television series
-
టామీ షెల్బీ రిటర్న్స్
టామీ షెల్బీగా సిలియన్ మర్ఫీ మళ్లీ రానున్నాడు. విశేషఆదరణ పొందిన టెలివిజన్ సిరీస్ (2013 –2022) ‘పీకీ బ్లైండర్స్’లో మర్ఫీ పోషించిన టామీ షెల్బీ ప్రేక్షకులను ఆకటు కుంది. ఈ బ్రిటిష్ పీరియాడికల్ క్రైమ్ సిరీస్‌ను స్టీవెన్ నైట్ క్రియేట్ చేశారు. ఓ యువకుల ముఠా చేసే దొంగతనాల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఈ ముఠాలో కీలకమైన వాడే టామీ షెల్బీ. ఇప్పుడు ఈ సిరీస్‌ను సినిమాగా తీయనున్నారు స్టీవెన్. అయితే స్టీవెన్ నైట్ స్క్రిప్ట్ రాస్తారు. టామ్ హార్పర్ డైరెక్ట్ చేస్తారు. కాగా సిరీస్‌లో టామీ షెల్బీపాత్రను చేసిన సీలియన్ మర్ఫీనే సినిమాలోనూ ఆపాత్ర చేయనున్నారు. ‘పీకీ బ్లైండర్స్’ సిరీస్‌ను సినిమాగా నిర్మించనున్నట్లు, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు బుధవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ ఏడాది మార్చిలో జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘అపెన్హైమర్’ సినిమాకుగానూ సీలియన్ మర్ఫీ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. -
నంబర్ వన్
ఇండియన్ సినిమా అండ్ టెలివిజన్ సిరీస్‌కు సంబంధించి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ) వెబ్సైట్ ఈ ఏడాదికి సంబంధించిన ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాను విడుదల చేసింది. ఇందులో తొలి స్థానంలో నిలిచారు హీరోయిన్ ప్రియాంకా చోప్రా. రెండో స్థానంలో దిశా పటానీ, మూడో స్థానాన్ని హృతిక్ రోషన్ కైవసం చేసుకున్నారు. కియారా అద్వానీ, అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్, ఆలియా భట్, కత్రినా కైఫ్, రకుల్‌ప్రీత్ సింగ్, కత్రినా కైఫ్ వరుస క్రమంలో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. దక్షిణాది నుంచి కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ ఒక్కరే ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. ఐఎమ్‌డీబీ ప్రోస్టార్ మీటర్ ర్యాంకింగ్స్, ఐఎమ్‌డీబీ పేజ్ వ్యూయర్స్ వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ జాబితాను విడుదల చేయడం జరిగిందని ఐఎమ్‌డీబీ ప్రతినిధి పేర్కొన్నారు. -
అంత డోస్ వద్దు బసు!
బాలీవుడ్లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సైఫ్ అలీఖాన్, కియారా అద్వానీ, రాధికా ఆప్టే.. తదితర తారలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కూ ఓకే చెబుతున్నారు. తాజాగా బిపాసా బసు కూడా ఈ వైపు అడుగులు వేయబోతున్నారని బీటౌన్ టాక్. పాపులర్ అమెరికన్ టెలివిజన్ సిరీస్ ‘అన్రియల్’ ఆధారంగా ఓ టెలివిజన్ సిరీస్ బాలీవుడ్లో మొదలు కానుందట. ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట బిపాసా. టీఆర్పీల కోసం అడల్ట్ కంటెంట్‌ను క్రియేట్ చేసే ఓ రియాలిటీ షో ప్రొడ్యూసర్‌గా బిపాసా నటిస్తారట. ‘అన్రియల్’లోని కంటెంట్ కాస్త బోల్డ్‌గా ఉంటుందట. అయితే డోస్ వద్దు బసు అని సన్నిహితులు చెప్పడంతో పాటు, తాను కూడా సుముఖంగా లేకపోవడంతో నిర్వాహకులతో మాట్లాడి ఇండియన్ సిరీస్‌కి మాత్రం డోస్ తగ్గించాలనుకుంటున్నారట బిపాసా. -
క్రెగ్ స్థానంలో... కొత్త జేమ్స్‌బాండ్!
