tennis game
-
ఆడే సత్తా నాలో ఉంది: షరపోవా
బ్రిస్బేన్: మాజీ ప్రపంచ నంబర్‌వన్ మరియా షరపోవా తనలో ఇంకా టెన్నిస్ ఆడే సత్తా ఉందని చెప్పింది. ఈనెల 6 నుంచి బ్రిస్బేన్‌లో జరిగే ఈ టోర్నీలో మాజీ విజేత అయిన షరపోవాకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ రష్యా స్టార్ 2015లో ఇక్కడ టైటిల్ గెలిచింది. ఏటా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీకి ముందు సన్నాహక టోర్నీగా ఈ ఈవెంట్ జరుగుతుంది. ఇందులో పాల్గొంటానని చెప్పిన 32 ఏళ్ల షరపోవా కెరీర్ తొలినాళ్లలో 30 దాటాక కూడా ఆడతానని ఎప్పుడు అనుకోలేదని తెలిపింది. ‘కానీ నాలో ఆట మిగిలుంది. నా రాకెట్‌తో దూసుకెళ్లే సత్తా కూడా ఉంది. నేనిక్కడ ఎవరికైనా మేటి ప్రత్యర్థినే’ అని రష్యా స్టార్ వివరించింది. గత సీజన్ క్లిష్టంగా గడిచిన తనకు ఇది తాజా ఆరంభమని చెప్పుకొచ్చింది. ఆగస్టులో జరిగిన యూఎస్ ఓపెన్‌లో సెరెనాతో తొలి రౌండ్లో ఓడిపోయాక షరపోవా మళ్లీ బరిలోకి దిగలేదు. దీంతో డబ్ల్యూటీఏ ర్యాంకుల్లో ఆమె 133వ ర్యాంకుకు పడిపోయింది. బ్రిస్బేన్ ఈవెంట్లో ఆమెతో పాటు నయోమి ఒసాకా, యాష్లే బార్టీ, ప్లిస్కోవా, ఎలీనా స్వితొలినా, క్విటోవా, కికి బెర్టెన్స్ తదితర స్టార్ క్రీడాకారిణులు పాల్గొంటున్నారు. -
సానియా వస్తోంది!
న్యూఢిల్లీ: భారత సంచలన టెన్నిస్ స్టార్‌గా వెలుగువెలిగిన హైదరాబాదీ సానియా మీర్జా మళ్లీ బరిలోకి దిగేందుకు రాకెట్ పట్టింది. ఓ పండంటి కుమారుడికి తల్లయ్యాక కూడా తనలో టెన్నిస్ ఆడే తపన తగ్గలేదని చెబుతోంది. ఆట కోసం ఏదో ఆదరబాదరగా సిద్ధమైపోలేదు. ప్రసవం వల్ల సహజంగానే ఆమె కాస్తా లావెక్కారు. బరిలో దిగడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సీనియర్ డబుల్స్ ప్లేయర్ ఓ క్రమపద్ధతిలో కసరత్తులు చేసింది. రోజు 5 గంటలపాటు ట్రెయినింగ్‌లో చెమటోడ్చింది. జనవరికి ముందే ఇలా లక్ష్యాన్ని పెట్టుకున్న హైదరాబాదీ స్టార్ 4 నెలలు క్రమం తప్పకుండా శ్రమించి ఏకంగా 26 కేజీల బరువు తగ్గింది. టెన్నిస్ ఫిట్‌నెస్‌కు సరిపోయే క్రీడాకారిణిగా మారింది. 2017లో చైనా ఓపెన్ ఆడుతున్న సమయంలో మోకాలు గాయంతో ఆటకు దూరమైన సానియా తదనంతరం గర్భం దాల్చడంతో పూర్తిగా రాకెట్‌ను అటక ఎక్కించింది. తనకిష్టమైన టెన్నిస్ తనకు దూరమైన బాధ కలుగుతుందనే ఉద్దేశంతో ఆమె ఈ రెండేళ్లు టీవీల్లో కూడా టెన్నిస్ మ్యాచ్‌లు చూడలేదని చెప్పింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది. ఆరు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించిన సానియా ఒకానొక దశలో ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ క్రీడాకారిణిగా నిలిచింది. ఈ నెల 11 నుంచి జరిగే డబ్ల్యూటీఏ హోబర్ట్ ఓపెన్ టోర్నమెంట్లో ఆమె పాల్గొంటుంది. మహిళల డబుల్స్‌లో నదియా కిచెనక్ (ఉక్రెయిన్)తో మిక్స్‌డ్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి బరిలోకి దిగనుంది. ‘నేను మళ్లీ రాకెట్ పట్టడానికి ప్రధాన కారణం... నేను టెన్నిస్ ఆడటం, గెలవటం, పోటీపడటం వీటన్నింటిని మిస్ అవుతున్నానన్న భావన