స్వచ్ఛ సిద్దిపేటకు రాజముద్ర
సిద్దిపేటకు కేంద్ర బృందం రాక
బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా గుర్తింపు
శివమ్స్ గార్డెన్స్‌లో అభినందన సభ
మంత్రి హరీశ్‌రావు చొరవతో లక్ష్యం
సిద్దిపేట జోన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్- స్వచ్ఛ తెలంగాణ ప్రక్రియలో భాగంగా సిద్దిపేట మున్సిపాల్టీ మంగళవారం మరో మైలురాయి చేరుకోనుంది. రికార్డుల పరంపరను, విన్నూత ప్రయోగాల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీని కేంద్ర ప్రభుత్వ దూతగా వస్తున్న స్వచ్ఛ భారత మిషన్ చీఫ్ రాహుల్ ప్రతాప్ సింగ్ స్వచ్ఛ సిద్దిపేట ధ్రువీకరణ పత్రం అందించనున్నారు.
ఇప్పటికే పలుమార్లు కేంద్ర బృంద ప్రతినిధులు సిద్దిపేట బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా మారిన తీరును, చేపట్టిన సంస్కరణలను అధ్యయనం చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది దరఖాస్తులను, స్వచ్ఛ అవార్డులను పరిశీలనకు వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలంగాణ రాష్ర్టంలో గుర్తించిన ఐదు మున్సిపాలిటీల్ల సిద్దిపేటకు చోటు కల్పించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మంగళవారం కేంద్ర క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందంలో సభ్యునిగా ఉన్న స్వచ్ఛ భారత్ మిషన్ (ఓడీఎఫ్) చీఫ్ రాహుల్ ప్రతాప్‌సింగ్ ద్వారా ధువీకరణ పత్రం సిద్దిపేట పట్టణం అందుకోనుంది. స్థానిక శివమ్స్ గార్డెన్లో ఏర్పాటు చేసే అభినందన సభలో కేంద్ర బృందం సిద్దిపేట మున్సిపల్ పాలక వర్గానికి ధ్రువీకరణ పత్రాన్ని అందించనుంది. కేంద్రం 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకోని ప్రధాని చేతుల మీదుగా స్వచ్ఛ భారత్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
అప్పట్లో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం చేయూతనివ్వాలని ఆ దిశగా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల సమన్వయంతో పథకాన్ని కొనసాగించేందుకు రాష్ర్ట ప్రభుత్వం పక్షాన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు వినతులు అందించారు. ఈ క్రమంలో కేంద్రం స్పందించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి వాటా నిధులను కేటాయించడంతో పట్టణంలో పథకం వేగవంతంగా ముందుకు సాగింది. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు.
నియోజకవర్గంలో లక్ష్యానికి అనుగుణంగా అనతి కాలంలోనే వందశాతం మరుగుదొడ్లను నిర్మించి 3 అక్టోబర్ 2015న శాసన సభ స్పీకర్ చేతుల మీదుగా దేశంలోనే తొలి బహిరంగ మల విసర్జన రహిత నియోజకవర్గంగా గుర్తింపును రాష్ర్ట ప్రభుత్వ పక్షాన సిద్దిపేటలో అధికారికంగా అందుకుంది. ఈ క్రమంలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశంలోని కార్పోరేషన్లు, మున్సిపల్‌ల నుంచి దరఖాస్తులను ఆహ్వనించడం స్వచ్చ భారత్ అవార్డుకు సిద్దిపేట మున్సిపల్ పరిశీలనకు ప్రతిపాదనలను అందించారు.
ఈ క్రమంలో తెలంగాణలో గుర్తించిన ఐదు మున్సిపాలిటీల్లో అచ్చంపేట, సూర్యాపేట, షాద్‌నగర్, హుజూర్‌నగర్‌తో పాటు సిద్దిపేటను కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అవార్డుకు ఎంపిక చేసింది. ముందుగా కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ఛీప్ రాహుల్ ప్రతాప్‌సింగ్ ద్వారా సిద్దిపేట మున్సిపల్‌కు ధ్రవీకరణ పత్రాన్ని అందించడంతో బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా సిద్దిపేటకు నేడు రాజముద్ర పడనుంది.