Tourist attractions
-
పర్యాటకుల ఆకర్షణలో ఆగ్రాను అధిగమించిన అయోధ్య
ఇప్పటివరకు పర్యాటకుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను ఆయోధ్య రామ మందిరం వెనక్కి నెట్టి, మొదటి స్థానంలోకి వచ్చిoది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన నగరంగా ఆయోధ్య రికార్డులకు ఎక్కింది. ఈ 9 నెలల్లో ఆగ్రాను 12.51 కోట్ల మంది సందర్శించగా.. అయోధ్యను 13.55 కోట్ల మంది సందర్శించినట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 22న ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అట్టహాసంగా ప్రారంభమై అయోధ్య రామ మందిరం దేశీయ ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా చేరింది. విదేశీయులు 3,153 మంది మాత్రమే అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక పర్యాటకంలో అయోధ్య దూసుకుపోతోందని ట్రావెల్ ప్లానర్స్ చెబుతున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకుల్లో 70 శాతం మంది రామమందిరం, సరయు నది అందాలను తిలకిస్తూ పరవశించిపోతున్నారని చెబుతున్నారు. – సాక్షి, అమరావతి -
ఢిల్లీలో తప్పక చూడాల్సిన ఐదు పర్యాటక ప్రాంతాలివే!
దేశ రాజధాని ఢిల్లీ చరిత్ర వందేళ్ల నాటిది. ఇక్కడ సందర్శించడానికి అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని తిలకించేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అందుకే ఢిల్లీలోని ఐదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అక్షరధామ్ ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని స్వామినారాయణ దేవాలయం అని కూడా అంటారు. స్వామి నారాయణ్ శాఖకు చెందిన ఈ ఆలయం హిందూ ధర్మం, దాని ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. 2005, నవంబర్ 6న ఈ ఆలయాన్ని ప్రారంభించారు. అదే ఏడాది నవంబర్ 8 నుంచి సామాన్యులకు ప్రవేశం కల్పించారు. ఈ ఆలయ ప్రాంగణంలో బోట్ రైడ్, లైట్ షో, థియేటర్ ఉన్నాయి. ఆలయంలో తరచూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇండియా గేట్ కర్తవ్యపథ్‌లోని ఇండియా గేట్ భారతదేశంలోని ప్రధాన చారిత్రక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకుల రద్దీ ఉంటుంది. ఇండియా గేట్ 1931-1933 మధ్య కాలంలో నిర్మితమయ్యింది. ఇండియా గేట్ ఎత్తు సుమారు 42 మీటర్లు. వారాంతాల్లో పర్యాటకులతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. కుతుబ్ మినార్ ఢిల్లీలోని అందమైన ప్రదేశాలలో కుతుబ్ మినార్ కూడా ఒకటి. 73 మీటర్ల ఎత్తయిన ఈ టవర్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో కూడా చేరింది. దీనిని చూసేందుకు దేశం నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తుంటారు. ఎర్రకోట మొఘల్ చక్రవర్తుల రాజధాని ఢిల్లీ. ఎర్రకోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1638- 1648 మధ్య కాలంలో నిర్మించారు. ఇక్కడి మ్యూజియంలో సాంప్రదాయ హస్తకళలకు సంబంధించిన అనేక విశేషాలను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి ఎరుపు రంగు గోడల కారణంగా సాయంత్రం వేళల్లో ఎర్రకోట మరింత కనువిందు చేస్తుంది. లోటస్ టెంపుల్ లోటస్ టెంపుల్ కలువ పూవు ఆకృతిని కలిగివుంటుంది. ఆలయం పాలరాయితో నిర్మితమయ్యింది. 1986లో దీనిని నిర్మించారు. లోటస్ టెంపుల్‌ను ‘బహాయి దేవాలయం’ అని కూడా అంటారు. దీనిని ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గల ఒపెరా హౌస్‌తో పోలుస్తుంటారు. ఇక్కడ చుట్టూ పచ్చదనం కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఏ దేవుని విగ్రహం కూడా ఉండదు. ఇక్కడి వాతావరణం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. -
