వేయికాళ్ల మండపం పూర్తయ్యేనా ?
టీటీడీ టెండర్లు ఆహ్వానించినా ఒక్కరూ పాల్గొనని వైనం
తాజాగా మరోసారి ఆహ్వానం
ప్రతిష్టాత్మక కట్టడానికి అడుగడుగునా అవాంతరాలు
తిరుమల : పదమూడేళ్ల పాటు వివాదాల సుడిగుండంలో నలిగిన వేయికాళ్ల మండపం పునఃనిర్మాణం పనులు అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. రూ.18 కోట్ల అంచనాలతో టీటీడీ టెండర్లు ఆహ్వానించినా ఏ ఒక్కరూ దరఖాస్తు చేయలేదు. నిర్ణీత గడువులోపే పురాతన మండపానికి పునరుజ్జీవం కల్పించాలని సంకల్పించిన టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు రెండోసారి టెండర్లకు అనుమతిచ్చారు.
వేయికాళ్ల మండపాన్ని తిరుమల ఆలయం ఎదురుగా 14వ శతాబ్దంలో నిర్మించారు. 650 ఏళ్లకు పైగా ఈ మండపం భక్తులకు ఆశ్రయం కల్పించింది. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల ఊరేగింపునకు మండపం కొంత అడ్డుగా ఉండడంతో మాస్టర్‌ప్లాన్ కింద ఈ మండపాన్ని 2003లో కూల్చివేశారు. అప్పట్లో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి బహిరంగంగా వ్యతిరేకించారు. హైకోర్టులో వ్యాజ్యాలు నడిచాయి. అనేక వివాదాల నడుమ తొలగించిన మంటపం ప్రాంతంలోనే 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పులో కొత్త రాతి మంటపాన్ని నిర్మించాలని 2009లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ పనులు పునాదికే పరిమితమయ్యాయి. ఒక దశలో మండపం అలిపిరి, శ్రీనివాసమంగాపురానికి తరలించాలని భావించారు.
సీఎం చంద్రబాబు సూచనతో కొండపైనే పునః నిర్మాణం..
చారిత్రక నేపథ్యం కలిగిన వేయికాళ్ల మండపాన్ని తిరుమలలోనే నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై గత ఏడాది మార్చి 14వ తేదీన సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండపం నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకోవటంతో మండపం పున ర్నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది.
టెండర్లకు ఒక్కరూ హాజరుకాని వైనం..
శ్రీవారి ఆలయానికి కిలోమీటరు దూరంలోని నారాయణగిరి ప్రాంతంలో వేయికాళ్ల మండపం పునః నిర్మించటం వల్ల శ్రీవారి ఉత్సవాలు, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతో పాటు భక్తుల సందర్శనకు వీలుపడుతుందని టీటీడీ ఈవో సంకల్పించారు. ఆ మేరకు అధునాతన డిజైన్ రూపొందించారు. రూ.18 కోట్ల అంచనాలతో టెండర్లను ఆహ్వానిస్తూ గత నెలలో జరిగిన ధర్మకర్తల మండలి తీర్మానించింది. అయినప్పటికీ ఒక్కరూ కూడా హాజరు కాలేదు.
టీటీడీ ఎస్ఎస్ఆర్ ధరల వల్లే రాలేదా?
ఈ మండపం పునర్నిర్మాణానికి టీటీడీ ఇంజినీర్లు ముందుగానే బాగా కసరత్తు చేశారు. నాగలాపురం ఆలయ ప్రాకారానికి అనుబంధంగా రూ.68 లక్షలతో రాతి మండపాన్ని నిర్మిస్తున్నారు. అక్కడి నిర్మాణం పనులకు తిరుమలకొండ మీద నిర్మాణ పనుల మధ్య ఉండే వ్యత్యాసం, కార్మికుల శ్రమ, ప్రయాణం, నివాస పరిస్థితులు అంచనా వేశారు. అక్కడి స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్(ఎస్ఎస్ఆర్) ధరల కంటే కొంత పెచ్చుతోనే వేయికాళ్ల మండపానికి టెండర్లు ఆహ్వానించారు. అయినా ఒక్కరూ పాల్గొనకపోవడంపై టీటీడీ ఇంజినీర్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసి బుధవారం మరోసారి టెండర్లు ఆహ్వానించారు.
నిబంధనల్లో స్వల్ప మార్పు చేశాం
పురాతన మండపానికి పునరుజ్జీవం కల్పించాలని నిర్ణయించాం. పెద్ద కట్టడాలు నిర్మించే విషయంలో టెండరుదారులు త్వరగా ముందుకు రారు. నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసి మరోసారి ఆహ్వానించాం. ఈనెల 11 ఆఖరు తేదీ. నిర్ణయించిన గడువుతోనే వేయికాలాలపాటు నిలిచే నిర్మాణం నిర్మించి తీరుతాం.
- టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు