‘నా భర్తను వదులుకోను.. పీఎం వద్దకైనా వెళ్తా’
బరేలీ: తలాక్ విధానం తన జీవితాన్ని ఎలా ప్రశ్నార్థకం చేసిందో ఓ యువతి వివరించింది. గడిచిన పన్నెండేళ్లలో మూడుసార్లు ఇప్పటికే తలాక్ వేటును ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు ఉన్న భర్త కూడా ఎక్కడ తలాక్ చెప్పేస్తాడో అని భయపడిపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే తన జీవితం తనకు ఓ పీడకలగా ఉందంటూ వాపోయింది. తారాఖాన్ (35) మహిళది ఉత్తర ప్రదేశ్. ఆమె ఒక నిరక్షరాస్యురాలు. జహీద్ ఖాన్ అనే వ్యక్తితో వివాహం అయింది. అతడిది బరేలీలోని తహకా నగారియా అనే గ్రామం. అయితే, పెళ్లయిన ఏడేళ్లకు కూడా వారికి సంతానం లేదు. దీంతో ఆ వ్యక్తి మరో యువతిని వివాహం చేసుకొని తారాకు తలాక్ చెప్పేశాడు.
దీంతో ఆమెకు మరో సంబంధం చూసి పప్పుఖాన్ అనే వ్యక్తితో వివాహం చేశారు. ‘పప్పు నన్ను తీవ్రంగా హింసించేవాడు. ఒకసారి ఇలాగే చేస్తుంటే అడ్డుకున్నాను. దీంతో అనకూడని మాటలని బాగా కొట్టాడు’ అని చెప్పింది. ఇలా రెండో వివాహం కూడా మూడేళ్లలోనే ముగిసిపోయిందని చెప్పింది. తన మేనమామ ఇంటికెళ్లిన తర్వాత నచ్చజెప్పి మూడోసారి సోనూ అనే వ్యక్తితో వివాహం జరిపించారని కానీ, కాలక్రమంలో అతడు కూడా అంతకుముందు వివాహం చేసుకున్నవారికంటే దారుణంగా మారి చిత్రహింసలు పెట్టే భర్తగా మారాడని వాపోయింది. ఒక రోజు బాగా కొట్టి తిరిగి తన మామయ్యవాళ్లింటికి తీసుకొచ్చి మూడుసార్లు తలాక్ అని చెప్పేసి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. మూడో వివాహం నాలుగు నెలలు మాత్రమే నిలిచిందని చెప్పింది. అయితే, మరోసారి తన కుటుంబం సర్ది చెప్పి షంషాద్ అనే వ్యక్తితో నాలుగో వివాహం చేసినట్లు తెలిపింది.
అయితే, అతడు కూడా తనను ఎక్కడ వదిలేస్తాడోనని భయంగా ఉందని, వాస్తవానికి ఈ పన్నెండేళ్లలో తాను ఏ తప్పు చేయకపోయినా ఇలాంటి దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నానని వాపోయింది. శంషాద్ కూడా గత మాజీ భర్తల మాదిరిగా చేస్తే ఎక్కడికి వెళ్లాలో అర్ధం కానీ పరిస్థితి అని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తమ మధ్య కూడా చిన్న సమస్యలు మొదలయ్యాయని దీంతో పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్కు వెళుతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తాను అవసరం అయితే, ప్రధాని నరేంద్రమోదీకి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్కు తెలియజేయాలనుకుంటున్నట్లు వాపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లిని మాత్రం కాపాడుకుంటానని చెప్పింది.