సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు నియామకాల్లో ఎమ్మెస్పీ (మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్) కోటాలో గందరగోళం నెలకొంది. ఈ కోటా ప్రకారం జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్)కు ఆడినవారు ఎమ్మెస్పీ అర్హులు. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నోటిఫికేషన్‌లోనూ పేర్కొంది. కానీ, అమలు విషయం లో పోలీసు ఉన్నతాధికారుల్లోనే సమన్వయం కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరందరినీ ఎమ్మెస్పీ కోటా కింద అనుమతించాలి. కానీ, ఒక్కో జిల్లాలో అధికారులు ఒక్కోలా వ్యవహరించడంతో స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఆశించే అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. దీంతో తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు అభ్యర్థులు డీజీపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
అభ్యర్థులు ఏమంటున్నారంటే..
సంగారెడ్డి జిల్లా కోహిర్‌కు చెందిన విజయలక్ష్మి.. ఛత్తీస్‌గఢ్‌లో 59వ నేషనల్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొంది. ఎమ్మెస్పీ కోటాకు అర్హత ఉంది. కానీ, ఈమెకు పోలీసు కానిస్టేబుల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఎమ్మెస్పీ విభాగం కింద అధికారులు అనుమతించలేదు. కానీ, ఆమెతోపాటు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఆటల్లో పాల్గొన్న వారికి ఇతర జిల్లాల్లో ఎమ్మెస్పీ రిజర్వేషన్ కింద అనుమతి లభించింది. సూర్యాపేట జిల్లా కల్లూరుకు చెందిన విజయ్‌కుమార్.. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇతనికి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఎమ్మెస్పీ కోటా కింద అనుమతించలేదు. ఇతడి తర్వాత సర్టిఫికెట్ వెరికేషన్‌కు హాజరైన అభ్యర్థులను ఎమ్మెస్పీ కోటాలో అనుమతించారని వాపోతున్నాడు. ఇలాంటి బాధిత అభ్యర్థులు ప్రతీ జిల్లాకు ఉన్నారు. ప్రతీ 100 పోస్టులకు 2 సీట్లు ఎమ్మెస్పీ కోటా కింద భర్తీ చేస్తారు. రాష్ట్రం తరఫున జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆశావహులంతా ఇప్పుడు అధికారుల తీరుతో నీరుగారిపోతున్నారు.
జీవో 74 ఏం చెబుతోంది?
క్రీడా విధానం, ఎమ్మెస్పీ కోటాకు సంబంధించి విధివిధానాలను రూపొందిస్తూ 2012లో జీవో నం 74ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి స్కూల్ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు 2 శాతం కోటా అమలు చేయాలి. ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, షూటింగ్, ఫెన్సింగ్, రోలర్ స్కేటింగ్, సెయిలింగ్/యాట్చింగ్, ఆర్చరీ, క్రికెట్, చెస్, ఖో–ఖో, జుడో, టైక్వాండో, సాఫ్ట్‌బాల్, బాడీ బిల్డింగ్ మొత్తం 29 క్రీడలకు ఇందులో చోటు కల్పించారు.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక సంస్థ (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఎమ్మెస్పీ కోటా కింద కూడా ఇవే 29 క్రీడాంశాలను పరిగణనలోకి తీసుకుంటామని గతేడాది పోలీసు నియామకాల సందర్భంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కానీ, ఇప్పుడు అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు.
ముమ్మాటికీ సమన్వయ లోపమే..
వాస్తవానికి మా వద్ద నుంచి జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించాలంటే చాలా దశలుంటాయి. స్కూలు హెడ్‌మాస్టర్, పీఈటీ ఆమోదం, జిల్లా అధికారుల ఆమోదం పొందాక మేం కూడా అనుమతించాలి. ఇంత ప్రక్రియ తర్వాత వారు జాతీయ స్థాయిలో ఆడతారు. ఈ వివరాలన్నీ వెబ్‌స్డైట్‌లలో ఉంటాయి. నిబంధనల ప్రకారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నీలో అండర్–14 నుంచి అండర్–19 వరకు పాల్గొన్నవారు ఎమ్మెస్పీ కోటాకు అర్హులు. అధికారులు ఒక చోట అనుమతించి, మరోచోట అనుమతించకపోవడం దురదృష్టకరం.
రామ్‌రెడ్డి, సెక్రటరీ,స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్), తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment