ఈ పాస్ మొరాయింపు
సర్వర్ పనిచేయక బియ్యం పంపిణీలో జాప్యం
ఇక్కట్లకు గురవుతున్న రేషన్ లబ్ధిదారులు
జిల్లావ్యాప్తంగా ఇదే తీరు
తాడితోట (రాజమహేంద్రవరం) :
ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ కోసం ప్రవేశపెట్టిన పీఓఎస్ (ఫాయింట్ ఆఫ్ సేల్) మెషీన్లు మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ ఎప్పుడు పనిచేస్తుందోనని డీలర్లు, లబ్ధిదారులకు ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూపులు తప్పడంలేదు. ప్రతినెలా రేషన్‌కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పాస్ విధానంలో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని ఈనెల నుంచి ఏపీ ఆన్లైన్ నెట్వర్క నుంచి జాతీయ విజ్ఞాన కేంద్రానికి (ఎన్.ఐ.సి.)కి మార్పు చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 2,660కి పైగా రేషన్‌షాపులలో పీఓఎస్ మెషీన్లు పనిచేయడంలేదు. లబ్ధిదారుడు వేలిముద్ర స్వీకరించిన అనంతరం నో స్టాక్ అని వస్తోంది. దీంతో డీలర్లు రేషన్ సరుకులు ఇవ్వలేకపోతున్నారు. 5వ తేదీ వచ్చినప్పటికి జిల్లావ్యాప్తంగా 75 శాతం కూడా రేషన్ పంపిణీ జరగలేదని డీలర్లు అంటున్నారు.
సరుకుల కోసం నిరీక్షణ
రాజమహేంద్రవరం, కాకినాడ, గొల్లప్రోలు, పెద్దాపురం, రామచంద్రపురం, తదితర ప్రాంతాలలో మెషీన్లు పని చేయడంలేదు. కొన్నిచోట్ల సర్వర్ బాగా పనిచేసినప్పటికీ చాలాచోట్ల గంటకు ఒక కార్డు చొప్పున అవుతోంది. మరికొన్నిచోట్ల నోస్టాక్ అంటూ చూపిస్తుండడంతో డీలర్లు అవాక్కవుతున్నారు. దీంతో రేషన్‌బియ్యం కోసం లబ్ధిదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వస్తోంది. నాలుగురోజులుగా సర్వర్ పనిచేయకపోవడంతో కూలిపనులు సైతం మానుకుని రేషన్‌కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవరం వరకూ రేషన్ ఇచ్చేది లేదని కొందరు డీలర్లు చెబుతున్నారు. రేషన్ కోసం కూలిపనులు మానుకొని వచ్చిన వారికి నిరాశే మిగులుతోంది. దీనిపై వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.