'జెట్ లాగ్'కు ఫ్లాష్ లైట్ థెరపీ...
సుదీర్ఘ ప్రయాణం అంటే భయం వేస్తోందా? జెట్ లాగ్ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? కొత్త టైమ్ జోన్ లో అలవాటు పడటానికి ఇబ్బందులు పడుతున్నారా? అటువంటి వారికి ఫ్లాష్ లైట్ చికిత్స ఎంతో సహాయ పడుతుందంటున్నారు పరిశీలకులు. ఈ కొత్త టెక్నిక్... టైమ్ జోన్ మారినా నిద్ర లేవడంలో రీఫ్రెష్ ఫీలింగ్ తెస్తుందంటున్నారు. ప్రయాణానికి ముందు నిద్రపోయే సమయంలో ఫ్లాష్ లైట్ థెరపీ చేయడం జెట్ లాగ్ ను అధిగమించేందుకు ఉత్తమ మాగ్గమని చెప్తున్నారు.
ప్రయాణానికి ముందు రాత్రి నిద్రించే సమయంలో ఫ్లాష్ లైట్ల వెలుగులో నిద్రిస్తే మంచిదంటున్నారు. ఫ్లాష్ లైట్ థెరపీ శరీరంలో అలవాటు పడ్డ సమయాన్ని సరి చేస్తుందని తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకునే ముందు కొత్త టైమ్ జోన్ కు అలవాటు పడాలంటే ఫ్లాష్ లైట్ థెరపీతో అధిక ప్రయోజనం ఉంటుందంటున్నారు. కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు శరీరం అక్కడి పరిస్థితులకు, సమయానికి అలవాటు పడేవరకూ జెట్ లాగ్ ఇబ్బంది పెడుతుంటుంది. దీంతో అరుగుదల తగ్గి కడుపులో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే విషయాలపట్ల ఏకాగ్రత తగ్గడం, అలసటగా ఉండి.. విసుగు చెందడం వంటి అనేక సమస్యలు కూడ వస్తుంటాయి. కొన్ని గంటలపాటు పగటిపూట ప్రకాశవంతమైన లైట్ దగ్గర కూర్చొని లైట్ థెరపీ చికిత్స తీసుకోవడం జెట్ లాగ్ లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని ఇంతకు ముందు తెలిసినదే. అయితే నిద్ర సమయంలో ఫ్లాష్ లైట్ థెరపీ జెట్ లాగ్ సమస్యకు అత్యంత ఉపయోగపడుతుందని నూతన పరిశోధనలు చెప్తున్నాయి.
ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న ఇతర పద్ధతులకన్నా ఈ తాజా పరిశోధనలు తక్కువ సమయంలో జెట్ లాగ్ నుంచి ఉపశమనం కలిగిస్తాయని అమెరికా స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ కు చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ జామీ జెట్జర్ చెప్తున్నారు. కళ్ళు మూసుకొని పడుకొని ఉన్పపుడు రెటీనా పై పడే ఫ్లాష్ లైట్... సంకేతాల ద్వారా... మెదడులోని రోజువారీ వ్యవస్థను సరిచేస్తుందని ఆయన చెప్తున్నారు. రెండువారాల పాటు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయి, లేచేట్టు సుమారు 19 నుంచి 39 ఏళ్ళ మధ్య వయస్కులపై పరిశోధనలు జరిపారు. అలాగే నిద్రపోయే సమయంలో ఫ్లాష్ లైట్, లేదా పూర్తిగా లైట్ ను ప్రయోగించి చూశారు. పూర్తిగా ప్రకాశవంతమైన లైట్ కేవలం 36 నిమిషాల తేడాను మాత్రమే చూపించగా... ఫ్లాష్ లైట్ తో ఎక్కువ ప్రయోజనం కలిగినట్లు గుర్తించగలిగారు.
అందుకే సుమారు 2000 మైళ్ళకు మించి ప్రయాణం చేయాలనుకున్నవారు ముందురోజు రాత్రి టైమ్ జోన్ మార్పులకు అలవాటు పడేందుకు ఫ్లాష్ లైట్ థెరపీని చేయాలని జెట్జర్ సూచిస్తున్నారు. అంతేకాక ఫ్లాష్ లైట్ వల్ల నిద్ర పట్టదు అన్న అపోహ ఎంతోమందికి ఉంటుందని, అది నిజం కాదని... ఆయన చెప్తున్నారు. ఈ థెరపీ నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారికి, లారీ డ్రైవర్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు ఓ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ జర్నల్ లో ప్రచురించారు.