ఐదుగురు ఎర్రస్మగ్లర్లపై పీడీ యాక్టుకు రెడీ
- కలెక్టర్‌కు నివేదిక
- టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ రత్న
సాక్షి, చిత్తూరు: ఐదుగురు ఎర్రస్మగ్లర్లపై పీడీ యాక్టుకు సిద్ధం చేస్తూ కలెక్టర్‌కు నివేదించినట్లు టాస్క్ఫోర్సు ఏఎస్పీ రత్న తెలిపారు. కలెక్టర్ సంతకమే తరువాయి అన్నారు. వీరితోపాటు మరో ముగ్గురిపైనా పీడీయాక్టులు పెడుతున్నట్లు చెప్పారు. సోమవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. గతంలో మాదిరి కాకుండా పీడీ యాక్టును కఠినతరం చేశామన్నారు.
పీడీయాక్టు నమోదైతే ఆరు నెలలకు తగ్గకుండా శిక్ష పడుతుందన్నారు. దీంతో పాత స్మగ్లర్లు స్మగ్లింగ్‌కు ముం దుకు వచ్చే అవకాశం తక్కువన్నారు. చైనాస్మగ్లర్ యాంగ్‌పింగ్‌ను విచారిస్తే మరిన్ని స్మగ్లింగ్ ముఠాలు బయటపడే అవకాశం ఉందన్నారు. దానిని బట్టి తదుపరి వ్యూహరచన ఉంటుందన్నారు. చెన్నై స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలను వ్వూహాత్మకంగా నిలిపివేసినట్లు ఆమె చెప్పారు. ఇప్పటికే వారి కుటుంబాలు అజ్ఞాతంలో ఉన్నాయన్నారు. కొన్ని రోజులు ఆగి దాడులు కొనసాగిస్తామన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో కఠిన చట్టాలు లేకపోవడం వల్లే ఎర్రచందన స్మగ్లింగ్ ను వెనువెంటనే అరికట్టే పరిస్థితి లేదన్నారు. జాతీయస్థాయిలో చ ట్టాలను కఠినతరం చేయాల్సి ఉందన్నారు. చట్టాలను సవరించి కఠిన చట్టాలు తీసుకువస్తే ఎర్రచందనం అక్రమ రవాణా ఆగిపోతుం దన్నారు. స్మగ్లర్లను పట్టుకోవడంతోపాటు చందనం అక్రమ రవాణా నేరమనే విషయంపై గ్రామాల్లో అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు, అటవీ సిబ్బంది కలిసి రేయింబవళ్లు కృషి చేస్తున్నట్లు రత్న చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించిన పోలీసు, అటవీ సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు.