క్రెగ్ స్థానంలో... కొత్త జేమ్స్‌బాండ్! | No, Daniel Craig Hasn't Quit Being James Bond | Sakshi
Sakshi News home page

క్రెగ్ స్థానంలో... కొత్త జేమ్స్‌బాండ్!

Published Mon, Feb 15 2016 10:47 PM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

క్రెగ్ స్థానంలో... కొత్త జేమ్స్‌బాండ్!

క్రెగ్ స్థానంలో... కొత్త జేమ్స్‌బాండ్!

హాలీవుడ్ చిత్రాల్లో లేటెస్ట్ జేమ్స్‌బాండ్ అయిన డేనియల్ క్రెగ్ ఇప్పుడు ఆ పాత్ర నుంచి పక్కకు తప్పుకుంటున్నారా? హాలీవుడ్‌లో ఇప్పుడు చర్చంతా దాని మీదే నడుస్తోంది. అమెరికాలోని తాజా టెలివిజన్ సిరీస్ ‘ప్యూరిటీ’లో నటించడానికి 47 ఏళ్ళ క్రెగ్ చర్చలు జరుపుతున్నారనీ, ఈ దెబ్బతో తదుపరి జేమ్స్‌బాండ్ సినిమాలో నటించడానికి ఆయనకు తీరిక ఉండదనీ వార్తలు వస్తున్నాయి. ఇరవయ్యేసి భాగాలు ఒక సిరీస్ చొప్పున ‘ప్యూరిటీ’ అనేక సిరీస్‌లుగా నడుస్తుందట! జొనాథన్ ఫ్రాన్‌జెన్ నవల ‘ప్యూరిటీ’ ఆధారంగా ఈ టీవీ సిరీస్‌ను రూపొందించ నున్నారు. ఒకవేళ అంతా కుదిరితే, బ్రిటిష్ యాక్టర్ డేనియల్ క్రెగ్ నటించే తొలి అమెరికన్ టీవీ సిరీస్ ఇదే అవుతుంది. తండ్రి కోసం వెతుకుతున్న ‘ప్యూరిటీ’ అనే ఆ అమ్మాయికి సాయపడే పాత్రలో క్రెగ్ కనిపిస్తారట!

 ఈ టీవీ సిరీస్ మాటెలా ఉన్నా, జేమ్స్‌బాండ్ పాత్రల్లో కొనసాగడం తనకిక పెద్దగా ఇష్టం లేదని క్రెగ్ కొన్నాళ్ళుగా చెబుతున్నారు. దశాబ్దకాలంగా ‘క్యాసినో రాయల్’, ‘క్వాంటమ్ ఆఫ్ సొలేస్’, ‘స్కైఫాల్’, ‘స్పెక్టర్’ చిత్రాల్లో జేమ్స్‌బాండ్ పాత్రతో క్రెగ్ అలరించారు. ఆయన తాజా బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ 60 కోట్ల పౌండ్లు (రూ. 6 వేల కోట్లు) వసూలు చేసింది. ‘స్పెక్టర్’ చిత్ర షూటింగ్ టైమ్‌లో ఒంటికి దెబ్బలు తగిలి, క్రెగ్ మోకాలి శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికి నాలుగు జేమ్స్‌బాండ్ సినిమాల్లో నటించిన మీరు అయిదోసారి ఆ పాత్ర చేపడతారా అన్నప్పుడు, ‘కేవలం డబ్బుల కోసమే చేయాలి’ అని ఆయన కుండబద్దలు కొట్టారు.

 ‘నాకూ వేరే జీవితం ఉంది. దాని సంగతి చూసుకోవాలి కదా! ప్రస్తుతానికైతే మళ్ళీ జేమ్స్‌బాండ్‌గా చేయాలనుకోవడం లేదు’ అని కొన్ని నెలల క్రితం ఆయన వ్యాఖ్యానించారు. ఆ మాటలు, ఇప్పుడీ టీవీ సిరీస్ సన్నాహాలు చూస్తుంటే, క్రెగ్ ఇక జేమ్స్‌బాండ్‌గా చేయనట్లే అని కొందరి వాదన. ఇప్పటికే దర్శకుడు శామ్ మెన్‌డెస్ కూడా బాండ్ సిరీస్ నుంచి బయటకు వచ్చేశారు. హీరో క్రెగ్ కూడా గుడ్‌బై చెబుతున్నారు. జేమ్స్‌బాండ్ సిరీస్‌లో మొన్నటి ‘స్పెక్టర్’ 24వ సినిమా గనక, రానున్న 25వ సినిమాలో ‘బాండ్... జేమ్స్‌బాండ్...007’గా ఎవరు కనిపిస్తారో?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement