time zone
-
2024 కొత్త కొత్తగా వెల్కమ్
చూస్తూండగానే నూతన సంవత్సరం వచ్చేసింది. 2024కు గ్రాండ్‌గా వెల్కం చెప్పేందుకు అంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని దేశాల వారు కొత్త ఏడాదిని స్వాగతిస్తూ పార్టీ మూడ్‌లో ఉంటే.. మరికొన్ని దేశాల వారు ఇంకా రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూనే ఉంటారు. అంతర్జాతీయ టైమ్ జోన్ల ప్రకారం.. ప్రపంచంలో మొట్టమొదటగా న్యూజిలాండ్ సమీపంలోని కిరిబతి దీవుల వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. తర్వాత న్యూజిలాండ్, ఆ్రస్టేలియా స్వాగతం పలుకుతాయి. ఇదే సమయంలో పలు దేశాల్లో ఇంకా డిసెంబర్ 31వ తేదీనే మొదలవుతూ ఉంటుంది. మరి ఇలా ఏయే దేశాలు కొత్త సంవత్సరానికి ముందుగా వెల్కం చెప్తాయో చూద్దామా.. ► ప్రపంచంలో మొదట పసిఫిక్ మహాసముద్రంలోని దీవులైన కిరిబతిలో నూతన సంవత్సరం మొదలవుతుంది. మన దేశంలో డిసెంబర్ 31న మధ్యాహ్నం 3.30 గంటలు అవుతున్న సమయంలోనే.. కిరిబతిలో అర్ధరాత్రి 12.00 గంటలు దాటేసి జనవరి 1 మొదలైపోయింది. మన దేశ సమయంతో పోల్చి చూస్తే, కొన్ని దేశాల్లో ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుందంటే.. ►న్యూజిలాండ్.. మనకు సాయంత్రం 4.30 ►ఆ్రస్టేలియా.. మనకు సాయంత్రం 6.30 ►జపాన్, దక్షిణ కొరియా.. మనకు రాత్రి 8.30 ►చైనా, మలేషియా, సింగపూర్.. మనకు రాత్రి 9.30 ►థాయిలాండ్, వియత్నాం.. మనకు రాత్రి 10.30 ►యూఏఈ, ఒమన్.. మనకు జనవరి 1 వేకువజాము1.30 ► గ్రీస్, దక్షిణాఫ్రికా, ఈజిప్‌్ట.. మనకు వేకువజామున 3.30 ►జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మొరాకో, కాంగో.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 4.30 ►యూకే, ఐర్లాండ్, పోర్చుగల్.. మనకు వేకువన 5.30 ►బ్రెజిల్, అర్జెంటీనా.. మనకు జనవరి 1 ఉదయం 8.30 ►ప్యూర్టోరికో, బెర్ముడా, వెనెజువెలా.. మనకు జనవరి 1 ఉదయం 9.30 ►అమెరికా తూర్పుతీర రాష్ట్రాలు, పెరూ, క్యూబా.. మనకు జనవరి 1 ఉదయం 10.30 ►మెక్సికో, కెనడా, అమెరికా మధ్య రాష్ట్రాలు.. మనకు జనవరి 1 ఉదయం 11.30 ►అమెరికా దక్షిణ తీర రాష్ట్రాలు (లాస్ ఎంజిలిస్, శాన్ఫ్రాన్సిస్కో..).. మనకు జనవరి 1 మధ్యాహ్నం 1.30 ►హవాయ్.. మనకు 1న మధ్యాహ్నం ఉదయం 3.30 ►సమోవా దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 4.30 ►బేకర్, హౌలాండ్ దీవులు.. మనకు 1న సాయంత్రం 5.30 సమీపంలోనే ఉన్నా.. ఓ రోజు లేటు.. వివిధ దేశాలు చాలా విస్తీర్ణంలో ఉన్నా.. ఏదో ఒక సమయాన్ని మొత్తం దేశానికి పాటిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దేశాల్లో ఒక చివరన ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక కొన్ని గంటల తర్వాతగానీ మరో చివరన ఉన్న ప్రాంతాల్లో తెల్లవారదు. ఇలా వివిధ దేశాల ఆదీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయా దేశాల సమయాన్నే పాటించే క్రమంలో.. సమీపంలోనే ఉన్న ప్రాంతాల్లో కూడా వేర్వేరు తేదీలు, సమయం ఉంటుంటాయి కూడా. ►దీనివల్ల పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉండే అంతర్జాతీయ డేట్లైన్ కూడా మెలికలు తిరిగి ఉంటుంది. ►మామూలుగా అయితే.. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందే రోజు మారిపోయే కిరిబతి దీవులకన్నా రెండు గంటలు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో అదే తేదీ, రోజు ఉండాలి. కానీ అమెరికా అధీనంలో ఉన్న ఈ దీవుల్లో ఆ దేశ సమయాన్ని పాటిస్తారు కాబట్టి.. అవి మొత్తంగా ఒక రోజు వెనకాల ఉంటాయి. ►ఉదాహరణకు కిరిబతిలో సోమవారం ఉదయం 8 గంటలు అవుతుంటే.. దానికన్నా రెండు గంటల తర్వాత సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో మాత్రం ఆదివారం ఉదయం 6 గంటల సమయమే ఉంటుంది. ►ఈ కారణంతోనే ప్రపంచంలో అన్ని ప్రాంతాలకన్నా చివరిగా.. ఈ దీవుల్లో కొత్త సంవత్సరం మొదలవుతుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఉభయ కొరియాల్లో ఒక్కటే టైం
సియోల్: ఉత్తరకొరియా తన ప్రామాణిక సమయాన్ని 30 నిమిషాలు ముందుకు జరిపింది. దీంతో ఉభయ కొరియాల మధ్య శుక్రవారం నుంచి ఒకే టైం అమల్లోకి వచ్చినట్లయింది. గత వారం ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల తరువాత సమయంలో మార్పు చేయడం కీలక ముందడుగు అని ఉ.కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది. ఉభయ కొరియాల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన సరిహద్దు గ్రామంలోని గడియారాల్లో వేర్వేరు సమయాలను చూసిన ఉ.కొరియా అధినేత కిమ్ వాటిని ఒకటి చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జారీచేసిన ఉత్తర్వులకు ఉ.కొరియా పార్లమెంట్ సోమవారమే ఆమోదం తెలిపింది. ఉ.కొరియా నిర్ణయాన్ని ద.కొరియా స్వాగతించింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది. -
ఆ దేశాల మధ్య ‘కలిసిన కాలం’
సాక్షి, సియోల్ : కాలం కలసి రావడం అంటే ఇదేనేమో! ఆగర్భ శత్రు దేశాలైన ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్, మూన్ఝా ఇన్లు రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం మొన్న చేతులు కలపగా, ఆ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా నేడు మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య అరగంట సమయం తేడా ఉంది. దక్షిణ కొరియా కన్నా ఉత్తర కొరియా గడియారం అరగంట ఆలస్యం. ఈ తేడాను వచ్చే మే ఐదవ తేదీ నుంచి సవరిస్తామని, తమ సమయాన్ని 30 నిమిషాలపాటు వెనకకు జరుపుకుంటామని కిమ్ జాంగ్ ఉన్ ఇప్పటికే హామీ ఇవ్వగా అందుకు ప్రతిగా తమ దేశ ప్రచార ఆర్భాటం కోసం ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన భారీ మైకులను తొలగించి వేస్తున్నామని మూన్ఝా ఇన్ సోమవారం నాడు ప్రకటించారు. గ్రీన్విచ్ సమయం కాన్న తొమ్మిది గంటలు ముందు దక్షిణ కొరియా సమయం ఉంటుంది. మొదటి నుంచి జపాన్‌ది దక్షిణ కొరియాది ఒకే టైమ్‌జోన్. జపాన్ దేశం నుంచి విముక్తి పొందిన 70 వార్షికోత్సవం సందర్భంగా అంటే 2015లోనే ఉత్తరకొరియా తన టైమ్ జోన్‌ను మార్చుకుంది. మళ్లీ పాత సమయానికి రానుంది. ఇరుదేశాధినేతల మధ్య శుక్రవారం జరిగిన శిఖరాగ్ర సమావేశాల సందర్భంగానే దక్షిణ కొరియా, ఉత్తరకొరియా సరిహద్దుల్లోనే తన మైకులను ఆఫ్ చేయగా, మంగళవారం నుంచి వాటిని పూర్తిగా ఎత్తువేస్తున్నామని ఇవాళ ప్రకటించింది. -
'జెట్ లాగ్'కు ఫ్లాష్ లైట్ థెరపీ...
