'ఎన్నికలొస్తే 50 శాతానికిపైగా సీట్లు కాంగ్రెస్ వే'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వేల కోట్లు నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు.
కేసీఆర్ కు తన సర్వేపై నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 50 శాతానికిపైగా సీట్లు కాంగ్రెస్ కు రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికప్పుడు ఎన్నికలొస్తే టీఆర్ఎస్ ఇంటికి వెళ్లక తప్పదని అన్నారు.
మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ సర్కారు అమలు చేయలేదని, 12శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న వాగ్దానాన్ని మర్చిపోయిందని విమర్శించారు. మొత్తం 7వేల షాదీ ముబారక్ దరఖాస్తులు, 1.60 లక్షల రుణ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. తమ హయాంలో నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వటంతో 10 లక్షల మంది మైనారిటీలకు ఉద్యోగాలు దొరికాయని చెప్పారు.