ఐద్వా డిమాండ్
సాక్షి, విజయవాడ బ్యూరో : మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు రావెల సుశీల్ ఒక మహిళా టీచర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన కేసు నుంచి తప్పించుకునేందుకు అధికారులను లోబరుచుకునే ప్రయత్నాలు చేయడాన్ని మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. బజారులో నడుస్తున్న మహిళను వాహనంలో వెంబడించడమే కాకుండా డ్రైవర్ సాయంతో ఆమెను కారులోకి బలవంతంగా లాగే ప్రయత్నం చేయడం దారుణమని పేర్కొన్నారు. పైగా వారిద్దరు తప్పతాగి ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారని తెలిపారు. సుశీల్‌ను, అతని కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని వివరించారు.
అయినా మంత్రి కొడుకును తప్పించి కారు డ్రైవర్‌ను మాత్రమే అదుపులోకి తీసుకోవడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. పైగా బాధితులను నిందితులుగా మార్చి భయపెట్టి, వారిపై ఒత్తిడి చేయడంతో పాటు కారు ధ్వంసం చేసినట్టు తిరిగి వారిపై మంత్రి అనుచరులు కౌంటర్ ఫిర్యాదు చేయడం దారుణమని పేర్కొన్నారు.
మంత్రి తన అధికారాన్ని దుర్వినియోగపరిచి కొడుకును స్టేషన్ నుంచి తీసుకొచ్చి కేసులో అరెస్టు కాకుండా చూస్తున్నారని ఆరోపించారు. మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళా టీచర్‌ను లైంగికంగా వేధించిన అతని కొడుకును పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఐద్వా నాయకులు ప్రభావతి, రమాదేవి డిమాండ్ చేశారు.
రావెల సుశీల్‌ను అరెస్టు చేయాలి
Published Sun, Mar 6 2016 1:01 AM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM
Advertisement
Advertisement