విరాళం ఇవ్వలేదని సాంఘిక బహిష్కరణ
మెట్పల్లి రూరల్: కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్‌లో రామాలయం నిర్మాణం కోసం విరాళం ఇవ్వలేదని గ్రామ పెద్దలు మూడు కులాలను బహిష్కరించారు. ఈ బహిష్కరణ మంగళవారం నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించారు. జగ్గాసాగర్‌లో రామాలయాన్ని నిర్మించేందుకు గత వేసవిలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ), రామాలయ నిర్మాణ కమిటీలు నిర్ణయించాయి. గ్రామంలో సుమారు 5 వేల జనాభా ఉండగా, ప్రతి కుటుంబం రూ.500 చొప్పున చెల్లించాలని తీర్మానించాయి.
ఒక కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు అదే ఇంట్లో నివసించే పెళ్ళైన వ్యక్తిని మరో కుటుంబంగా పరిగణిస్తూ ఇలా అందరూ విరాళం ఇవ్వాలని హుకుం జారీ చేశాయి. గ్రామంలో మాల కుటుంబాలు 80, గూండ్ల కుటుంబాలు 100, విశ్వబ్రాహ్మణ కుటుంబాలు 40 ఉన్నాయి. వీరు కుటుంబానికి రూ.500 చొప్పున ఇవ్వలేమని, కులానికి రూ.20 వేల చొప్పున ఇస్తామని వేడుకున్నారు. దీనికి గ్రామ పెద్దలు అంగీకరించకపోగా.. ఈ మూడు కులాలను సాంఘికంగా బహిష్కరించారు.
వారికి నిత్యావసర సరుకులు అమ్మవద్దని, హోటళ్లలో చాయ్ పోయవద్దని, మంగలి వారు క్షవరం, గడ్డం గీయవద్దని ఆంక్షలు విధించారు. దీంతో బహిష్కరణకు గురైన కులస్తులు మీడియూకు సమాచారం అందించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో రాత్రి గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలను గ్రామపంచాయతీకి పిలిపించి చర్చించారు. ఈ విషయమై మెట్పల్లి ఎస్సై రాజేష్‌ను ‘సాక్షి’ సంప్రదించగా... తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, విషయం తెలిసి గ్రామానికి వెళ్లి చర్చించామని తెలిపారు.