టూకీగా ప్రపంచ చరిత్ర 68
మెసొపొటేమియాలో మొదలైన దేవాలయ సంస్కృతి, అనతి కాలంలోనే పడమరగావున్న ఈజిప్టుకూ, ఉత్తరంగా మధ్యధరాసముద్రానికి ఆవలిగట్టునున్న గ్రీసుకూ ఆగమేగాల మీద ప్రాకిపో?ఇంది. ఐతే, ఈజిప్టు దేవాలయాలకూ మెసొపొటేమియా దేవాలయాలకూ నమునాలో కొంత తేడా ఏర్పడింది. మెసొపొటేమియన్ దేవాలయాలు విధిగా తూప్పు ముఖానివై ఉంటాయి. నిర్దేశించిన పండుగనాడు సూర్యోదయం తొలికిరణాలు, కుడి ఎడమల చీకటి మయంగా ఉండే నడవను ప్రాకి, బలిపీఠం వెనకుండే విగ్రహాన్ని కొన్ని క్షణాలపాటు దేదీప్యమానం చేసే దిశగా ముఖద్వారం ఏర్పాటైవుంటుంది.
ఈజిప్టు పిరమిడ్లు కూడా చాలావరకు తూర్పు ముఖానివే. అరుదుగా పడమటి ముఖాలవి కూడా కనిపిస్తాయి. ఈజిప్టు పాలకుడు ‘ఫ్యారో’ తల అమర్చిన సింహం ప్రతిమలు (స్పింక్స్) తూర్పు ముఖంగానే ఉన్నాయి. కానీ, నైలునది దక్షిణ ప్రాంతంలోని గుళ్ళు ‘సిరియస్’ నక్షత్రానికి అభిముఖంగా ఉత్తరానికి తెరుచుకుంటూ ఉన్నాయి. దీన్నిబట్టి, సూర్యునికీ నక్షత్రాలకూ మధ్యనున్న అనుబంధం మీద ఈజిప్షియన్లకు కొంత అవగాహన మొదలైనట్టు తెలుస్తుంది.
క్రీ.పూ. 4000 సంవత్సరాలనాడు ఏర్పడిన సంతలకు క్రమేణా ప్రాధాన్యత విస్తరించి, మెసొపొటేమియాకు నలుదిక్కులతో వాణిజ్య సంబంధాలు నెలకొనడంతో, ఈజిప్టు, గ్రీకు, సింధూ నాగరికతల్లోని స్థిరనివాసాలతో అనుబంధం ఏర్పడడమేకాక, దరిదాపుల్లోని సంచారజాతులతో శత్రు-మిత్ర సంబంధాలు ఉనికిలోకొచ్చాయి. దరిమిలా, సరుకుల ఎగుమతి దిగుమతులేగాక, వణిజుల రాకపోకలు కూడా ముమ్మరం కావడంతో సరుకుల రవాణా కంటే వేగంగా సాంస్కృతికమైన అభిప్రాయాలూ, విశ్వాసాలూ విస్తారంగా నెరుసుకునే వాతావరణం ఏర్పడింది. పరాయి ప్రదేశంలో పుట్టిన విశ్వాసాల్లో ఏది అనుకూలమో దాన్ని స్వీకరించడం, ఏది ప్రతికూలమో దాన్ని వదిలెయ్యడం మూలంగా, నాగరికజాతుల సంస్కృతి కలగాపులగమైన మిశ్రమంగా చాలాకాలం మనుగడ సాగించింది.
ఆ మధ్యకాలంలో, దేవాలయాల నిర్మాణం సందర్భంగా ‘దేవునికి ఒక రూపం కల్పించడం ఎలా?’ అనే సమస్య తలెత్తింది. ‘మనిషీ, జంతువూ తదితర ప్రాణికోటి సమస్తం ఆయన సృష్టే అయినప్పుడు దేవుని ఆకారం ఒకానొక మానవునికి మల్లే ఎందుకుంటుంది? తన పోలికలోనే వున్న ఆకారం మనిషి నుండి విధేయతను శాసించగలదా?’ అనే చింతన ఈజిప్టు, మెసొపొటేమియాల్లోని విగ్రహాల స్వరూపాన్ని నిర్ణయించింది. ఈ విగ్రహాలు గొంతునుండి కాళ్ళదాకా మానవుని ఆకారంలో వున్నా, తలమాత్రం పక్షిదో పశువుదో అయ్యుంటుంది. చేప దేవతలైతే, బొట్టు కిందిభాగం చేప, పైభాగం మనిషి. ఎందుకోగానీ గ్రీకులు మాత్రం ఈ నమ్మకానికి చోటివ్వలేదు. వాళ్ల దేవతల విగ్రహాలన్నీ మానవుని పోలికలోనే వుంటాయి.
దేవునికి ఒట్టిచేతులతో, వినయపూర్వకమైన భంగిమలతో తృప్తిపరచడం చాలదనే ఆలోచన ఆలయాల నిర్మాణానికి పూర్వమే ఏర్పడిందో, తరువాత ఏర్పడిందో గానీ, దేవాలయాల్లో ‘బలి’ అనేది విధిగా ప్రవేశించింది. ప్రతి దేవాలయంలోనూ విగ్రహానికి ఎదురుగా కొంతదూరంలో బలిపీఠం వెలిసింది. బలిని సమర్పించే ముందు, భక్తుని విధేయతను కళ్ళారా చూసేందుకు ఆ దేవుడ్ని ఆహ్వానించాలి. అందుకు తగిన మనిషి కావాలి, తగిన వాగ్ధాటి కావాలి. ఫలితంగా ప్రతి దేవాలయానికీ ఒక అర్చకుడు (పూజారి) అవసరమయ్యాడు. అతను స్థిరంగా పాదుకున్నాడు. ఆ అర్చకుని మూలంగా ఆచారాలూ, నమ్మకాలు మరింత జటిలంగా పెనవేసుకుని, సమాజంలోని కట్టుబాట్లను శాసించడం మొదలెట్టాయి.
రచయిత ఫోన్: 9440280655;
email: mvrr44@gmail.com
రచన: ఎం.వి.రమణారెడ్డి