కదం తొక్కిన ఐకేపీ వీఓఏలు
కలెక్టరేట్ దద్దరిల్లింది.. మూడు గంటలపాటు అట్టుడికింది.. తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం వీఓఏలు కలెక్టరేట్‌ను ముట్టడించారు.. జిల్లావ్యాప్తంగా వేలాది మంది తరలివచ్చారు.. ధర్నాతో కలెక్టర్ కార్యాలయం ప్రధానగేటు, సుబేదారికి వచ్చే రోడ్డు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద రహదారిని పోలీసులు మూసివేశారు.
సుబేదారి : అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) వీఓఎలు మం గళవారం కదం తొక్కారు. వీఓఏల సంఘం ఆధ్వర్యం లో జిల్లావ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన మహిళలు కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. మధ్యాహ్నం 12గంటల నుంచి మూడు గంటల వరకు ప్రధాన గేట్లను దిగ్బంధించారు.
మహిళలను విస్మరిస్తే..
మహిళలు, మహిళా సంఘాలను విస్మరిస్తే ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదని ఐకేపీ సంఘం నాయకులు హెచ్చరించారు. ధర్నాకు హాజరైన వారిని ఉద్దేశించి తెలంగాణ ఐకేపీ వీఓఏల సంఘం అధ్యక్షురా లు మారపల్లి మాధవి మాట్లాడుతూ 18నెలలుగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్(వీఓఏ)లకు వేతనాలు చెల్లించ డం లేదన్నారు. ఇప్పటికైనా వీఓఏల ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రూ.5వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సహజ మరణానికి బీమా సౌకర్యం కల్పించాలని, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, ఎస్‌హెచ్‌జీలకు 12నెలల జీరో శాతం వడ్డీ ఇవ్వాలని, అభయ హస్తం పింఛన్లు కొనసాగించాలని కోరారు. ధర్నాకు మద్దతు పలికిన అంగన్వాడీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ మహిళా సంఘాల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ లేదా పీడీ రావాలి
కలెక్టర్ లేదా ఐకేపీ పీడీ ఎవరో ఒకరు వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని వీఓఏల సంఘం బాధ్యులు స్పష్టం చేశారు. ఈ విషయమై సుబేదారి పోలీసులు ప లుమార్లు చెప్పినా వారు వినిపించుకోలేదు. అయితే, సమస్య తమ పరిధిలో లేదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉందని జిల్లా అధికారులతో మాట్లాడిన పోలీసులు చెప్పడంతో చివరకు వీఓఏలు ధర్నా విరమించారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, ఉపాధ్యక్షుడు రొయ్యల రాజు, నాయకులు టి.పులా, విద్యాసాగర్, డి.తిరుమల్‌రెడ్డి, ఎం.సాంబయ్య, పి.శంకర్, రమేష్, యాదానాయక్, శ్రీనివాస్, కుమార్, కె.మాధవి, రవీందర్, యువరాజు, సుధాకర్ పాల్గొన్నారు.
ధర్నాతో దారుల మూసివేత
ఐకేపీ వీఓఏల ధర్నాలో కలెక్టరేట్ ప్రధాన గేట్లతో పాటు సుబేదారికి వచ్చి రోడ్డు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం దగ్గరి రోడ్లను పోలీసులు మూసివేయించారు. బారికేడ్లు అడ్డుపెట్టి రాకపోకలను నియంత్రించారు. ఎక్సైజ్ కా లనీ రోడ్డు నుంచి కాజీపేటకు వెళ్లే వాహనాలు, ఫాతి మానగర్ క్రాస్ రోడ్డు నుంచి హన్మకొండకు వెళ్లే వాహనాలను మళ్లించారు. సుబేదారి ఎస్సైలు రాంప్రసాద్, సుబ్బారెడ్డి బందోబస్తు పర్యవేక్షంచారు.