రైల్లో నుంచి కన్న కూతురిని విసిరివేసిన తల్లి!
కన్న కూతురిని నడుస్తున్న రైల్లో నుంచి కిందకి విసిరివేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలో చోటు చేసుకుంది. రైల్లో నుంచి కింద పడిన పసిపాపకు ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని నైహతి రైల్వే స్టేషన్ లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
నైహతీలో రైలు వేగం అందుకోగానే తన ఒడిలోని ఒక సంవత్సరం వయస్సు ఉన్న పసిపాపను పూర్ణిమా దాస్ అనే ప్రయాణికురాలు బయటకు విసిరివేయడం తోటి ప్రయాణీకులను షాక్ గురిచేసింది. వెంటనే చైన్ లాగి పసిపాపను ప్రయాణికులు రక్షించారు. ఈ ఘటనకు పాల్పడిన మహిళను పోలీసులకు అప్పగించారు.
పసిపాపకు చికిత్స అందిస్తున్నాం. పాప పరిస్థితి విషమంగా ఉంది అని పోలీసులు తెలిపారు. తనకు ఆడపిల్ల పుట్టిందని తన భర్త కుటుంబం వేధింపులకు పాల్పడుతుండటంతో పసిపాపను వదిలించుకోవాలని అనుకున్నాను. అందుకే నేను పసిపాపను రైల్లో నుంచి బయటకు విసిరివేసాను అని తల్లి తెలిపింది. తనకు ఆడబిడ్డ పుట్టిన దగ్గర నుంచి తన అత్తింటివారు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని మహిళ వాపోయింది.