తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుమల : శ్రావణమాసం సందర్భంగా తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటినుంచి వరుసగా మూడురోజులపాటు కన్నుల పండవగా ఉత్సవాలు సాగనున్నాయి. తెలిసో తెలియకో భక్తులు, సిబ్బంది ద్వారా ఆలయంలో జరిగే తప్పులను శుద్ధి చేసే పవిత్ర కార్యక్రమమే పవిత్రోత్సవం. ప్రతి యేడు శ్రావణ మాసంలో ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలు శనివారం ఉదయం అత్యంత ఘనంగాప్రారంభమైయ్యాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో, ప్రత్యేకాధికారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను మూడురోజుల పాటు టీటీడీ రద్దు చేసింది. ఈ ఉత్సవాలకు సంబంధించి శుక్రవారం సాయంత్రం అంకురారోపణ కార్యక్రమం జరిగింది. ఉత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని పూలతో అలంకరించారు. తొలిరోజైన శ్రీవారి ఆలయంలోని యాగశాలలో ఉదయం 7గంటలకు హోమాన్ని నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేశారు. అనంతరం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
రెండో రోజు మధ్యాహ్నం 12-2గంటల మధ్య పవిత్రాల ఊరేగింపు, మూలవరులకు, ఉత్సవరులకు పవిత్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. చివరిరోజు పూర్ణాహుతి, హోమంతో ఈ ఉత్సవాలు సమాప్తమవుతాయి.పవిత్రోత్సవాల నేపథ్యంలో 17నుంచి 19వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణసేవలను రద్దు చేశారు. ఈ నాలుగు రోజులు పాటు తోమాల, అర్చన సేవలను స్వామివారికి ఏకాంతంగా నిర్వహిస్తారు.
మరోవైపు తిరుమలలో భక్తులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఏడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.