తోటపల్లి ఇక లేనట్లే! | Thotapally reservior is no more | Sakshi
Sakshi News home page

తోటపల్లి ఇక లేనట్లే!

Published Wed, Aug 12 2015 4:34 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

తోటపల్లి ఇక లేనట్లే! - Sakshi

తోటపల్లి ఇక లేనట్లే!

సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కమాన్‌చౌరస్తా :  సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఎట్లా ఉన్నప్పటికీ తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని రద్దు చేయాలని అధికారపక్షం నేతలు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. దీనిపై విపక్షాల నుంచి వచ్చే వ్యతిరేకతను అధిగమించేందుకే సీఎం కేసీఆర్ ఇంజనీరింగ్ నిపుణులపైకి మళ్లించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ) ఇంజనీరింగ్ అధికారులకు నెల రోజుల క్రితమే తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం అవసరాలపై నివేదిక పంపాలని ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు అధ్యయనం చేసిన సీడీఓ అధికారులు తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు.

ఈ రిజర్వాయర్‌తో పనిలేకుండానే ప్రత్యామ్నాయ కాలువల ద్వారా నిర్దేశించిన 49 వేల ఎకరాలకు నీరందించవచ్చని సూచించారు. దీనివల్ల దాదాపు రూ.వెయ్యి కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని, పైగా ముంపు గ్రామాల బెడద కూడా ఉండబోదని అభిప్రాయపడ్డారు. తాజాగా మంగళవారం సాయంత్రం రాష్ట్రస్థాయి ఉన్నత కమిటీ (స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ) సీడీఓ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలిసింది. ఇక ఉత్తర్వులు రావడమే తరువాయి. తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తిగా రద్దయినట్లే...!

 ఇదీ తోటపల్లి కథ...
 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 2003లో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేసిన సమయంలో సాగునీరు లేక హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించారు. అధికారంలోకి వస్తే తోటపల్లి, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను చేపడతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 2007 సంవత్సరం సెప్టెంబర్ 9న తోటపల్లి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 49 వేల ఎకరాలకు సాగునీరిందించేందుకు రూపొందించిన ఈ రిజర్వాయర్ నీటి నిలువ సామర్థ్యం 0.950 టీఎంసీలు.

రిజర్వాయర్ నిర్మాణం వల్ల చిగురుమామిడి మండలం ఒగులాపూర్ పూర్తిగా, కోహెడ మండలంలోని రాంచంద్రాపూర్, నారాయణపూర్, వరికోలు గ్రామాలు, బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ పాక్షికంగా ముంపునకు లోనవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాంతంలోని సుమారు 3600 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని భావించిన ఇప్పటి వరకు 1603 ఎకరాలకు పరిహారం కూడా అందజేశారు. ఒగులాపూర్ నుంచి గౌరవెళ్లి వరకు 13 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా దాదాపు 12 కిలోమీటర్ల మేరకు పనులను పూర్తి చేశారు.

ఇక రిజర్వాయర్ నిర్మాణమే తరువాయి అనుకున్న తరుణంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణించడంతో ఆ తరువాత పనులు మందగించాయి. అనంతరం వచ్చిన పాలకులు ప్రాజెక్టును పెద్దగా పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా పనులు అటకెక్కాయి. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కాంట్రాక్ట్‌ను రద్దుచేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. మళ్లీ టెండర్లు పిలిచి తోటపల్లి పనులు పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మూడు నెలల క్రితం ప్రకటించారు. ఆ తరువాత ఏమైందో ఏమోకానీ... తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

దీనిపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దీనిపై అధ్యయనం చేసిన అధికారులు ఈ రిజర్వాయర్‌లో తుదకు 0.3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండే అవకాశముందని అభిప్రాయపడ్డారు. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు ద్వారా తోటపల్లి రిజర్వాయర్‌తో పనిలేకుండా 49 వేల ఎకరాల నీరివ్వవచ్చని ప్రతిపాదన రూపొందించారు. దీనివల్ల ముంపు సమస్యను నివారించవచ్చని పేర్కొన్నారు.

 భగ్గుమంటున్న విపక్షాలు
 తోటపల్లి రద్దు ప్రతిపాదనపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీసహా విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం ఇష్టం లేదని, ఆయన అభీష్టం మేరకే ఇంజనీరింగ్ నిపుణులు ప్రతిపాదనలు పంపారని విమర్శలొస్తున్నాయి. కాంగ్రెస్ హయూంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా రద్దు చేస్తుందని, దీన్ని రద్దు చేసి మెదక్ జిల్లాకు నీటిని తరలించడానికి ఎత్తుగడలు వేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

ప్రజాప్రయోజనాల్లేనప్పుడు అప్పటి ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు ప్రాజెక్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిజంగా ప్రజాప్రయోజనం లేనట్లయితే తప్పుడు నివేదికలిచ్చిన అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా తోటపల్లి రిజర్వాయర్ నిలిపివేత ఆన్యాయమని, తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించేవరకు భూనిర్వాసితుల పక్షాన పోరాడుతామని, వారికి అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐలతో పాటు పలు పార్టీ నేతలు వ్యక్తం చేశారు.

 అయోమయంలో నిర్వాసితులు
 తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం రద్దుతో ముంపు బాధిత గ్రామాల ప్రజలు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే సగం మందికిపైగా బాధితులకు ఎకరాకు 2.10 లక్షలు ప్రభుత్వం చెల్లించారు. తమ గ్రామం ముంపుకు గురవుతుండటంతో సహాయ, పునరావాసం కింద మెరుగైన సౌకర్యాలు అందుతాయని భావించారు. కానీ భూమికి మాత్రమే అప్పటి ధర ప్రకారం డబ్బులు చెల్లించిన ప్రభుత్వం సహాయ పునరావాస కార్యక్రమాలను నిలిపేయడంతో లబోదిబోమంటున్నారు.

తోటపల్లిని రద్దు చేస్తున్న నేపథ్యంలో తమ భూమిని తిరిగి తమకు ఇవ్వాలని, లేనిపక్షంలో రిజర్వాయర్‌ను పూర్తి చేసి తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గత కొన్ని నెలలుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు ముంపు బాధితులకు మద్దతుగా విపక్షాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన కు దిగుతుండటంతో తోటపల్లి రద్దు అంశం ప్రభుత్వానికి ఇరకాటంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement