మోడీకి మూడు సవాళ్లు
గుజరాత్ లోని వడ్ నగర్ రైల్వే స్టేషన్ లో యాభై ఏళ్ల క్రితం టీ అమ్ముకున్న వ్యక్తి ఇక కొద్ది రోజుల్లో భారత ప్రధాని కాబోతున్నారు. అయనకు భారీ మెజారిటీయే వచ్చింది. బిజెపి సొంత బలం మీదే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే స్థితిలో ఉంది. అయితే ఆయన ముందున్న మూడు అతి పెద్ద రాజకీయ సవాళ్లేమిటి?
1) సీనియర్లకు సరైన పదవులు - కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, లోకసభలో విపక్ష నేత సుష్మా స్వరాజ్ లు తొలి నుంచీ నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయన ఢిల్లీ చలో ప్రయాణానికి వీరే అసలు అడ్డంకులు. అద్వానీ బహిరంగంగా వ్యతిరేకతను చూపించగా, మిగతా ఇద్దరూ సన్నాయినొక్కులకే పరిమితమయ్యారు. వీరంతా రాజకీయంగా, వయస్సు పరంగా మోడీకి సీనియర్లు. ముఖ్యంగా అద్వానీ మోడీకి రాజకీయ గురువు. వీరికి గౌరవప్రదమైన పునరావాసం కల్పించడం మోడీ ముందున్న తక్షణ కర్తవ్యం.
2) కాంగ్రెస్ ను ఖతం చేయడం - కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే కాంగ్రెస్ రహిత భారత్ - ఇదీ నరేంద్ర మోడీ నినాదం. కాంగ్రెస్ దెబ్బతిన్నా, అది మళ్లీ పైకి లేచే అవకాశం లేకపోలేదు. అందుకే కాంగ్రెస్ ను పూర్తిగా ఖతం చేయడం మోడీ ముందున్న రెండో పెద్ద పని. కాబట్టి ఆయన వీలైనన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకు పోయే అవకాశాలున్నాయి. వెలుపలి నుంచి మద్దతు, లోపల నుంచి మద్దతు వంటి వివిధ ప్రక్రియల ద్వారా కాంగ్రెస్ కు మిత్రపక్షాలే లేకుండా చేసే అవకాశాలున్నాయి.
3) అసెంబ్లీలను దక్కించుకోవడం - హర్యానా, మహారాష్ట్ర్రలు ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు వెళ్తున్నాయి. వచ్చే ఏడాది మొదట్లోనే జార్ఖండ్, బీహార్ లలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను భారీ మెజారిటీతో గెలుచుకోవడం మోడీకి అత్యవసరం. అంతేకాదు. తనను వ్యతిరేకించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను పూర్తిగా దెబ్బతీయడం ఆయన లక్ష్యం. ఆ తరువాత 2016 లో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుని లోకసభతో పాటు రాజ్యసభ పై కూడా కబ్జా పెట్టడం, 2017 లో యూపీ ని గెలుచుకోవడం. ఆ తరువాత 2017రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు అనుకూలుడైన వ్యక్తిని గెలిపించుకోవడం మోడీ ముందు ఉన్న దీర్ఘ కాలిక లక్ష్యం.