‘గంగ’ నీటిని అందించాలి
బ్రాంచి కాలువల పనులను పూర్తిచేయాలి
ఎంపీ వరప్రసాద్‌రావుకు సీపీఐ నేతల వినతి
సూళ్లూరుపేట: జిల్లాలో కరువు పరిస్థితుల నేపధ్యంలో అసంపూర్తిగా ఉన్న తెలుగు గంగ బ్రాంచి కాలువలను పూర్తి చేయించి గంగనీటిని అందించాలని సీపీఐ పార్టీ జిల్లా, నియోజకవర్గం నాయకులు తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్రావును కోరారు. మంగళవారం ఆయనను ఎంపీ కార్యాలయంలో కలసి పరిస్థితులను వివరిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు. మండలంలోని దామానెల్లూరు పంచాయతీ పరిధిలో రామచంద్రగుంటవద్ద ఉగ్గుమూడి అటవీప్రాంతంలో సుమారు 800 మీటర్లు బ్రాంచికాలువను తవ్వకుండా అపేయడంతో గంగనీళ్లు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని వివరించారు. దీన్ని పూర్తి చేస్తే దామానెల్లూరు, రామచంద్రగుంట, మంగానెల్లూరు చెరువులకు నీళ్లు చేరి సుమారు 2 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని చెప్పారు. దీనిపై వెంటనే ఎంపీ స్పందించి తెలుగుగంగ ఇంజినీర్‌కు ఫోన్ చేసి ఉగ్గుమూడి అటవీ ప్రాంతంలో ఆసంపూర్తిగా ఆగిపోయిన బ్రాంచి కాలువ గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే దాన్ని పూర్తి చేసి రైతులు ప్రయోజనాలనను కాపాడాలని కోరారు. వెంటనే తన లెటర్‌పాడ్‌పై లేఖరాసి వారికిచ్చి గంగ ఇంజినీర్ కలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు వంకా రామాంజనేయులు, పోకల దుష్యంతయ్య, గోపాలకృష్ణయ్య, సీపీఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటి పరిధిలోని 22వ వార్డులో సాయిబాబా గుడి వీధిలో రూ.3 లక్షలు ఎంపీ నిధులతో మంజూరైన మురుగునీటి కాలువ నిర్మాణానికి ఎంపీ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ నూలేటి విజయలక్ష్మీ, వార్డు కౌన్సిలర్ పోలూరు అమరావతి, ఆ వార్డులోని మహిళలు పాల్గొన్నారు.