thotapally reservior
-
సాగునీటి పంపిణీలో మాటలు తప్ప చేతలు లేవు..!
సాక్షి, తెర్లాం(శ్రీకాకుళం): సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు పిల్ల కాలువను మాత్రం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. పిల్ల కాలువలు మంజూరయ్యాయని, వాటిని తవ్వేందుకు రైతుల నుంచి భూములు సేకరిస్తున్నామని అధికారులు పదేపదే చెప్పడమే మిగులుతుందే తప్ప ఇప్పటివరకు పిల్ల కాలువల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో వేలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారుతున్నాయి’. ఇదీ పరిస్థితి.. నియోజకవర్గంలోని తెర్లాం, బాడంగి, బొబ్బిలి మండలాలను కలుపుతూ తోటపల్లి ప్రధాన కుడికాలువను నిర్మించారు. ఈ కాలువ కింద సుమారు 30 వేల ఎకరాల వరకు మూడు మండలాలకు చెందిన భూములు ఉన్నాయి. వీటిలో తెర్లాం మండలంలోని తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద 10 వేల ఎకరాల భూములు ఉండగా, కేవలం మూడు పిల్ల కాలువల ద్వారా 4 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. మిగిలిన భూములకు చుక్క సాగునీరు కూడా అందడం లేదని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అంతంతమాత్రంగా పిల్ల కాలువల నిర్మాణం... నియోజకవర్గంలోని బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల మీదుగా వెళ్తున్న తోటపల్లి ప్రధాన కుడి కాలువకు సంబంధించి బొబ్బిలి, బాడంగి మండలాలకు సంబంధించి ఇంతవరకు పిల్ల కాలువలను ఏర్పాటు చేయలేదు. తెర్లాం మండలంలో 27 కిలో మీటర్ల పరిధిలో తోటపల్లి ప్రధాన కుడికాలువ ఉండగా కేవలం మూడు పిల్లకాలువలను ఏర్పాటు చేసి, 4వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. తమ పొలాల మీదుగా, గ్రామాల మీదుగా తోటపల్లి ప్రధాన కుడికాలువ ఉన్నా తమకు ఎటువంటి ప్రయోజనం లేకపోతుందని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాటలు తప్ప చేతల్లేవ్.. తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు పిల్ల కాలువలు ఏర్పాటు చేస్తామని సంబంధిత అధికారులు పదేపదే ప్రకటిస్తున్నా, అది కార్యరూపం దాల్చడంలేదు. బొబ్బిలి, తెర్లాం మండలాల్లో కొత్తగా పిల్ల కాలువల ఏర్పాటుకు అవసరమైన భూములు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఎటువంటి ఫలితం లేదని రైతులు అంటున్నారు. ఇబ్బంది పడుతున్నాం.. తమ గ్రామం మీదుగా తోటపల్లి ప్రధాన కుడికాలువ వెళ్తోంది. మా గ్రామానికి పక్క గ్రామం వరకు పిల్ల కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. మా గ్రామానికి చుక్క నీరు కూడా రావడంలేదు. దీంతో తమ భూములన్నీ బీడు భూములుగా మారుతున్నాయి. పిల్ల కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. –జమ్మల పెంటయ్య, రైతు, సతివాడ, తెర్లాం మండలం. అధికారుల దృష్టికి తీసుకువెళతా.. తోటపల్లి ప్రధాన కుడి కాలువ నుంచి పిల్ల కాలువల ఏర్పాటుకు భూసేకరణ చేయాల్సి ఉంది. తోటపల్లి ఫేజ్–1కు సంబంధించి పిల్ల కాలువలు ఎక్కడెక్కడ ప్రతిపాదనలు చేశారో తెలియదు. ఫేజ్–2కు సంబంధించి పిల్ల కాలువ నిర్మాణ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతా. – దొర, తోటపల్లి ప్రాజెక్టు ఫేజ్–2 ఏఈ, తెర్లాం. -
రగడ మొదలైంది
కరీంనగర్ : తోటపల్లి రిజర్వాయర్ రద్దుపై రగడ మొదలైంది. రోజుకో మలుపు తిరుగుతూ అధికార పక్షానికి, విపక్ష పార్టీలకు మధ్య సవాల్‌గా మారింది. భూనిర్వాసితుల పోరాట సమితి తన కార్యాచరణను ప్రకటించడంతో మరింత వేడి రాజుకుంది. గత నెలరోజులుగా అధికార పక్షానికి, విపక్షానికి రిజర్వాయర్‌పై మాటల యుద్ధం కొనసాగుతోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇదే అదునుగా భావించి రిజర్వాయర్ పరిధిలోని మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాల రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇటీవలనే ఆ పార్టీ ఆధ్వర్యంలో తోటపల్లి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన స్థలంలో రాస్తారోకో నిర్వహించి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులకు పిండప్రదానం చేసింది. తోట పల్లిని రద్దు చేసి సిద్దిపేట నియోజకవర్గంలోని తడకపల్లి రిజర్వాయర్‌కు నీరు తీసుకపోయే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్, హరీష్‌రావు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంలతో పాటు వివిధ ప్రజా సంఘాలు మండిపడుతున్నారుు. టీడీపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తోటపల్లి రద్దుపై సోమవా రం గాగిల్లాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో సైతం ఇటీవలనే మండలాల వారీగా సమావేశాలు నిర్వహించారు. హు స్నాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పా దయాత్ర ద్వారా హైదరాబాద్‌కు చేరుకొని సీఎం ఇంటి ని ముట్టడించాలని నిర్ణరుుంచారు. కాంగ్రెస్ పార్టీ ఈనెల 5లోపు ప్రభుత్వం నుంచి తోటపల్లి రిజర్వాయర్‌పై స్పష్టమైన ప్రకటన రాకుంటే 12న రాజీవ్ రహదారిని దిగ్భందించి, వంటావార్పు, నిరసన కార్యక్రమాలను చేపడుతామని ప్రకటించింది. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ ఈ నెల 8న హుస్నాబాద్ నియోజకవర్గం లో పర్యటించిన సందర్భంగా తోటపల్లి రిజర్వాయర్ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వాయర్‌ను తా ము రద్దు చేయడం లేదని, ఆ పని ఇంజనీరింగ్ నిపుణులది ఆయన పేర్కొన్నారు. సీఎం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం పేర్కొన్నారు. నేడు రాజీవ్ రహదారి దిగ్బంధం, వంటావార్పు తోటపల్లి రిజర్వాయర్ రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ స్టేజీ వద్ద బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఆందోళన చేపట్టనున్నా రు. రాజీవ్ రహదారి దిగ్భంధం, వంటావార్పు చేపట్టనున్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, బొమ్మ వెంకన్నతో పా టు కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సీ నియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధు లు సమావేశమై నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేసేం దుకు వ్యూహరచన చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం సాయంత్రం గాగిల్లాపూర్ గ్రామాన్ని సందర్శించి దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించింది. పీసీసీ చీఫ్ రాక టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తోటపల్లి రిజర్వాయర్ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు రానున్నారు. డీసీసీ అధ్యక్షులు కటుకం మృత్యుంజయం, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, భూనిర్వాసితుల పోరాట సమితి కమిటీ కన్వీనర్ కేడెం లింగమూర్తితో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జయప్రదం చేయండి : కటుకం మృత్యుంజయం రాజీవ్హ్రదారి దిగ్భంధం, వంటావార్పు కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, ముంపు గ్రామాల నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొని టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కలి గించేలా జయప్రదం చేయాలని డీసీసీ అధ్యక్షులు కటుకం మృత్యుంజయం పిలుపునిచ్చారు. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని అన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసి తడకపల్లిలో ప్రాజెక్టు నిర్మించి సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు నీళ్లను దొంగలించే ప్రయత్నం చేస్తున్నాడని, దీనిని అడ్డుకొని తీరుతామని అన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ పోలీసులు అతిగా ప్రవర్తించడం మానుకోవాలన్నారు. అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు : పొన్నం రాజీవ్ రహదారి దిగ్బంధనానికి పోలీసులు అటంకం కలిగించవద్దని, ప్రజాస్వామ్య ప్రక్రియలో నిరసన ఒక భాగామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. శాంతియుతంగా జరిగే ఆందోళన కార్యక్రమానికి విఘాతం కలిగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. -
తోటపల్లి ఇక లేనట్లే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కమాన్‌చౌరస్తా : సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఎట్లా ఉన్నప్పటికీ తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని రద్దు చేయాలని అధికారపక్షం నేతలు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. దీనిపై విపక్షాల నుంచి వచ్చే వ్యతిరేకతను అధిగమించేందుకే సీఎం కేసీఆర్ ఇంజనీరింగ్ నిపుణులపైకి మళ్లించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ) ఇంజనీరింగ్ అధికారులకు నెల రోజుల క్రితమే తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం అవసరాలపై నివేదిక పంపాలని ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు అధ్యయనం చేసిన సీడీఓ అధికారులు తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఈ రిజర్వాయర్‌తో పనిలేకుండానే ప్రత్యామ్నాయ కాలువల ద్వారా నిర్దేశించిన 49 వేల ఎకరాలకు నీరందించవచ్చని సూచించారు. దీనివల్ల దాదాపు రూ.వెయ్యి కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని, పైగా ముంపు గ్రామాల బెడద కూడా ఉండబోదని అభిప్రాయపడ్డారు. తాజాగా మంగళవారం సాయంత్రం రాష్ట్రస్థాయి ఉన్నత కమిటీ (స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ) సీడీఓ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలిసింది. ఇక ఉత్తర్వులు రావడమే తరువాయి. తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తిగా రద్దయినట్లే...! ఇదీ తోటపల్లి కథ... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 2003లో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేసిన సమయంలో సాగునీరు లేక హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించారు. అధికారంలోకి వస్తే తోటపల్లి, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను చేపడతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 2007 సంవత్సరం సెప్టెంబర్ 9న తోటపల్లి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 49 వేల ఎకరాలకు సాగునీరిందించేందుకు రూపొందించిన ఈ రిజర్వాయర్ నీటి నిలువ సామర్థ్యం 0.950 టీఎంసీలు. రిజర్వాయర్ నిర్మాణం వల్ల చిగురుమామిడి మండలం ఒగులాపూర్ పూర్తిగా, కోహెడ మండలంలోని రాంచంద్రాపూర్, నారాయణపూర్, వరికోలు గ్రామాలు, బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ పాక్షికంగా ముంపునకు లోనవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాంతంలోని సుమారు 3600 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని భావించిన ఇప్పటి వరకు 1603 ఎకరాలకు పరిహారం కూడా అందజేశారు. ఒగులాపూర్ నుంచి గౌరవెళ్లి వరకు 13 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా దాదాపు 12 కిలోమీటర్ల మేరకు పనులను పూర్తి చేశారు. ఇక రిజర్వాయర్ నిర్మాణమే తరువాయి అనుకున్న తరుణంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణించడంతో ఆ తరువాత పనులు మందగించాయి. అనంతరం వచ్చిన పాలకులు ప్రాజెక్టును పెద్దగా పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా పనులు అటకెక్కాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కాంట్రాక్ట్‌ను రద్దుచేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. మళ్లీ టెండర్లు పిలిచి తోటపల్లి పనులు పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మూడు నెలల క్రితం ప్రకటించారు. ఆ తరువాత ఏమైందో ఏమోకానీ... తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దీనిపై అధ్యయనం చేసిన అధికారులు ఈ రిజర్వాయర్‌లో తుదకు 0.3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండే అవకాశముందని అభిప్రాయపడ్డారు. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు ద్వారా తోటపల్లి రిజర్వాయర్‌తో పనిలేకుండా 49 వేల ఎకరాల నీరివ్వవచ్చని ప్రతిపాదన రూపొందించారు. దీనివల్ల ముంపు సమస్యను నివారించవచ్చని పేర్కొన్నారు. భగ్గుమంటున్న విపక్షాలు తోటపల్లి రద్దు ప్రతిపాదనపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీసహా విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం ఇష్టం లేదని, ఆయన అభీష్టం మేరకే ఇంజనీరింగ్ నిపుణులు ప్రతిపాదనలు పంపారని విమర్శలొస్తున్నాయి. కాంగ్రెస్ హయూంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా రద్దు చేస్తుందని, దీన్ని రద్దు చేసి మెదక్ జిల్లాకు నీటిని తరలించడానికి ఎత్తుగడలు వేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజాప్రయోజనాల్లేనప్పుడు అప్పటి ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు ప్రాజెక్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిజంగా ప్రజాప్రయోజనం లేనట్లయితే తప్పుడు నివేదికలిచ్చిన అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా తోటపల్లి రిజర్వాయర్ నిలిపివేత ఆన్యాయమని, తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించేవరకు భూనిర్వాసితుల పక్షాన పోరాడుతామని, వారికి అండగా ఉంటామని వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐలతో పాటు పలు పార్టీ నేతలు వ్యక్తం చేశారు. అయోమయంలో నిర్వాసితులు తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం రద్దుతో ముంపు బాధిత గ్రామాల ప్రజలు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే సగం మందికిపైగా బాధితులకు ఎకరాకు 2.10 లక్షలు ప్రభుత్వం చెల్లించారు. తమ గ్రామం ముంపుకు గురవుతుండటంతో సహాయ, పునరావాసం కింద మెరుగైన సౌకర్యాలు అందుతాయని భావించారు. కానీ భూమికి మాత్రమే అప్పటి ధర ప్రకారం డబ్బులు చెల్లించిన ప్రభుత్వం సహాయ పునరావాస కార్యక్రమాలను నిలిపేయడంతో లబోదిబోమంటున్నారు. తోటపల్లిని రద్దు చేస్తున్న నేపథ్యంలో తమ భూమిని తిరిగి తమకు ఇవ్వాలని, లేనిపక్షంలో రిజర్వాయర్‌ను పూర్తి చేసి తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గత కొన్ని నెలలుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు ముంపు బాధితులకు మద్దతుగా విపక్షాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన కు దిగుతుండటంతో తోటపల్లి రద్దు అంశం ప్రభుత్వానికి ఇరకాటంగా మారింది. -
'రిజర్వాయర్ రద్దు చేసినట్లు ఎప్పుడూ చెప్పలేదు'
కరీంనగర్: తోటపల్లి రిజర్వాయర్ రద్దు చేసినట్లు ఎప్పుడు పేర్కొనలేదని, ఆ ప్రాజెక్టు కావాలా.. వద్దా అనేది ఇంజనీర్లు తేలుస్తారని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ శనివారం పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఆయన జిల్లాలోని హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ సమీపంలోని మహా సముద్రం గండి పూడ్చివేత పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తోటపల్లి ప్రాజెక్టు పై విశ్రాంత ఇంజనీరు సర్వే చేస్తున్నారు అని అన్నారు. అలాగే ప్రాణహిత- చేవెళ్ల తప్పుడు ప్రాజెక్టును ప్రారంభించి దాని కోసం కొందరు రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెండేళ్ల గౌరువెళ్లి గండిపల్లి ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి పూర్తి చేస్తామని సీఎం హీమీ ఇచ్చారు.