డీఎంకేలో తెలుగుకు అన్యాయం
కొరుక్కుపేట, న్యూస్‌లైన్:
డీఎంకే హయూంలో తెలుగు భాషకు అన్యాయం జరిగిందని తమిళ నాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఆరోపించారు. గతంలో డీఎంకే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో తమిళనాడులో తెలుగు భాష అంతరించిందని పేర్కొన్నారు.
ఈ మేరకు తమిళనాడు తెలుగు యువశక్తి నేతృత్వంలో వాడవాడలా అమ్మబాట... బంగారు బాట పేరుతో అన్నాడీఎంకే లోక్‌సభ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అం దులో భాగంగా సోమవారం దక్షిణ చెన్నై అన్నాడీఎంకే అభ్యర్థి డాక్టర్ జయవర్ధన్‌కు మద్దతుగా మైలాపూర్, టీనగర్, లజ్ కార్నర్, కపాలేశ్వర్ కోవిల్, సాయిబాబా గుడి తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంలో నిర్బంధ తమిళం అమలు చేశారని పేర్కొన్నారు. తమిళనాడులోని వీధులకు ఉన్న తెలుగు ప్రముఖుల పేర్లను తొలగించారని విమర్శించారు. అన్నాడీఎంకే పాలనలో తెలుగు వారికి అన్యాయం జరిగిన దాఖలాలు లేవన్నారు.
గతంలో తెలుగు వారు కోరిన తెలుగు అకాడమీ స్థాపన, తెలుగు భవన్ నిర్మాణం, నిర్బంధ తమిళం సమస్యలను పరిష్కరించే దిశగా జయలలిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తెలుగువారి సమస్యలను అమ్మ జయలలిత మాత్రమే తీరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు వారందరూ ఆలోచించి అమ్మకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి.శివశంకర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటరాజు, రామకృష్ణ, వాసు తదితరులు పాల్గొన్నారు.