telangana police recruitment
-
చిన్న ఐడియా.. 670 కొలువులు! పోలీసు అభ్యర్థులకు లబ్ధి
‘ఒక చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది..’ అన్నది చాలాసార్లు నిరూపితమైనదే. అలాంటి ఓ ఆలోచన పోలీస్ రిక్రూట్మెంట్లో ఇబ్బందులను పోగొట్టింది. ముందు నుంచే ఉన్న ఇబ్బందిపై సరిగా దృష్టిపెట్టకపోవడంతో సమస్యగా మారితే.. ఒక చిన్న మార్పుతో దాన్ని సరిచేసి వందల మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పించగలిగారు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు. సమస్య ఏమిటి? పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ వేసిన ప్రతీ సారి కూడా ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకాలు చేపడుతుంది. అభ్యర్థుల్లో తక్కువ మంది మాత్రమే కేవలం ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేస్తారు. నూటికి 99% మంది ఎస్సైతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకూ పోటీపడుతుంటారు. వారిలో ప్రతిభావంతులు రెండు పరీక్షల్లోనూ పాసవుతారు. అయితే ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచీ తొలుత కానిస్టేబుల్ సెలక్షన్స్, తరువాత ఎస్సై సెలక్షన్స్ జరిగేవి. దీనివల్ల మొదట కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికై, శిక్షణకు వెళ్లినవారు కూడా.. తర్వాత ఎస్సై పోస్టుకు ఎంపికైతే కానిస్టేబుల్ పోస్టును వదులుకునేవారు. ఇలా వందలాది పోస్టులు ఖాళీ అయ్యేవి. అప్పటికే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయి, ఖాళీ పోస్టులను డీజీపీకి సరెండర్ చేసి ఉండేవారు. పరీక్షల్లో అర్హత సాధించినవారు ఎందరో ఉన్నా ఈ ఖాళీల్లో భర్తీ చేసే అవకాశం ఉండేది కాదు. ఆ పోస్టులను తర్వాతి రిక్రూట్మెంట్లోనే భర్తీ చేయాల్సి వచ్చేది. దీనివల్ల చాలా మంది అభ్యర్థులు వయసు పెరగడం, శారీరక ఇబ్బందులతో పోటీపడే అవకాశం కోల్పోయేవారు. ఏం మార్పులు చేశారు? ఈ లోపాన్ని గుర్తించిన టీఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు.. విషయాన్ని అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డికి వివరించారు. ఆయన ఆమోదంతో గత రిక్రూట్మెంట్ సందర్భంగా ముందుగా ఎస్సై సెలక్షన్స్ చేపట్టారు. ఎస్సై ట్రైనీలతో సమావేశం నిర్వహించి.. వారిలో 670 మంది కానిస్టేబుల్ పోస్టులకు అర్హత సాధించారని గుర్తించారు. ముందే ఎస్సై పోస్టులో చేరుతున్నందున కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరబోమంటూ అండర్ టేకింగ్ (నిరభ్యంతర పత్రం) తీసుకున్నారు. తర్వాత చేపట్టిన కానిస్టేబుల్ సెలక్షన్స్ జాబితా నుంచి ఆ 670 మందిని తొలగించారు. దీంతో ఇదే సంఖ్యలో ఇతర అభ్యర్థులు ఎంపికయ్యారు. ఖాళీలేమీ ఏర్పడలేదు. మరోవైపు ట్రాఫిక్ అఫెన్స్‌లు, తెలిసీ తెలియని చిన్న నేరాలకు సంబంధించిన కేసులు ఉన్న 350 మందికిపైగా అభ్యర్థులపై వేగంగా దర్యాప్తు పూర్తి చేయించి.. ఉద్యోగ అవకాశం లభించేలా చేశారు. చదవండి: ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి! -
TS: ‘పోలీస్’ తుది పరీక్షల షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలకమైన తుది రాత పరీక్ష తేదీల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 12 నుంచి పలు విభాగాల్లోని 17,560 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో పోలీస్ ఉద్యోగార్థులు తీవ్రంగా శ్రమించే సివిల్ ఎస్సై పోస్టులకు రాత పరీక్షను ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. సివిల్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షను ఏప్రిల్ 23న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు పరీక్షల తేదీలను వెల్లడిస్తూ ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాతపరీక్షకు సన్నద్ధం కావాలని సూచించారు. ఈనెల 5తో ముగియనున్న దేహదారుఢ్య పరీక్షలు పలు విభాగాల్లోని ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ 8న ప్రారంభించారు. ఈ ప్రక్రియ జనవరి 5తో ముగియనుంది. హైదరాబాద్‌సహా తెలంగాణ వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఫిజికల్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష హాల్‌టికెట్లను త్వరలోనే జారీ చేయనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్స్, మెకానిక్ పోస్టులకు పోటీపడుతున్న అభ్యర్థులకు డ్రైవింగ్ టెస్ట్ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు. -
పోలీసు అభ్యర్థులకు న్యాయం చేయండి: కాంగ్రెస్
హైదరాబాద్: ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకపు పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు తీర్పు ప్రకారం అభ్యర్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. తెలంగాణ పోలీసు బోర్డులో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మంగళవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సమర దీక్ష నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నేతలు విచ్చేసి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేతలు మాట్లాడుతూ బోర్డు నిర్ల క్ష్యం కారణంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య ర్థులు నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం మార్కులు కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శివసేనా రెడ్డి మాట్లాడుతూ... బోర్డు ఇచ్చిన తప్పుడు ప్రశ్నల వల్ల ఏడు మల్టిపుల్ ప్రశ్నల మార్కులను అభ్యర్థులకు కలపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమన్నారు. హైకోర్టు తీర్పు అమలు చేస్తే దాదాపు 70 వేల మంది అభ్యర్థులకు న్యాయం జరిగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, నేతలు ప్రవళిక నాయక్, శివకుమార్ రెడ్డి, వెంకట్, మాతం ప్రదీప్, సునీత, దివ్య పాల్గొన్నారు. -
పోలీసు ఎంపికల్లో తల్లీ కూతుళ్ల తడాఖా
నేలకొండపల్లి : పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న దేహ దారుఢ్య పరీక్షల్లో తల్లీకుమార్తెలిద్దరూ సత్తా చాటి ఎస్ఐ మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారానికి చెందిన తోళ్ల వెంకన్న భార్య నాగమణి, కుమార్తె త్రిలోకిని ఖమ్మంలో జరుగుతున్న పోలీసు ఈవెంట్స్‌కు బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పరుగు పందెం, ఎత్తు కొలత, లాంగ్ జంప్, షాట్‌పుట్ ఇలా అన్ని ఈవెంట్లలో విజయం సాధించి తుది పరీక్షకు అర్హత సాధించారు. తోళ్ల వెంకన్న కుటుంబం చెన్నారం నుంచి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితమే ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లింది. తొలుత నాగమణి అంగన్వాడీ టీచర్‌గా ఖమ్మం బురహాన్‌పురంలో కొంతకాలం పనిచేశాక.. పదేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో హోంగార్డుగా విధులు నిర్వర్తించారు. రెండేళ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఎంపికైన ఆమె ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. ఎస్ఐ కావాలన్న లక్ష్యంతో సాధన చేస్తుండగా, డిగ్రీ పూర్తి చేసిన నాగమణి కుమార్తె త్రిలోకిని కూడా పరీక్షలకు సిద్ధమయ్యారు. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి దేహ దారుఢ్య పరీక్షలకు హాజరైన వీరిద్దరు.. ఇందులోనూ సత్తా చాటి మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఇదీ చదవండి: షికారుకెళ్లి నరకయాతన.. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు -
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్...రాత పరీక్షపై కీలక అప్డేట్..!
సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పెక్టర్, ఇతర సమాన పోస్టులకు ఆగస్టు 7న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అలాగే కానిస్టేబుల్, ఇతర సమాన పోస్టులకు ఆగస్టు 21న రాతపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, రవాణా, అబ్కారీ విభాగాల్లో 17,516 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 7,33,559 మంది అభ్యర్థుల నుంచి 12,91,006 దరఖాస్తులు వచ్చినట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. వివిధ విభాగాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దరఖాస్తుల గడువు గురువారం ముగిసింది. 52 శాతం (3,55,679) మంది ఒకే ఒక్క ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. 29 శాతం మంది రెండు ఉద్యోగాలకు, 15 శాతం మంది మూడింటికి, 3 శాతం మంది నాలుగు ఉద్యోగాలకు, ఒక శాతం మంది ఐదు పోస్టులకు దరఖాస్తు చేయగా, 6 పోస్టులకు ఎలాంటి దరఖాస్తులు రాలేదన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 21 శాతం (2,76,311) మహిళా అభ్యర్థుల నుంచి వచ్చాయని వెల్లడించారు. కాగా, ప్రభుత్వం నోటిఫికేషన్ సమయంలో ఇచ్చిన మూడేళ్లు కాకుండా మరో రెండేళ్ల వయోసడలింపుతో 1.4లక్షల మంది అభ్యర్థులకు ఉద్యోగ పోటీలో అవకాశం దక్కింది. అలాగే ప్రిలిమినరీ రాతపరీక్షకు 67 శాతం మంది తెలుగు మీడియం, 32.8శాతం మంది ఆంగ్లం, 0.2శాతం మంది ఉర్దూ మీడియం ఎంచుకున్నారు. ఆ ఐదు జిల్లాలు టాప్... భారీగా దరఖాస్తులు దాఖలు చేసిన జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట నిలిచాయి. ఈ జిల్లాల నుంచే 33 శాతం దరఖాస్తులు వచ్చాయి. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట, జనగాం, రాజన్న సిరిసిల్ల నుంచి అతి తక్కువగా 7 శాతం దరఖాస్తులు దాఖలయ్యాయి. పోస్టులవారీగా దరఖాస్తులిలా... ఎస్ఐ సివిల్, తదితర సమాన పోస్టులు: 2,47,630 సివిల్ కానిస్టేబుల్, తదితర సమాన పోస్టులు: 9,54,064 ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ పోస్టులు: 14,500 ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులు: 22,033 కానిస్టేబుల్ డ్రైవర్ (పోలీస్), ఫైర్ పోస్టులు: 38,060 మెకానిక్ కేటగిరీ పోస్టులు: 5,228 పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ ఎస్ఐ: 3,533 ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఏఎస్ఐ: 6,010 -
తెలంగాణ: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు అభ్యర్థుల కోసం మరో ప్రకటన చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇవాళ్టితో గడువు ముగియాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ నెల(మే) 26వ తేదీ వరకు తుది గడువు ఉంటుందని తెలిపింది. పోలీసుశాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. దీంతో.. ఇప్పుడు దరఖాస్తుదారుల కోసం గడువు తేదీని పొడిగించినట్లు తెలుస్తోంది. పోలీసుశాఖతో పాటు ఫైర్, జైళ్లు, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఎస్పీఎస్ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల(మే) 2వ తేదీ నుండి పోలీస్ ఉద్యోగాల కోసం ధరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఒకే అభ్యర్ధి ఎన్ని పోస్టులకైనా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 20 రాత్రి 10 గంటల వరకు సమయమని తొలుత పేర్కొంది. అయితే వయోపరిమితి పెంచిన నేపథ్యంలో దరఖాస్తు గడువు తేదీని కూడా పెంచింది. మరోవైపు వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయంటూ కొందరు దరఖాస్తుదారులు ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం. చదవండి: తెలంగాణలో డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ -
పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ట్రాన్స్జెండర్ల డిమాండ్ ఇవే!
సాక్షి, హైదరాబాద్: మహిళలు, పురుషులతో సమానంగా తమకూ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఇన్‌వార్డులో వైజయంతి వసంత, ఓరుగంటి లైలా, చంద్రముఖి మువ్వల తదితరులు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన అన్ని విభాగాల్లోని పోస్టుల్లో తమకు ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని బుధవారం డీజీపీ కార్యాలయం వద్ద ట్రాన్స్జెండర్లు నిరసన చేపట్టారు. అందరితో సమానంగా బతికే హక్కు ట్రాన్స్జెండర్లకు ఉందంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులిచ్చిన తీర్పులను, 2021లో కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్లను కేటాయిస్తూ ఇచ్చిన జీవోను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. బోర్డు విడుదల చేసిన పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు తమకు 45 రోజుల సమయం ఇవ్వాలని, దరఖాస్తు ఫారమ్‌లో స్త్రీ, పురుషులతో పాటుగా ట్రాన్స్‌జెండర్ ఆప్షన్ జోడించాలని డిమాండ్ చేశారు. -
ఫాలో.. పీఆర్బీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన సమయంలో అన్ని శాఖల దృష్టి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (పీఆర్బీ)పై పడింది. తెలంగాణలో కొత్త జోన్ల పునర్వ్యవస్థీకరణకు ఇటీవల రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన దరిమిలా తొలి ఉద్యోగ నోటిఫికేషన్ పీఆర్బీ నుంచి వెలువడటంతో.. మిగిలిన శాఖల ఉన్నతాధికారులు ఈ నోటిఫికేషన్ జారీలో అవలంబించిన విధి విధానాలను నిశితంగా అధ్యయనం చేస్తున్నారు. కొత్త జోన్ల వ్యవస్థ అమలును జూన్ 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత నాలుగు రోజులకే అంటే జూలై 4వ తేదీన పీఆర్బీ 151 ఏపీపీ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ వెలువరించింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ మంది (2016లో సుమారు 10 వేలు, 2018లో 15 వేల మంది)ని భర్తీ చేసిన విభాగంగా గుర్తింపు సాధించిన బోర్డు.. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా, పకడ్బందీ నిబంధనలతో ఈ పోస్టుల భర్తీ ప్రకియను చేపట్టింది. త్వరలోనే పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న దాదాపు 19 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి సైతం బోర్డు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇతర శాఖల అధికారులు, పీఆర్బీ రూపొందించిన విధానాలపై దృష్టి సారించారు. ఒక పెద్ద రాష్ట్ర ప్రభుత్వ శాఖ అయితే, పీఆర్బీ చైర్మన్ వి.శ్రీనివాసరావు నేతృత్వంలో రూపొందించిన ఈ నియామక నిబంధనలను యథాతథంగా తీసుకోవడం గమనార్హం. కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనలను ప్రభుత్వమే రూపొందించినప్పటికీ, వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఇతర శాఖలు పీఆర్బీ విధివిధానాలను పరిశీలించే పనిలో పడ్డాయి. 95 శాతం పోస్టులు స్థానికులకే.. కొత్త జోనల్ వ్యవస్థలో 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కేలా ప్రభుత్వం పకడ్బందీగా విధివిధానాలను రూపొందించింది. వీటిని అమలు చేసే పనిలో పీఆర్బీ ఇప్పటికే ముందడుగు వేసింది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం.. నియామకాల్లో తెలంగాణలో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు పరిగణనలోకి తీసుకుంటారు. దీని ప్రకారం..ఎవరైతే ఒకే జిల్లాలో ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు విద్యనభ్యసించి ఉంటారో వారినే స్థానికులుగా తీసుకుంటారు. దీని ప్రకారం చూస్తే.. కేవలం 5 శాతం పోస్టులే స్థానికేతరులకు దక్కుతాయని అధికారులు చెబుతున్నారు. ఇలా పొరుగు రాష్ట్రం వారితో పాటు, పక్క మల్టీజోన్ వారు కూడా స్థానికేతరులే అయ్యేలా నిబంధనలు రూపొందించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్థానికతను రుజువు చేసుకునేందుకు అభ్యర్థులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రెవెన్యూ అధికారుల నుంచి ఏడేళ్ల ‘నివాస ధ్రువీకరణ’ పత్రాన్ని పీఆర్బీ అనివార్యం చేసింది. సుదీర్ఘ ప్రక్రియ అయినా.. మిగిలిన శాఖల్లో ఉద్యోగాల భర్తీ.. పోలీసు పరీక్షల్లా క్లిష్టంగా, అనేక దశల్లో ఉండదు. ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలి. పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్‌టికెట్ల జారీ మరో కీలక అంశం. ఆ తర్వాత రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అభ్యర్థులపై పోలీసు ఎంక్వైరీ, ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికోసం మరో రకమైన విచారణ, యూనివర్సిటీల సాయంతో వారి సర్టిఫికెట్ల నిర్ధారణ, అభ్యంతరాల స్వీకరణ– నివృత్తితో కూడిన సుదీర్ఘ ప్రక్రియ అంతటినీ గతంలో పక్కాగా అమలు చేసిన అనుభవం పీఆర్బీకి ఉంది. అందుకే బోర్డు విధానాలు అదర్శంగా నిలుస్తున్నాయి. వివాద రహితంగా ఉండటంతో... 2018లో రిక్రూట్మెంట్ సందర్భంగా పీఆర్బీ తమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసింది. ఈ కారణంగానే ఆ సమయంలో తలెత్తిన పలురకాల న్యాయపరమైన అభ్యంతరాలన్నీ పిటిషన్ దశలోనే వీగిపోయాయి. దీనిని కూడా పరిగణనలోకి తీసుకుని, ఉద్యోగ ఖాళీల భర్తీ పనిలో ఉన్న పలు శాఖలు.. పీఆర్బీ అనుసరించిన విధానాన్ని పరిశీలిస్తున్నాయి. ఇందులో తమకు కావాల్సిన అంశాలను తీసుకుని అమలు చేయనున్నాయి. -
9నుంచి కానిస్టేబుల్ అభ్యర్థుల ఫారాల స్వీకరణ
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి దరఖాస్తు చేసుకొని రాష్ట్ర పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన అటెస్టేషన్ ఫారాలను పూరించి ఈ నెల 9,10,11,12వ తేదీలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో అందజేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన ఫారాలతో పాటు విద్యార్హతల ధ్రువీకరణ ఫారాలను అందజేయాలని కోరారు. అటెస్టేషన్ పారాల పంపకం, స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా తేదీలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫారాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు నాలుగు పాస్ఫోటోలను వెంట తీసుకరావాలని సూచించారు. -
పోలీసు నియామకాల్లో ‘స్పోర్ట్స్ కోటా’ గందరగోళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు నియామకాల్లో ఎమ్మెస్పీ (మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్) కోటాలో గందరగోళం నెలకొంది. ఈ కోటా ప్రకారం జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్)కు ఆడినవారు ఎమ్మెస్పీ అర్హులు. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) నోటిఫికేషన్లోనూ పేర్కొంది. కానీ, అమలు విషయం లో పోలీసు ఉన్నతాధికారుల్లోనే సమన్వయం కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరందరినీ ఎమ్మెస్పీ కోటా కింద అనుమతించాలి. కానీ, ఒక్కో జిల్లాలో అధికారులు ఒక్కోలా వ్యవహరించడంతో స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఆశించే అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. దీంతో తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు అభ్యర్థులు డీజీపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అభ్యర్థులు ఏమంటున్నారంటే.. సంగారెడ్డి జిల్లా కోహిర్‌కు చెందిన విజయలక్ష్మి.. ఛత్తీస్‌గఢ్‌లో 59వ నేషనల్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొంది. ఎమ్మెస్పీ కోటాకు అర్హత ఉంది. కానీ, ఈమెకు పోలీసు కానిస్టేబుల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఎమ్మెస్పీ విభాగం కింద అధికారులు అనుమతించలేదు. కానీ, ఆమెతోపాటు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఆటల్లో పాల్గొన్న వారికి ఇతర జిల్లాల్లో ఎమ్మెస్పీ రిజర్వేషన్ కింద అనుమతి లభించింది. సూర్యాపేట జిల్లా కల్లూరుకు చెందిన విజయ్‌కుమార్.. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇతనికి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఎమ్మెస్పీ కోటా కింద అనుమతించలేదు. ఇతడి తర్వాత సర్టిఫికెట్ వెరికేషన్‌కు హాజరైన అభ్యర్థులను ఎమ్మెస్పీ కోటాలో అనుమతించారని వాపోతున్నాడు. ఇలాంటి బాధిత అభ్యర్థులు ప్రతీ జిల్లాకు ఉన్నారు. ప్రతీ 100 పోస్టులకు 2 సీట్లు ఎమ్మెస్పీ కోటా కింద భర్తీ చేస్తారు. రాష్ట్రం తరఫున జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆశావహులంతా ఇప్పుడు అధికారుల తీరుతో నీరుగారిపోతున్నారు. జీవో 74 ఏం చెబుతోంది? క్రీడా విధానం, ఎమ్మెస్పీ కోటాకు సంబంధించి విధివిధానాలను రూపొందిస్తూ 2012లో జీవో నం 74ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి స్కూల్ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు 2 శాతం కోటా అమలు చేయాలి. ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, షూటింగ్, ఫెన్సింగ్, రోలర్ స్కేటింగ్, సెయిలింగ్/యాట్చింగ్, ఆర్చరీ, క్రికెట్, చెస్, ఖో–ఖో, జుడో, టైక్వాండో, సాఫ్ట్‌బాల్, బాడీ బిల్డింగ్ మొత్తం 29 క్రీడలకు ఇందులో చోటు కల్పించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక సంస్థ (టీఎస్ఎల్పీఆర్బీ) ఎమ్మెస్పీ కోటా కింద కూడా ఇవే 29 క్రీడాంశాలను పరిగణనలోకి తీసుకుంటామని గతేడాది పోలీసు నియామకాల సందర్భంగా విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. కానీ, ఇప్పుడు అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ముమ్మాటికీ సమన్వయ లోపమే.. వాస్తవానికి మా వద్ద నుంచి జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించాలంటే చాలా దశలుంటాయి. స్కూలు హెడ్మాస్టర్, పీఈటీ ఆమోదం, జిల్లా అధికారుల ఆమోదం పొందాక మేం కూడా అనుమతించాలి. ఇంత ప్రక్రియ తర్వాత వారు జాతీయ స్థాయిలో ఆడతారు. ఈ వివరాలన్నీ వెబ్స్డైట్లలో ఉంటాయి. నిబంధనల ప్రకారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నీలో అండర్–14 నుంచి అండర్–19 వరకు పాల్గొన్నవారు ఎమ్మెస్పీ కోటాకు అర్హులు. అధికారులు ఒక చోట అనుమతించి, మరోచోట అనుమతించకపోవడం దురదృష్టకరం. రామ్‌రెడ్డి, సెక్రటరీ,స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్), తెలంగాణ -
రాజ్యాంగం కంటే మీ చట్టాలు గొప్పవా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నియంతృత్వంగా వ్యవహరిస్తూ నిరసన తెలిపే, ప్రశ్నించే హక్కులను కాలరాస్తూ కొత్త చట్టాలను రూపొందిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ‘మీరు రూపొందించిన చట్టాలు రాజ్యాంగం కంటే గొప్ప వా..’అని ప్రశ్నించారు. ఎస్.ఐ, కానిస్టేబుల్స్ సెలక్షన్ ప్రక్రియలో సెన్సార్షిప్ సిస్టంని తొలగించాలని, ఆర్.ఎఫ్.డి సిస్టం వల్ల ఇబ్బందులున్నాయని, పరుగుపందెంలో అవకతవకలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ జేఏసీ సభను నిర్వహించింది. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ నిరుద్యోగులేమైనా ఎమ్మె ల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి స్థానాలను ఆశిస్తున్నారా.. వారు చదివిన చదువుకు తగిన ఫలం లాంటి ఉద్యోగాన్ని అడుగుతుంటే, దానిలో కూడా సవాలక్ష ఆంక్షలను విధిస్తూ ఏడిపించడం సరైనది కాదన్నారు. దీని వల్ల ఎందరో అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు. మిమ్మల్ని జీవితాంతం కష్టపెడతాం సభ జరుగుతుండగానే ప్రెస్‌క్లబ్ వద్ద పోలీసులు మోహరించారు. టాస్క్‌ఫోర్స్ అడిషినల్ డీసీపీ చైతన్యకుమార్ ఆధ్వర్యంలో నలుగురు ఏసీపీలు, 10 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 200 మంది కానిస్టేబుళ్లు మోహరించారు. సభ ముగిసిన తర్వాత ఆర్.కృష్ణయ్య, కోదండరాం, బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, విద్యార్థి సంఘం నేత అన్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని 45 నిమిషాలపాటు ప్రెస్‌క్లబ్‌లో నిర్బంధించి తరువాత పోలీసుస్టేషన్‌కు తరలించారు. సభకు వచ్చిన నిరుద్యోగులను బయటకు వెళ్లకుండా గేట్లు మూసేసి అడ్డుకున్నారు. దీంతో నిరుద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.‘మమ్మల్ని బయటకు వదలండి. చచ్చిపోయేటట్టు ఉన్నాం’అని వేడుకున్నా పోలీసులు గేట్లు తెరవలేదు. ఆగ్రహానికి గురైన నిరుద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘మమ్మల్ని మీరు గంట, 3 గంటలు లేదా ఒక రోజు, నెల రోజులపాటు కష్టపెడతారేమో... మేం తల్చుకుంటే మిమ్మల్ని అధికారంలోకి రాకుండా జీవితాం తం కష్టపడేటట్లు చేయగలం’అని హెచ్చరించారు. భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు అరగంట తరువాత గేట్లు తెరవడంతో అభ్యర్థులు బయటకు వచ్చారు. పోలీసులు 15 నుంచి 20 మందిని రౌండప్ చేశారు. తమ తోటివారికి ఏమైం దోనని దగ్గరకు వెళ్లి చూసిన ప్రతి ఒక్కరినీ పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు. ఓ పక్క ఎండ, మరో పక్క పోలీసుల వ్యవహారశైలితో విసిగిన నిరుద్యోగులు పెద్దఎత్తున ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. సుమారు ఐదారొందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కొంతమందిని అరెస్ట్ చేసి సమీప పోలీసుస్టేషన్లకు తరలించారు. 18 వేల మందిని ముందే ఎంపిక చేసేసుకున్నారా? అభ్యర్థుల ఎంపికను సరైన రీతిలో చేయాలని వేలాదిమంది నిరుద్యోగులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వం స్పందించడంలేదంటే, ముందుగానే ఆ 18 వేల మందిని సెలక్ట్ చేసేసుకున్నారనే అనుమానం వస్తోందని అన్నారు. న్యాయం కావాలని అడిగితే అరెస్ట్ చేస్తారా.. ఇలా ఎంతమందిని అరెస్ట్ చేసి పరిపాలన సాగిద్దామనుకుంటున్నారో పాలకులు అంతర్మథనం చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు చేసే ఉద్యమానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. -
వచ్చే వారం పోలీస్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా పోలీసు ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి పోస్టుల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు వెలువడటంతో వచ్చే వారంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ఇప్పటికే కసరత్తు 90% పూర్తిచేసినట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. మొత్తం 22వేల పోస్టులకు అనుమతులు వచ్చినా అందులో ముందుగా పోలీస్‌శాఖలోని 18వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 4వేల పోస్టులు జైళ్లు, అగ్నిమాపక, ఆర్టీసీ, తదితర విభాగాలకు చెందినవి ఉన్నాయని, వీటి నియామక ప్రక్రియ వేరే విధంగా ఉంటుందని బోర్డు అధికారులు చెప్పారు. -
సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్
ఎనిమిది విభాగాల్లో 539 ఖాళీల భర్తీకి జారీ సివిల్, ఏఆర్, ఫైర్ సర్వీసులలో జోన్ల వారీగా నియామకాలు జోన్-5 కింద 100 పోస్టులు, జోన్-6 కింద 188 పోస్టులు మిగతా పోస్టులకు రాష్ట్రస్థాయిలో నియామకాలు ఈనెల 10 నుంచి మార్చి 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఏప్రిల్ 17న ప్రిలిమినరీ పరీక్ష.. అనంతరం శరీర దారుఢ్య పరీక్షలు అన్ని కేటగిరీల్లోనూ మూడేళ్ల వయోపరిమితి సడలింపు మహిళలకు సివిల్‌లో 33 శాతం, ఏఆర్‌లో 10 శాతం రిజర్వేషన్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సై పోస్టుల భర్తీకి నగారా మోగింది. 539 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) ఖాళీల భర్తీకి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవలే 9,281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా... తాజాగా ఎస్సై పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 539 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకాగా.. అందులో సివిల్ విభాగంలో 208 పోస్టులు, ఏఆర్‌లో 74, స్పెషల్ ఆర్ముడ్లో 02, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)లో 205, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 12, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ 09, కమ్యూనికేషన్ విభాగంలో 23, పోలీస్ ట్రాన్స్‌ఫోర్టు ఆఫీసర్స్ 06 పోస్టులు ఉన్నాయి. వీటిలో సివిల్, ఏఆర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ పోస్టులను జోన్ల వారీగా, మిగతా పోస్టులను రాష్ట్రస్థాయిలో భర్తీ చేస్తారు. జోన్ల వారీగా భర్తీ చేసే పోస్టుల్లో ఆయా జోన్‌కు చెందినవారికి 70 శాతం పోస్టులు కేటాయిస్తారు. మిగతా 30 శాతం ఓపెన్ కేటగిరీ కింద రాష్ట్రస్థాయిలో నియామకాలు చేపడతారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 3 అర్ధరాత్రి 12 గంటల వరకు ఠీఠీఠీ.్టటఞటఛ.జీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్‌బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు తెలిపారు. పోస్టు కోడ్ 11, 12, 13, 14, 16, 17 విభాగాల వారికి ఏప్రిల్ 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు... పోస్టు కోడ్ 31, 32 విభాగాల వారికి అదే రోజున మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మూడేళ్ల వయస్సు సడలింపు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సై పోస్టులకు మూడేళ్లు సడలింపు ఇచ్చారు. దీంతో జనరల్ కేటగిరీ వయోపరిమితి 25 ఏళ్ల నుంచి 28 ఏళ్లకు పెరిగింది. జూలై 1, 2015 నాటికి 28 ఏళ్లు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ వయోపరిమితి జనరల్ కేటగిరీలో 30 ఏళ్ల నుంచి 33 ఏళ్లకు పెరిగింది. ఇక అన్ని విభాగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో అదనపు సడలింపు వర్తిస్తుంది. పరీక్ష ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.500.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250. అభ్యర్థులందరూ పరీక్ష ఫీజును మీసేవ, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లోగానీ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారాగానీ చెల్లించవచ్చు. అనంతరం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరికొన్ని ముఖ్యాంశాలు.. దరఖాస్తులో ఎలాంటి తప్పులు దొర్లినా అందుకు పూర్తిగా అభ్యర్థులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు కనీసం డిగ్రీ, లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణత, డిగ్రీ చదువుతున్న వారు అర్హులు. దరఖాస్తులో విద్యార్హతకు సంబంధించి ఉన్నత విద్యను మాత్రమే ప్రస్తావించాలి. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత శారీరక దృఢత్వ పరీక్షలకు హాజరయ్యేవారు.. వారి విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను చూపాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షలకు మించకూడదు. స్థానిక తహసీల్దార్ ధ్రువపరిచిన ఆదాయ సర్టిఫికెట్‌ను పొందుపరచాలి. రాతపరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు.. పేపర్-2లో జనరల్ స్టడీస్‌కు సంబంధించిన ప్రశ్నలు.. పేపర్-3 ఇంగ్లీషు.. పేపర్-4లో తెలుగు లేదా ఉర్దూకు సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఈ పరీక్షలన్నింటికి సంబంధించిన సిలబస్‌ను పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు త్వరలో వెబ్సైట్లో పొందుపరచనుంది. వివిధ విభాగాల్లో పోస్టుల వివరాలు.. విభాగం పోస్టులు సివిల్ (పురుషులు/మహిళలు) 208 ఆర్ముడ్ రిజర్వు (పురుషులు/మహిళలు) 74 స్పెషల్ ఆర్ముడ్ (సి.పి.ఎల్)(పురుషులు) 02 టీఎస్ఎస్పీ (ఆర్.ఎస్.ఎస్) (పురుషులు) 205 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (పురుషులు) 12 అగ్నిమాపకశాఖ 09 కమ్యూనికేషన్స్ (పురుషులు/మహిళలు) 23 పీటీవో (పురుషులు) 06 మొత్తం 539 జోన్ల వారీగా భర్తీ చేసే పోస్టుల సంఖ్య జోన్ సివిల్ ఆర్ముడు ఫైర్ జోన్-5 75 22 3 జోన్-6 133 52 0 సిటీఆఫ్ హైదరాబాద్ - - 3 మొత్తం 208 74 6 (ఫైర్‌స్టేషన్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి జోన్-6లో హైదరాబాద్ ఉండదు. అందువల్ల సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరిట ప్రత్యేకంగా నియామకాలు చేపడతారు. దీనిలో మూడు బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు) జోన్-5 కిందకు వచ్చే జిల్లాలు (ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం) జోన్-6 కిందకు వచ్చే జిల్లాలు (మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్) శరీర దారుఢ్య పరీక్షలు.. పురుషుల ఎత్తు కనీసం 167.6 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతీ చుట్టుకొలత గాలి పీల్చినప్పుడు 86.3 సెంటీమీటర్లు, వదిలేసినప్పుడు 81.3 సెంటీమీటర్లు ఉండాలి. మహిళల కనీస ఎత్తు 152.5 సెంటీమీటర్లు ఉండాలి. కమ్యూనికేషన్, పీటీవో విభాగాల్లోని పోస్టులకు మాత్రం పురుషుల ఎత్తు 162 సెంటీమీటర్లు, ఛాతీ గాలి పీల్చినప్పుడు 84 సెంటీమీటర్లు, వదిలినప్పుడు 80 సెంటీమీటర్లు ఉండాలి. అన్ని విభాగాల్లోని ఎస్సై పోస్టులకు మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎస్టీ పురుష అభ్యర్థుల ఎత్తు 160 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతీ చుట్టుకొలత గాలి పీల్చినప్పుడు 80 సెంటీమీటర్లు, వదిలేసినప్పుడు 77 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్టీ మహిళల కనీస ఎత్తు 150 సెంటీమీటర్లు ఉండాలి. ఈవెంట్స్ జనరల్ ఎక్స్‌సర్వీస్‌మెన్ మహిళలకు 100 మీటర్ల పరుగు 15 సెకన్లు 16.5 సెకన్లు 20 సెకన్లు లాంగ్‌జంప్ 3.80 మీటర్లు 3.65 మీటర్లు 2.5 మీటర్లు షాట్‌పుట్ (7.26 కేజీలు) 5.60 మీటర్లు 5.60 మీటర్లు 3.75 మీటర్లు హైజంప్ 1.20 మీటర్లు 1.05 మీటర్లు - 800 మీటర్ల పరుగు 170 సెకన్లు 200 సెకన్లు - (షాట్‌పుట్ బాల్ బరువు పురుషులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 7.26 కేజీలు, మహిళలకు 4 కేజీలు)