Talanilalu
-
సింహాచలంలో తలనీలాలు చోరీ
సింహాచలం: మొక్కుల రూపంలో దేవునికి సమర్పించుకున్న తలనీలాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన విశాఖపట్నం సింహాచలం దేవస్థానంలో సోమవారం వెలుగుచూసింది. ఆలయంలోని కేశఖండనశాలలో గ్రేడింగ్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 15 బస్తాల తలనీలాలను దుండగులు అపహరించుకుపోయారు. ఇది గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. చోరీకి గురైన తలనీలాల విలువ సుమారు రూ. 8 లక్షల వరకు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రామయ్య లడ్డూలో తలనీలాలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి లడ్డూ ప్రసాదంలో తలనీలాలు ప్రత్యక్షమయ్యాయి. శనివారం ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు లడ్డూ ప్రసాదంలో తలనీలాలు కనిపించడంతో అవాక్కయ్యారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన డి.అర్జున్తో పాటు మరో ఐదుగురు మిత్రృబందం శనివారం ఆలయానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ప్రసాదాల కౌంటర్ వద్ద లడ్డూలను కొనుగోలు చేశారు. అందులో తలనీలాలు కనిపించడంతో అర్జున్ అవాక్కయ్యాడు. మరో లడ్డూ కొనుగోలు చేయగా అందులోనూ తలనీలాలు దర్శనమిచ్చాయి. తీవ్ర ఆవేదనకు లోనైన అర్జున్ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోక పోవడంతో ‘సాక్షి’ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. స్వామివారి ప్రసాదాల విషయంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.