అవమానాలు ఇక భరించలేను
మాజీ డిప్యూటీ స్పీకర్ అల్లూరు
టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం
మలికిపురం, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకూ ఎదురైన అవమమానాలు చాలని, ఇక భరించే ఓపిక తనకు లేదని ఆ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ స్పీకర్ అల్లూరు వెంకట సూర్యనారాయణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మలికిపురంలో బుధవారం రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వేదికపై ఆయన మాట్లాడుతూ 1983లో రంపచోడవరంలో రూ.500 జీతానికి ఉద్యోగం చేసుకుంటున్న తనను స్వర్గీయ ఎన్టీ రామారావు పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేయించారన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన తనను ప్రస్తుతం పార్టీ శ్రేణులు తీవ్రంగా అవమాన పరుస్తున్నాయన్నారు.
తనకు టీడీపీ అంటే చాలా ఇష్టమని, అయితే నాయకులు వైఖరి వల్ల ఇక పార్టీ సమావేశాలకు హాజరు కానని స్పష్టం చేశారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తన శిష్యుడని, ఆయనను తానే ఇండిపెండెంట్‌గా బరిలోనికి దింపానంటూ నియోజకవర్గ టీడీపీ నాయకులు దుష్పచారం చేస్తున్నారన్నారు.
ఆ ప్రచారాన్ని ఆపకపోతే సహించేది లేదని పేర్కొన్నారు. కాగా అల్లూరి మాటలకు వేదికపై ఉన్న అభ్యర్ధి గొల్లపల్లి సూర్యారావు ఇతర నాయకులు షాక్ తిన్నారు. ప్రసంగం అయిన వెంటనే ఏవీఎస్ రాజు వెళ్లి పోయారు.