టాప్ లష్కరే టెర్రరిస్ట్ కలకలం
శ్రీనగర్: ఆందోళనలతో అట్టుడుకుతున్న కశ్మీర్ లో మరో కలకలం చెలరేగింది. లష్కరే తోయిబా ముఖ్య నాయకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబూ దుజాన్ బహిరంగ ప్రదేశంలో కనిపించాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆదివారం పుల్వామా జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో కశ్మీరీ యువకులతోపాటు కలిసి నడుస్తూ అబూ దుజాన్ వీడియోలకు చిక్కినట్లు తెలిసింది. నిఘావర్గాలు కూడా అబూ ఉనికిని నిర్ధారించారు. హిజబుల్ ఉగ్రవాది బుర్హాన్ వని అంత్యక్రియలకు కూడా అబూ హాజరైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా అతనికి సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో కశ్మీర్ లోయలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మరినట్లయింది.
లష్కరేకు కశ్మీర్ చీఫ్ గా వ్యవహరిస్తూ, గడిచిన కొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉంటోన్న అబూ దుజాన్ బహిరంగ ర్యాలీల్లో కనిపించడం వెనుక పెద్ద కుట్రే దాగుందని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న పాకిస్థాన్.. ఇక్కడి యువకులను తనవైపునకు తిప్పుకునేందుకు అబూ దుజాన్ లాంటి పెద్ద నాయకులను రంగంలోకి దింపింది. నేరుగా యువకలో మాట్లాడి, వారిని ప్రభావితం చేయగలితే ఉగ్రవాదాన్ని మరింత విస్తరించవచ్చన్నది అబూ దుజాన్ వ్యూహంగా కనిపిస్తున్నట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి. బుర్హాన్ అంత్యక్రియలు సైతం లష్కరేకే చెందిన ఆమిర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో జరగడం గమనార్హం.
రాజ్ నాథ్ పాక్ పర్యటనపై హెచ్చరికలు
కశ్మీర్ అంశంలో పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా ఉగ్రనాయకులు హఫీజ్ సయీద్(జమాత్ ఉల్ దవా), సయీద్ సలాహుద్దీన్(హిజబుల్ ముజాహిద్దీన్)లు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టారు. భారీ ర్యాలీలు, ఇస్లామాబాద్ లో భారత హైకమిషనర్ కార్యాలయం ముట్టడి తదితర ఆందోళనలు నిర్వహించినవారు.. తాజాగా భారత్ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పర్యటనను వ్యతిరేకిస్తూ అక్కడి ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. ఆదివారం జరిగిన ర్యాలీల్లో ప్రసంగించిన హఫీజ్, సలాహుద్దీన్ లు 'రాజ్ నాథ్ సింగ్ ను పాకిస్థాన్ లో అగుడు పెట్టనివ్వొద్దు' అని ప్రభుత్వాన్ని కోరారు. సైనిక బలంతో అమాయక కశ్మీరీలను చంపుతోన్న భారత్ తో ఎలాంటి చర్చలు వద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇటు పాక్ ప్రభుత్వం రాజ్ నాథ్ పర్యటనపై ప్రకటన చేసింది. 'ఆయన(రాజ్ నాథ్) సార్క్ సమావేశాల్లో పాల్గొని వెళ్లిపోతారు. భారత్- పాక్ ల మధ్య దైపాక్షిక చర్చలేవీ ఉండబోవు' అని ఆదివారం ఇస్లామాబాద్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఆగస్టు రెండో వారంలో జరగనున్న సార్క్ సమావేశాల్లో వీలైనన్ని మార్గాల్లో పాక్ తీరును ఎండగట్టేందుకు భారత్ సిద్ధపడుతోంది. పఠాన్ కోట్ దర్యాప్తు మొదలు కశ్మీర్ ఆందోళనలు, బుర్హాన్ వనిలపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలను ఎండగట్టేందుకు రాజ్ నాథ్ ప్రయత్నిస్తారని తెలుస్తోంది.