సుదీర్ఘ ప్రయాణం అంటే భయం వేస్తోందా? జెట్ లాగ్ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? కొత్త టైమ్ జోన్ లో అలవాటు పడటానికి ఇబ్బందులు పడుతున్నారా? అటువంటి వారికి ఫ్లాష్ లైట్ చికిత్స ఎంతో సహాయ పడుతుందంటున్నారు పరిశీలకులు. ఈ కొత్త టెక్నిక్... టైమ్ జోన్ మారినా నిద్ర లేవడంలో రీఫ్రెష్ ఫీలింగ్ తెస్తుందంటున్నారు. ప్రయాణానికి ముందు నిద్రపోయే సమయంలో ఫ్లాష్ లైట్ థెరపీ చేయడం జెట్ లాగ్ ను అధిగమించేందుకు ఉత్తమ మాగ్గమని చెప్తున్నారు. ప్రయాణానికి ముందు రాత్రి నిద్రించే సమయంలో ఫ్లాష్ లైట్ల వెలుగులో నిద్రిస్తే మంచిదంటున్నారు. ఫ్లాష్ లైట్ థెరపీ శరీరంలో అలవాటు పడ్డ సమయాన్ని సరి చేస్తుందని తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకునే ముందు కొత్త టైమ్ జోన్ కు అలవాటు పడాలంటే ఫ్లాష్ లైట్ థెరపీతో అధిక ప్రయోజనం ఉంటుందంటున్నారు. కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు శరీరం అక్కడి పరిస్థితులకు, సమయానికి అలవాటు పడేవరకూ జెట్ లాగ్ ఇబ్బంది పెడుతుంటుంది. దీంతో అరుగుదల తగ్గి కడుపులో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే విషయాలపట్ల ఏకాగ్రత తగ్గడం, అలసటగా ఉండి.. విసుగు చెందడం వంటి అనేక సమస్యలు కూడ వస్తుంటాయి. కొన్ని గంటలపాటు పగటిపూట ప్రకాశవంతమైన లైట్ దగ్గర కూర్చొని లైట్ థెరపీ చికిత్స తీసుకోవడం జెట్ లాగ్ లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని ఇంతకు ముందు తెలిసినదే. అయితే నిద్ర సమయంలో ఫ్లాష్ లైట్ థెరపీ జెట్ లాగ్ సమస్యకు అత్యంత ఉపయోగపడుతుందని నూతన పరిశోధనలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న ఇతర పద్ధతులకన్నా ఈ తాజా పరిశోధనలు తక్కువ సమయంలో జెట్ లాగ్ నుంచి ఉపశమనం కలిగిస్తాయని అమెరికా స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ కు చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ జామీ జెట్జర్ చెప్తున్నారు. కళ్ళు మూసుకొని పడుకొని ఉన్పపుడు రెటీనా పై పడే ఫ్లాష్ లైట్... సంకేతాల ద్వారా... మెదడులోని రోజువారీ వ్యవస్థను సరిచేస్తుందని ఆయన చెప్తున్నారు. రెండువారాల పాటు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయి, లేచేట్టు సుమారు 19 నుంచి 39 ఏళ్ళ మధ్య వయస్కులపై పరిశోధనలు జరిపారు. అలాగే నిద్రపోయే సమయంలో ఫ్లాష్ లైట్, లేదా పూర్తిగా లైట్ ను ప్రయోగించి చూశారు. పూర్తిగా ప్రకాశవంతమైన లైట్ కేవలం 36 నిమిషాల తేడాను మాత్రమే చూపించగా... ఫ్లాష్ లైట్ తో ఎక్కువ ప్రయోజనం కలిగినట్లు గుర్తించగలిగారు. అందుకే సుమారు 2000 మైళ్ళకు మించి ప్రయాణం చేయాలనుకున్నవారు ముందురోజు రాత్రి టైమ్ జోన్ మార్పులకు అలవాటు పడేందుకు ఫ్లాష్ లైట్ థెరపీని చేయాలని జెట్జర్ సూచిస్తున్నారు. అంతేకాక ఫ్లాష్ లైట్ వల్ల నిద్ర పట్టదు అన్న అపోహ ఎంతోమందికి ఉంటుందని, అది నిజం కాదని... ఆయన చెప్తున్నారు. ఈ థెరపీ నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారికి, లారీ డ్రైవర్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు ఓ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ జర్నల్ లో ప్రచురించారు.