అగ్నిప్రమాదంలో మూడు దుకాణాలు దగ్ధం
పార్వతీపురం : స్థానిక రాయగడ రోడ్డులోని రాజుగారి కోట రహదారిలో మూడు బడ్డీలు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అగ్నిప్రమాదంలో ఆహుతయ్యాయి. బాధితులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగే సోమవారం రాత్రి దుకాణదారులు షాపులు కట్టుకొని ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి రెండు గంటల సమయంలో బత్తుల శ్రీనివాసరావుకు చెందిన బడ్డీ కాలుతోందని సమాచారం రాగా.. ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపు చేసి, వెళ్లిపోయారు. అనంతరం వేకువ జామున 5 గంటలకు పక్కనున్న పాలకొండ సోనియా, కక్కుల నీలకంఠంల మరో రెండు బడ్డీలు కూడా దగ్ధమవుతున్నాయని సమాచారం రావడంతో మరలా అగ్నిమాపక సిబ్బంది వెళ్లారు. అప్పటికే దుకాణాల్లో ఉన్న వస్తువులు, నగదు కాలిబూడిదయ్యారుు. సుమారు రూ.4 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా.