thallada mandal
-
అమెరికా వెళ్తానన్న భార్య.. హత్య చేసిన భర్త
తల్లాడ: తన మాట వినడం లేదని క్షణికావేశానికి లోనైన భర్త.. భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంబంజరలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, మృతుల పెద్దకుమార్తె, మృతురాలి సోదరుడు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు (65), విజయలక్ష్మి (60) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు చేశారు. పెద్ద కుమార్తె కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉంటుండగా.. చిన్న కుమార్తె సునీత అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. చిన్న కూతురును చూసేందుకు పదేళ్ల క్రితం దంపతులిద్దరూ అమెరికా వెళ్లి వచ్చారు. మళ్లీ అమెరికా రమ్మని చిన్న కూతురు ఇటీవల తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. కూతురిని చూడాలనిపిస్తోంది.. వెళదామని విజయలక్ష్మి చెప్పగా.. భర్త అందుకు నిరాకరించాడు. అయినా.. ఈనెల 15న అమెరికా వెళ్లేందుకు ఆమె టికెట్ బుక్ చేసుకుంది. ఈ విషయమై మూడు రోజులుగా ఇద్దరూ గొడవ పడుతున్నారు. భార్య తన మాట వినడం లేదని రగిలిపోతున్న సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు.. ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి విజయలక్ష్మిని కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో పాలు పోసేందుకు వచ్చిన రామకృష్ణారెడ్డి .. ఇద్దరినీ పిలవగా ఎవరూ పలకలేదు. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా.. సుబ్రమణ్యేశ్వర్‌రావు నోట్లో నుంచి నురుగు రావడం.. విజయలక్ష్మి బెడ్ రూమ్‌లో పడిపోయి ఉడంటాన్ని చూసి ఇరుగుపొరుగు వారిని పిలిచాడు. కొన ఊపిరితో ఉన్న సుబ్రమణ్యేశ్వర్‌రావును 108 వాహనంలో కల్లూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. ఖమ్మం అడిషనల్ ఎస్పీ స్నేహ మెహ్రా, వైరా ఏసీపీ సత్యనారాయణ, సీఐ జె.వసంత్‌కుమార్, ఎస్ఐ వి.సురేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. హత్యకు వాడిన కత్తిని, పురుగుల మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఒకే రోజు మూడిళ్లలో చోరీ
తల్లాడ ఖమ్మం : మండలంలోని అన్నారుగూడెంలో బుధవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో దొంగలు మూడిళ్లలో చోరీ చేశారు. మరో మూడిళ్లలోనూ దొంగలు పడ్డారు. ఈ గ్రామంలోని ఇండ్ల కోటేశ్వర్రావు, కుటుంబీకులు కలిసి బుధవారం రాత్రి తమ ఇంటి ముందు నిద్రించారు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. ఉంగరం చోరీ చేశారు. ఇంటి ముందు ఉంచిన మోటార్ సైకిల్‌ను తీసుకెళ్లారు. ఇదే గ్రామంలోని పిన్ని సత్యనారాయణ ఇంటిలో కూడా ఇదే రోజు రాత్రి చోరీ జరిగింది. బీరువాలో దాచిన ఎనిమిది గ్రాములున్న రెండు ఉంగరాలను దొంగలించారు. పులి నాగేశ్వర్రావు ఇంటిలో కూడా ఇదే రాత్రి చోరీ జరిగింది. బీరువాలోగల ఒక జత చెవి దిద్దులు, మాటీలు, ఉంగరం, 16 గ్రాములున్న నగలను దొంగిలించారు. అంకమ్మ గుడి బజారులో రావూరి స్వరాజ్యమ్మ గాజులను దొంలించారు. అవి మట్టి గాజులవడంతో అక్కడే వదిలేశారు. ఇదే గ్రామంలోని గోవింద్ శ్రీనివాసరావు ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. ఆయన కూతురు మెడలోని నగలను దొంగలించేందుకు ప్రయత్నించారు. ఆమె మేల్కొని కేకలు వేయడంతో పారిపోయారు. ఒకేరోజు రాత్రి ఇన్ని ఇళ్లలో దొంగలు పడడంతో గ్రామస్తులు భయభ్రాంతులవుతున్నారు. ఈ ఇళ్లను తల్లాడ ఎస్ఐ మేడా ప్రసాద్ పరిశీలించారు. ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. కేసులను ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నారు. -
పలు కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
తల్లాడ: మండలంలోని కలకొడిమ, కుర్నవల్లి గ్రామాల్లో పలు కుటుంబాలను బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం పరామర్శించారు. కలకొడిమ గ్రామానికి చెందిన నరుకుల్ల వెంకటేశ్వరరావు కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రూ.2 లక్షల చెక్కును వెంకటేశ్వరరావు భార్య బేబికు ఎమ్మెల్యే అందజేశారు. కుర్నవల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎక్కిరాల పుల్లయ్య దశదిన కర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయిలూరి సత్యనారాయణరెడ్డి, రామక్రిష్ణారెడ్డి శస్త్ర చిక్సిత చేయించుకోగా వారిని పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దూపాటి భద్రరాజు, కేతినేని చలపతి, అన్నెం కోటిరెడ్డి, గుండ్ల నాగయ్య, యల్లంకి వెంకటేశ్వర్లు, రావూరి రవిప్రసాద్, దగ్గుల శ్రీనివాసరెడ్డి, దిరిశాల నరసింహారావు, ఉప్పెర్ల రామారావు, వడ్డే నాగేశ్వరరావు, పగడాల నాగార్జునరెడ్డి, ఆదూరి శ్రీను పాల్గొన్నారు. -
వేలాది ఎకరాల్లో ఒరిగిపోయిన మొక్కజొన్న
తల్లాడ: ఆదివారం రాత్రి అకాల వర్షం, వడగండ్ల వాన, గాలి బీభత్సానికి మండలంలో సాగు చేసిన మొక్కజొన్న పైరు నేలకొరిగి పోయింది. మూడు నెలలుగా సాగు చేసిన మొక్కజొన్న పైరు కంకి వేసి కోత దశకు వచ్చింది. మండలంలో 4,490 ఎకరాల్లో మొక్కజొన్న పైరు సాగు చేశారు. మరో పది రోజుల్లో కంకులు ఎండి మిషన్‌తో కోయవచ్చని రైతులు భావించారు. ఈ నేపధ్యంలో ఆకస్మికంగా వచ్చిన వర్షం, గాలి బీభత్సానికి మొక్కజొన్న పైరు నేలకొరిగిపోయింది. మండలంలో వెయ్యి ఎకరాల్లో పంట నాశనం అయ్యింది. ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులకు నిరాశ మిగిలింది. తల్లాడ, నారాయణపురం, అన్నారుగూడెం, రెడ్డిగూడెం, ముద్దునూరు, రామానుజవరం, కుర్నవల్లి, రంగంబంజర, రేజర్ల, బాలప్పేట, పినపాక, మంగాపురం గ్రామాల్లో మొక్కజొన్న పైరు సాగు చేశారు. అకాల వర్షం ఈ ఏడాది మొక్కజొన్న పంటను రైతులను నట్టేట ముంచింది. మామిడి, మిర్చి రైతులకూ నష్టం.. గాలివానకు మండలంలోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కోసి కల్లాల్లో ఉంచిన మిర్చి కూడా కొన్ని చోట్ల తడిచిపోయింది. ఎండబెట్టిన మిరపకాయలు చెల్లా చెదురయ్యాయి. తల్లాడలో నేలకొరిగిన మొక్కజొన్న పైరు -
రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. తల్లాడ మండలం వెంకటగిరికి చెందిన మంగయ్య (45) శనివారం తెల్లవారు జామున ట్రాక్టర్ నడుపుకుంటూ ఖమ్మం నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు... ఆ క్రమంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ట్రాక్టర్‌ను ఢీకొట్టి వెళ్లి పోయింది. డ్రైవర్ మంగయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ట్రాక్టర్‌పై ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.