నన్ను నన్నులా ఉండనివ్వడం లేదు. నిజం చెప్పాలంటే గత రెండేళ్లుగా నా కిట్‌ను పక్కన బెట్టేశాను. నేను అనుకున్న ఫలితాలు సాధించాననే తృప్తితో ఉన్నాను. అయితే అప్పుడే నాలో ఇంకా టెన్నిస్ ఆడే సత్తా మిగిలే ఉందని అనిపించింది. ఇలా అనిపించడం వల్లే మళ్లీ బరిలోకి రాగలుగుతున్నాను’ అని వివరించింది. పెళ్లితో ఓ గృహిణిగా మారాక తనలో ఎన్నో మార్పులొచ్చేవని... ఇక నా ఆట నా నుంచి పూర్తిగా దూరమవుతుందనే బెంగకూడా ఉండేదని సానియా చెప్పింది. -
అట్టహాసంగా ప్రారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అట్టహాసంగా ఐటా టెన్నిస్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. నదాల్ టెన్నిస్ స్కూల్ ఆధ్వర్యంలో ఫాదర్ ఫెర్రర్ స్మారక చాంపియన్ టోర్నీని ఆర్డీటీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డైరెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టెన్నిస్ టోర్నీకి అనంత క్రీడాగ్రామం వేదిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. మెయిన్ డ్రా పోటీలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయన్నారు. పోటీలను ఐటా రిఫరీ శ్రీకుమార్, నదాల్ టెన్నిస్ స్కూల్ కో ఆర్డీనేటర్ సిస్కో, టోర్నీ డైరెక్టర్ భాస్కరాచార్య, కంప్యూటర్ టీచర్ కష్ణా తదితరులు పాల్గొన్నారు. క్వాలిఫయింగ్ పోటీల్లో విజేతల వివరాలు అండర్–14 బాలుర విభాగం : ప్రియతం, ఆదిత్ అమర్నాథ్, రమణ. శేఖర్, నాయుడు రిత్వీక్, శివకార్తీక్, సోమసి శ్రావణి, వెంకటేష్, హేమవర్ధన్. అండర్–16 బాలుర విభాగం : సుందర గణపతి, ప్రణీత్, నితిన్, హరి, వంశీ రెడ్డి, హేమాశ్రీ రాజసింహ, సాయిధనుష్, హరీష్ లు విజయం సాధించి మెయిన్ డ్రా పోటీలకు అర్హత సాధించారు. -
నేటి నుంచి దిగ్గజాల సమరం
* పేస్- నవ్రతిలోవా, భూపతి- సానియా జోడీల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు కోల్‌కతా: టెన్నిస్ క్రీడను భారత్‌లో మరింత మందికి చేరువ చేసేందుకు నేటి (బుధవారం) నుంచి దిగ్గజ ఆటగాళ్లతో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. భారత టెన్నిస్‌ను విశ్వవ్యాప్తం చేసిన లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జాలతో పాటు అంతర్జాతీయ టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా ఈ మ్యాచ్‌ల్లో అభిమానులను కనువిందు చేయనున్నారు. వచ్చే నెల 2 నుంచి జరిగే అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) ప్రమోషన్లో భాగంగా జరుగుతున్న ఈ మూడు ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో మొదటిది కోల్‌కతాలో జరుగుతుంది. 26న రెండో మ్యాచ్ హైదరాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో, 27న చివరిది న్యూఢిల్లీలో జరుగుతుంది. మ్యాచ్‌ల్లో పేస్‌తో కలిసి నవ్రతిలోవా బరిలోకి దిగుతుండగా మరో జంటగా భూపతి, సానియా ఆడనున్నారు. పేస్, మార్టినా గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లు సాధించారు. అలాగే సానియా, భూపతి జోడి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకుంది.