వీహెచ్ ఇక ఇంటికే... కాంగ్రెస్కు నిరాశ
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
త్వరలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్
దశాబ్దన్నర కాలంపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు త్వరలోనే పదవికి దూరం కానున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం పోటీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులకు తీవ్ర నిరాశ ఎదురుకానుంది.
కాంగ్రెస్ కు నిరాశే
రెండు రాష్ట్రాల్లో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న రాజ్యసభ సభ్యుల్లో ప్రధానంగా కాంగ్రెస్ సభ్యులకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అవకాశాలు కనిపించడం లేదు. ఏపీ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రాతినిథ్యం లేదు. దాంతో జైరాం రమేష్, జేడీ శీలంలకు ఈ రాష్ట్రం నుంచి తిరిగి ఎన్నిక కావడానికి అసలు అవకాశం లేదు. ఇక తెలంగాణ అసెంబ్లీలో కూడా తగిన బలం లేని కారణంగా ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశాలు లేకపోవడంతో వీహెచ్ కూడా ఈసారి పదవికి దూరం కావలసిందే.
తెలంగాణ నుంచి వీహెచ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న జైరాం రమేష్, జేడీ శీలం పదవీ కాలం వచ్చే జూన్ నెలాఖరుతో ముగుస్తోంది. వీహెచ్ తో పాటు టీడీపీ నుంచి ఎన్నికై ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ వైపు మొగ్గిన గుండు సుధారాణి పదవీ కాలం కూడా పూర్తవుతోంది. ముచ్చటగా మూడోసారి రాజ్యసభకు అవకాశం లభించిన వీహెచ్ వచ్చే జూన్ 21 తో తన పదవీ కాలం పూర్తవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అది కూడా కాంగ్రెస్ పార్టీలో మూడోసారి రాజ్యసభ అవకాశం దక్కిన అతికొద్ది మందిలో వీహెచ్ ఒకరు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో మూడోసారి రాజ్యసభకు అవకాశం కల్పించదు.
సోనియాగాంధీ కుటుంబానికి వీరభక్తుడిగా వీహెచ్ మూడోసారి చిక్కించుకున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆయనకు అవకాశం లేదు. తొలిసారి 1992-1998 వరకు, రెండోసారి 2004 - 2010, ప్రస్తుతం మూడోసారి 2010-2016 రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ శాసనసభలో రాజ్యసభ స్థానం గెలుచుకునేంత బలం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకవేళ సభలోని మిగిలిన అన్ని పక్షాల మద్దతుతో పోటీ చేయాలన్నా కాంగ్రెస్ వీహెచ్ కు మరో అవకాశం కల్పించడానికి కూడా సిద్ధంగా లేదని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
మార్చిలో ఎన్నికలు...
ఈ రెండు స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి ఆఖరులోగానీ మార్చి మొదటి వారంలోగానీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగ్గా విభజనానంతరం ప్రస్తుత రాజ్యసభ్యులను ఆయా రాష్ట్రాలకు కేటాయించారు. ఆ లెక్కన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది, తెలంగాణ నుంచి 7 మంది సభ్యులు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీల నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యులు, వారి పదవీ కాలం వివరాలు
ఆంధ్రప్రదేశ్ లో ...సభ్యులు పదవీ కాలం
సుజనా చౌదరి (టీడీపీ) 21 జూన్ 2016
నిర్మలా సీతారామన్ (బీజేపీ) 21 జూన్ 2016
జైరాం రమేష్ (కాంగ్రెస్) 21 జూన్ 2016
జేడీ శీలం (కాంగ్రెస్) 21 జూన్ 2016
కొణిదెల చిరంజీవి (కాంగ్రెస్) 04 ఆగస్ట్ 2018
రేణుకా చౌదరి (కాంగ్రెస్) 02 ఏప్రిల్ 2018
టి.దేవేందర్ గౌడ్ (టీడీపీ) 02 ఏప్రిల్ 2018
ఎం ఏ ఖాన్ (కాంగ్రెస్) 09 ఏప్రిల్ 2020
కె కేశవరావు (టీఆర్ ఎస్) 09 ఏప్రిల్ 2020
టి. సుబ్బిరామిరెడ్డి (కాంగ్రెస్) 09 ఏప్రిల్ 2020
తోట సీతారామలక్ష్మి (టీడీపీ) 09 ఏప్రిల్ 2020
తెలంగాణలో...
వీ.హనుమంతరావు (కాంగ్రెస్) 21 జూన్ 2016
గుండు సుధారాణి (టీడీపీ - టీఆర్ ఎస్ చేరారు) 21 జూన్ 2016
సీఎం రమేష్ (టీడీపీ) 02 ఏప్రిల్ 2018
రాపోలు ఆనంద భాస్కర్ (కాంగ్రెస్) 02 ఏప్రిల్ 2018
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్) 02 ఏప్రిల్ 2018
గరికపాటి మోహన్ రావు (టీడీపీ) 09 ఏప్రిల్ 2020
కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్) 09 ఏప్రిల్ 2020