హాలీవుడ్ చిత్రాల్లో లేటెస్ట్ జేమ్స్‌బాండ్ అయిన డేనియల్ క్రెగ్ ఇప్పుడు ఆ పాత్ర నుంచి పక్కకు తప్పుకుంటున్నారా? హాలీవుడ్లో ఇప్పుడు చర్చంతా దాని మీదే నడుస్తోంది. అమెరికాలోని తాజా టెలివిజన్ సిరీస్ ‘ప్యూరిటీ’లో నటించడానికి 47 ఏళ్ళ క్రెగ్ చర్చలు జరుపుతున్నారనీ, ఈ దెబ్బతో తదుపరి జేమ్స్‌బాండ్ సినిమాలో నటించడానికి ఆయనకు తీరిక ఉండదనీ వార్తలు వస్తున్నాయి. ఇరవయ్యేసి భాగాలు ఒక సిరీస్ చొప్పున ‘ప్యూరిటీ’ అనేక సిరీస్‌లుగా నడుస్తుందట! జొనాథన్ ఫ్రాన్జెన్ నవల ‘ప్యూరిటీ’ ఆధారంగా ఈ టీవీ సిరీస్‌ను రూపొందించ నున్నారు. ఒకవేళ అంతా కుదిరితే, బ్రిటిష్ యాక్టర్ డేనియల్ క్రెగ్ నటించే తొలి అమెరికన్ టీవీ సిరీస్ ఇదే అవుతుంది. తండ్రి కోసం వెతుకుతున్న ‘ప్యూరిటీ’ అనే ఆ అమ్మాయికి సాయపడే పాత్రలో క్రెగ్ కనిపిస్తారట! ఈ టీవీ సిరీస్ మాటెలా ఉన్నా, జేమ్స్‌బాండ్ పాత్రల్లో కొనసాగడం తనకిక పెద్దగా ఇష్టం లేదని క్రెగ్ కొన్నాళ్ళుగా చెబుతున్నారు. దశాబ్దకాలంగా ‘క్యాసినో రాయల్’, ‘క్వాంటమ్ ఆఫ్ సొలేస్’, ‘స్కైఫాల్’, ‘స్పెక్టర్’ చిత్రాల్లో జేమ్స్‌బాండ్ పాత్రతో క్రెగ్ అలరించారు. ఆయన తాజా బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ 60 కోట్ల పౌండ్లు (రూ. 6 వేల కోట్లు) వసూలు చేసింది. ‘స్పెక్టర్’ చిత్ర షూటింగ్ టైమ్‌లో ఒంటికి దెబ్బలు తగిలి, క్రెగ్ మోకాలి శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికి నాలుగు జేమ్స్‌బాండ్ సినిమాల్లో నటించిన మీరు అయిదోసారి ఆ పాత్ర చేపడతారా అన్నప్పుడు, ‘కేవలం డబ్బుల కోసమే చేయాలి’ అని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘నాకూ వేరే జీవితం ఉంది. దాని సంగతి చూసుకోవాలి కదా! ప్రస్తుతానికైతే మళ్ళీ జేమ్స్‌బాండ్‌గా చేయాలనుకోవడం లేదు’ అని కొన్ని నెలల క్రితం ఆయన వ్యాఖ్యానించారు. ఆ మాటలు, ఇప్పుడీ టీవీ సిరీస్ సన్నాహాలు చూస్తుంటే, క్రెగ్ ఇక జేమ్స్‌బాండ్‌గా చేయనట్లే అని కొందరి వాదన. ఇప్పటికే దర్శకుడు శామ్ మెన్‌డెస్ కూడా బాండ్ సిరీస్ నుంచి బయటకు వచ్చేశారు. హీరో క్రెగ్ కూడా గుడ్‌బై చెబుతున్నారు. జేమ్స్‌బాండ్ సిరీస్‌లో మొన్నటి ‘స్పెక్టర్’ 24వ సినిమా గనక, రానున్న 25వ సినిమాలో ‘బాండ్... జేమ్స్‌బాండ్...007’గా ఎవరు కనిపిస్తారో? -
ప్రియాంకా చోప్రా 'క్వాంటికో' సిరీస్‌పై కేసు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాను తొలిసారిగా హాలీవుడ్ బుల్లితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన టెలివిజన్ సిరీస్ క్వాంటికో. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఇటీవల ప్రారంభమైన ఈ సిరీస్‌కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ప్రియాంక నటన ఈ సీరియల్‌కు హైలైట్ అంటూ కితాబిస్తున్నారు హాలీవుడ్ విశ్లేషకులు. అయితే, హాలీవుడ్ బుల్లితెర మీద మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్‌లలో ఒకటిగా పేరు తెచ్చుకుంటున్న క్వాంటికో సిరీస్ కాపీ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. 1999లో సీఎన్ఎన్లో ప్రసారమైన ఓ అమెరికన్ సిరీస్‌లోని ఐడియాను ఎలాంటి అనుమతి లేకుండా క్వాంటికో సిరీస్ కోసం వినియోగించుకున్నారంటూ నిర్మాత మార్క్ గోర్డాన్ పై కేసు నమోదైంది. సిఎన్ఎన్లో ప్రసారమైన సీరియల్ ను తెరకెక్కించిన జెమ్మి హెల్మన్, బార్బరా లెబోవిట్జ్లు తన అభ్యంతరాలను తెలియజేస్తూ 35 పేజీల ఫిర్యాదును లాస్ ఏంజిల్స్‌లోని సుపీరియర్ కోర్ట్‌లో అందజేశారు. ప్రియాంకా చోప్రా హాలీవుడ్ ఎంట్రీతో భారీ హైప్ క్రియేట్ అయిన ఈ టివి సిరీస్ ఎబిసి ఛానల్లో ప్రసారం అవుతోంది. ఎఫ్బిఐలో చేరిన కొంత మంది వ్యక్తుల కథగా ఈ సీరియల్ తెరకెక్కుతుంది. ఎఫ్బిఐ ట్రైనింగ్‌లో జాయిన్ కాకముందు వారి నేపథ్యంతో పాటు ట్రైనింగ్‌లో వారు ఎలా ఉన్నారు, ట్రైనింగ్ తరువాత ఎలాంటి ఆపరేషన్స్ ప్లాన్ చేశారు అన్నదే క్వాంటికో కథ.