సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు అభ్యర్థుల కోసం మరో ప్రకటన చేసింది పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు. దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇవాళ్టితో గడువు ముగియాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ నెల(మే) 26వ తేదీ వరకు తుది గడువు ఉంటుందని తెలిపింది.
పోలీసుశాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. దీంతో.. ఇప్పుడు దరఖాస్తుదారుల కోసం గడువు తేదీని పొడిగించినట్లు తెలుస్తోంది.
పోలీసుశాఖతో పాటు ఫైర్, జైళ్లు, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, ఎస్పీఎస్ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల(మే) 2వ తేదీ నుండి పోలీస్ ఉద్యోగాల కోసం ధరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఒకే అభ్యర్ధి ఎన్ని పోస్టులకైనా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 20 రాత్రి 10 గంటల వరకు సమయమని తొలుత పేర్కొంది. అయితే వయోపరిమితి పెంచిన నేపథ్యంలో దరఖాస్తు గడువు తేదీని కూడా పెంచింది. మరోవైపు వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయంటూ కొందరు దరఖాస్తుదారులు ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment