tg vankatesh
-
ప్రజాస్వామ్యమా? పైసలస్వామ్యమా?
సాక్షి, హైదరాబాద్: ఈనెల 28న సామాజిక సంఘీభావ కమిటీ తలపెట్టిన విజయవాడ సభకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి 144 సెక్షన్ విధించడంపై సామాజిక సంఘీభావ ఐక్యకార్యాచరణ కమిటీ మండిపడింది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ జరిపి తీరుతామని స్పష్టం చేసింది. చంద్రబాబు కాపాడాలనుకుంటున్నది ప్రజాస్వామ్యాన్నా లేక, పైసలస్వామ్యాన్నో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే తన వెన్నెముక అన్న చంద్రబాబు ఈ రోజు వాళ్లు పెట్టుకుంటున్న సభ జరగకుండా కుయుక్తులు పన్నుతుండటం శోచనీయమని పేర్కొంది. ఆ వైఖరి మార్చుకోకపోతే చంద్రబాబు వెన్నువిరుగుతుందని హెచ్చరించింది. రచయిత కంచ ఐలయ్య అధ్యక్షతన సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ విజయవాడలో జరుపబోతున్న సామాజిక సంఘీభావ కమిటీ సభ ఐలయ్య పుస్తకాన్ని ఉద్దేశించినదికాదన్నారు. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్ల డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ సభ అన్నారు. కంచ ఐలయ్య మాట్లాడుతూ తనను ఉరి తీయాలని ఫత్వా జారీచేసి ఏపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సమస్యని అంతర్జాతీయం చేశారన్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు రక్షణ లేని చోట పెట్టుబడులుపెట్టేందుకూ ఎవ్వరూ ముందుకు రారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు. విజయవాడలో సభ జరిపేతీరుతామని తేల్చి చెప్పారు. ఏపీలోనే అంబానీకి అతిపెద్ద ఆయిల్సోర్స్ ఉందని, నిరుద్యోగులకు, మృత్యువాత పడుతున్న రైతులకు అంబానీ ఏం చేస్తున్నారో బాబు సమాధానం చెప్పాలని ఐలయ్య నిలదీశారు? సామాజిక బాధ్యతను నిర్వర్తించని అంబానీ గ్రూపులకు రాయితీలిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. సభకు అనుమతినిచ్చి మరోపక్క సభ జరగనివ్వం, ఐలయ్య వస్తే దాడి చేస్తామని ఏపీ ప్రభుత్వమే ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలతో చెప్పిస్తోందని బీసీ సంఘాల సమన్వయకమిటీ నాయకులు సాంబశివరావు విమర్శించారు. ఈ ప్రకటన చేసింది టీడీపీకి చెందిన సిరిపురం శ్రీధర్శర్మేనని తేల్చిచెప్పారు. బాబు ఆదేశాల మేరకే సభని అడ్డుకుంటున్నారని కులవివక్ష పోరాట సమితి నేత జాన్‌వెస్లీ చెప్పారు. చంద్రబాబు, టీజీ వెంకటేశ్ ఇదే వైఖరి కొనసాగిస్తే ఏపీలో సైతం టీడీపీకి పుట్టగతులుండవ న్నారు. సుప్రీంకోర్టు పుస్తకంపై స్పష్టత ఇచ్చినా ఐలయ్యను అడ్డుకోవడం కం టెంట్ ఆఫ్ కోర్టు అవుతుందని ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావు అన్నారు. ఏఈపీ బీసీ సంఘం నేతలు రామకృష్ణ, మాష్టార్జీ, శ్రీరాములు నాయక్ పాల్గొన్నారు. -
బీడు బతుకులు
ఆదోని/ఆలూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలు కరువు కోరల్లో విలవిల్లాడుతున్నాయి. సగటు వర్షపాతం 1200 మిల్లీమీటర్లు కాగా.. ఈ ప్రాంతాల్లో 500 మిల్లీమీటర్లు కూడా మించని పరిస్థితి. సాగులో పెట్టుబడులు పెట్టడమే కానీ.. ఏనాడు లాభాలు ఎరుగని దయనీయం. అందునా నల్లరేగడి భూములు కావడంతో ఒక్క పంటతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అరకొర వర్షాలతో రైతన్న ఏటా ఆర్థికంగా చితికిపోతున్నాడు. పంటల సాగుకు ప్రత్యామ్నాయ జలవనరులు లేక చాలా మంది భూములను బీడు పెట్టుకుంటున్నారు. ఫలితంగా వేలాది మంది చిన్న, మధ్య తరగతి రైతులు పొట్ట చేతపట్టుకుని గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి తదితర నగరాల వైపు అడుగులేస్తున్నారు. ఆదోనిలో పుట్టి పెరిగిన కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇక తమకు మంచి రోజలు వస్తాయని ఆశించిన ఆలూరు, ఆదోని, హొళగుంద, చిప్పగిరి, హాలహర్వి, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల ప్రజలకు నిరాశే మిగులుతోంది. తుంగభద్రకు ఉపనది అయిన వేదావతి ఆధారంగా సాగునీటి పథకాలు నిర్మిస్తే ఈ ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా.. ఈ ప్రాంత రైతాంగాన్ని టీజీతో పాటు కర్నూలు పార్లమెంట్ సభ్యుడు, రైల్వే శాఖ కేంద్ర సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాగునీటి పథకాల నిర్మాణానికి అధికారులు పంపిన ప్రతిపాదనలు పాలకుల కార్యాలయాల్లో బూజు పట్టిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు దుర్భర జీవనం గడుపుతున్నారు. చెంతనే నీరున్నా... కృష్ణా బేసిన్-9 పరిధిలోని తుంగభద్రకు వేదావతి ఉపనది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉంది. చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో ప్రవహిస్తున్న ఈ నదిలో దాదాపు 87.8 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కృష్ణా ట్రిబునల్ అంచనా వేసింది. 75 శాతం సగటు లభ్యతను లెక్కించి 56.4 టీఎంసీలు కరువు పీడిత ప్రాంతాల్లో తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చని సూచించింది. ఇందులో మన రాష్ట్రానికి 12.47 టీఎంసీలు, కర్ణాటకకు 38.07 టీఎంసీలు కేటాయించింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టకపోగా.. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు సైతం నోరుమెదపకపోవడం రైతులకు శాపమవుతోంది.