠినంగా శిక్షించాలి
ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ బంజారాహిల్స్: యువతితో అనుచితంగా ప్రవర్తించిన కేసులో అరెస్టయిన ఏపీ మంత్రి రావెల కిశోర్ కుమారుడు రావెల సుశీల్‌ను కఠినంగా శిక్షించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఉదయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. సుశీల్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఆందోళనలో ఆమ్ ఆద్మీపార్టీ రాష్ట్ర కన్వీనర్ వెంకట్‌రెడ్డి, నమ్రతా జైస్వాల్, బుర్రా రాములుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అండగా ఉంటాం: టీవైఎస్సార్సీపీ మహిళా విభాగం బంజారాహిల్స్/నల్లకుంట: ఏపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు రావెల సుశీల్ అనుచిత వైఖరితో పరువుప్రతిష్టలకు భంగం కలిగిన ఫాతిమా బేగంను తెలంగాణ వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు బం డారు పద్మ, వరలక్ష్మి, క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి క్రిస్టోలైట్ తదితరులు ఆదివారం పరామర్శించారు. ఆ రోజు జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి అండగా ఉం టామని ప్రకటించారు. సుశీల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి నష్టపరిహారం అందజేయాలన్నారు. నిందితుడిని రక్షించేందుకు యత్నం... అనంతరం క్రిస్టోలైట్, బండారు పద్మలు బంజారాహిల్స్ ఠాణాకు వెళ్లి రావెల్ సుశీల్‌కుమార్‌పై నమోదు చేసిన కేసుల సెక్షన్లలపై ఇన్స్పెక్టర్ మురళీకృష్ణను ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిందితుడు సుశీల్‌పై 363, 506, 504, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు మొక్కుబడిగా 354 డి, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, నిందితుడిని రక్షించేం దుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. బాధితురాలికి న్యాయం చేయకుంటే వైఎస్సార్సీపీ తరపున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. -
రావెల సుశీల్‌ను అరెస్టు చేయాలి
ఐద్వా డిమాండ్ సాక్షి, విజయవాడ బ్యూరో : మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు రావెల సుశీల్ ఒక మహిళా టీచర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన కేసు నుంచి తప్పించుకునేందుకు అధికారులను లోబరుచుకునే ప్రయత్నాలు చేయడాన్ని మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. బజారులో నడుస్తున్న మహిళను వాహనంలో వెంబడించడమే కాకుండా డ్రైవర్ సాయంతో ఆమెను కారులోకి బలవంతంగా లాగే ప్రయత్నం చేయడం దారుణమని పేర్కొన్నారు. పైగా వారిద్దరు తప్పతాగి ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారని తెలిపారు. సుశీల్‌ను, అతని కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని వివరించారు. అయినా మంత్రి కొడుకును తప్పించి కారు డ్రైవర్‌ను మాత్రమే అదుపులోకి తీసుకోవడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. పైగా బాధితులను నిందితులుగా మార్చి భయపెట్టి, వారిపై ఒత్తిడి చేయడంతో పాటు కారు ధ్వంసం చేసినట్టు తిరిగి వారిపై మంత్రి అనుచరులు కౌంటర్ ఫిర్యాదు చేయడం దారుణమని పేర్కొన్నారు. మంత్రి తన అధికారాన్ని దుర్వినియోగపరిచి కొడుకును స్టేషన్ నుంచి తీసుకొచ్చి కేసులో అరెస్టు కాకుండా చూస్తున్నారని ఆరోపించారు. మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళా టీచర్‌ను లైంగికంగా వేధించిన అతని కొడుకును పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఐద్వా నాయకులు ప్రభావతి, రమాదేవి డిమాండ్ చేశారు.