పర్యాటక శోభ
కృష్ణా: ఆఆధ్యాత్మిక క్షేత్రాలు.. సముద్రతీరంతో కృష్ణా తీరంలోని నాగాయలంక మండలం పర్యాటక శోభతో పరిఢవిల్లుతోంది. ప్రకృతి సౌందర్యాల మధ్య షికారు అంటే ఎవరికైనా హుషారు వస్తుంది. మది ఆనందంతో పరుగులు తీస్తుంది. పర్యాటక సోయగాలు కొందరికి ఉల్లాసాన్ని కలిగిస్తే మరికొందరికి విజ్ఞానాన్ని అందిస్తాయి. బుధవారం పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నాగాయల లంక మండలం వారాంతపు ఆహ్లాదానికి విలాసంగా విరాజిల్లుతోంది. ఇక్కడ దక్షిణ బంగాళాఖాతం, పశి్చమ కృష్ణా పరివాహక తీర ప్రాంతం పర్యాటకులకు నిత్యం ఆహా్వనం పలుకుతోంది. దివిసీమతో అనుసంధానమైన నాగాయలంక మండలంలో మరో రెండుదీవులు(ఎదురుమొండి–ఈలచెట్లదిబ్బ) భౌగోళికంగా ఈప్రాంత పర్యాటక ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నాయి. స్థానిక శ్రీరామపాదక్షేత్రం ఘాట్, కృష్ణానది, లైట్హౌస్లు పర్యాటక వేదికలుగా మారాయి. ఈ తీరానికి వస్తున్న సందర్శకులు కృష్ణానదిలో బోటుíÙకారు చేసేందుకు అమిత ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి ప్రవేటు బోట్లతో నవలంక ఐలాండ్‌లో సందడి చేస్తున్నారు. ఇటీవల నవలంక ఐలాండ్ ఆధునిక ప్రీ వెడ్డింగ్ షూట్లకు వినియోగిస్తున్నారు. ప్రధానంగా కృష్ణానది ఆవల పశ్చిమ తీరంలో నిత్యం కనిపించే సూర్యాస్తమయ దృశ్యాలకు సందర్శకులు మంత్ర ముగ్ధులవుతూ ఫొటోలు, సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. ఈ ప్రాంతానికి మరిన్ని హంగులు సమకూరిస్తే విశేష ఆదరణ లభిస్తుందని సందర్శకులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. శ్రీరామపాద క్షేత్రం ప్రాంగణంలో ఆరు దేవాలయాలు ఉన్నాయి. దీంతో ఆధ్యాత్మిక వైభవం సంతరించుకుంది. జలక్రీడల శిక్షణకు వాటర్‌స్పోర్ట్స్ అకాడమీ ఇక్కడ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యాన వాటర్‌స్పోర్ట్ అకాడమీ ఏర్పాటుచేశారు. స్థానిక విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. గతేడాది మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయ స్థాయి జలక్రీడల్లో ఇక్కడ శిక్షణ పొందిన గాయత్రి జాతీయ స్థాయి రజిత పతకం సాధించిన విషయం విదితమే. రూ.1.10కోట్ల వ్యయ అంచనాతో పూర్తైన ఫుడ్‌కోర్టు భవన నిర్మాణం తుది దశలో ఉంది. ఆకర్షిస్తున్న నాగాయలంక లైట్‌హౌస్ ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కనువిందు చేసేది సాగర సంగమ ప్రాంతంలోని నాగాయలంక లైట్‌హౌస్. కృష్ణా దక్షిణ పాయ నాగాయలంక మీదుగా వెళ్లి మూడు పాయలుగా చీలి సాగర సంగమం చెందే సమీపంలో ఉన్న ఈ దీపస్తంభం విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి 20 కి.మీ నదీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కుటుంబాలు, స్నేహితుల బృందాలు ప్రైవేట్ బోట్లలో వెళ్తున్నారు. మార్గమధ్యంలో, లైట్‌హౌస్ పరిసరాల్లో విస్తరించిన వందలాది ఎకరాల మడ అడవుల సౌందర్యం తనివితీరా చూడవలసిందే. ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై చేపట్టిన ఎదురుమొండి వంతెన నిర్మాణం పూర్తైతే నాగాయలంకకు లైట్హౌస్కు నడుమ ఉన్న ఈ ప్రాంతం మరింత గొప్ప పర్యాటక ప్రదేశంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి పర్యాటకానికి అన్ని వనరులూ ఉన్న నాగాయలంక తీరప్రాంతాన్ని దివిసీమ పర్యాటక కేంద్రంగా మరింత తీర్చిదిద్దాలి. అమరావతికి దక్షిణ నదీ ముఖద్వారం (రివర్‌ఫ్రంట్)గా ఆకర్షణగా ఉంది. శ్రీరామ పాదక్షేత్రం నుంచి లైట్‌హౌస్ వరకు పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటిస్తే ఈ ప్రాంతం దివిసీమ పర్యాటకంలో కలికితరాయిగా ప్రాచుర్యం పొందుతుంది. –తలశిల రఘుశేఖర్, ఔత్సాహిక కేజ్‌కల్చరిస్ట్, నాగాయలంక -
లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అద్భుతమైన ప్రకృతి అందాలు, ఎత్తయిన, పచ్చని కొండలు, వీటిని మించి మరపురాని సొరంగ మార్గాల ద్వారా ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం.. మన పక్కనే ఉన్న ఒడిశాలోని కోరాపుట్‌కు వెళ్తే చాలు.. ఈ అనుభూతులన్నీ మీ సొంతమతాయి. అవేమిటో.. ఈ రూట్ విశేషాలను పర్యాటక ప్రేమికుల కోసం ప్రత్యేకం.. కే–ఆర్ (కోరాపుట్–రాయగడ) రైల్వే లైన్ వాల్తేర్ డివిజన్‌కు ప్రధానంగా ఆదాయాన్నిచ్చే కిరండూల్, బచేలిలో ఉన్న ఐరన్ ఓర్ రవాణా మార్గానికి ప్రత్యామ్నాయంగా వేరే లైన్‌ను ఏర్పాటుచేసి ఈ సరకు రవాణాను మరింతగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో 1980లలో కోరాపుట్ – రాయగడ (కే–ఆర్) లైన్‌ను ప్రారంభించగా.. 1993–92మధ్య ఈ లైన్ పూర్తయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1995 అక్టోబర్ 31న ప్రారంభించారు. కోరాపుట్ నుంచి రాయగడకు మొత్తం 167 కిలోమిటర్ల మేర ఈ లైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మొత్తం 36 సొరంగాలు, 76 ప్రధాన వంతెనలు, 180 అందమైన మలుపులు ఉన్నాయి. అప్పట్లో ప్రధానంగా ఈ మార్గం వైజాగ్ స్టీల్‌ప్లాంట్, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్‌లకు అసవరమైన ఐరన్‌ఓర్‌ను రవాణాను పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగించేవారు. పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి ఈ మార్గంలో అల్యూమినా పౌడర్ సరఫరా చేసే నాల్కో, ఉత్కళ్ అల్యూమినా, వేదాంత, జేకే పేపర్, ఇంఫా (ఇండియా మెటల్ అండ్ ఫెర్రో అల్లాయ్), హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వంటి పరిశ్రమలకు ఎంతో అనుకూలంగా ఈ మార్గం ఉండేది. ప్రస్తుతం ఈ మార్గంలో రెండో లైన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 2015–16లో రూ.2500 కోట్లు బడ్జెట్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2026నాటికి రెండోలైన్ పూర్తి చేయనున్నారు. పర్యాటక, పుణ్యక్షేత్రాల సమాహారం... ఆంధ్రా, ఒడిశా సదరన్ డివిజన్లో ప్రసిద్ధిచెందిన మజ్జిగైరమ్మ ఆలయం రాయగడ ప్రాంతంలోనే ఉంది రాయగడకు కేవలం 50కి.మీల దూరంలో చిత్రకోన వాటర్ ఫాల్స్ తెరుబలిలో గల ఇంఫా ప్యాక్టరీ వద్ద ప్రసిద్ధి చెందిన లక్ష్మీనారాయణ ఆలయం కోరాపుట్‌లో రాణి డుడుమ వాటర్‌ఫాల్స్, జగన్నాథస్వామి ఆలయం గుప్తేశ్వర గుహలు డియోమలి హిల్స్ కూడా కోరాపుట్ ప్రాంతంలోనే ఉన్నాయి. కోరాపుట్లోనే కోలాబ్ రిజర్వాయర్ కూడా ఉంది. గుహల్లో, వంతెనలపై మరపురాని ప్రయాణం ఈ మార్గంలో సొరంగాలలో నుండి రైలు దూసుకుపోతుంటే ఆ అనుభూతులే వేరు. సుమారు 36 చిన్న, పెద్ద సొరంగాలు. ఈ మార్గంలోనే రౌలీ స్టేషన్‌కు సమీపంలో తూర్పుప్రాంతంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గం ఉంది. దీని పొడవు 1,599 మీటర్లు (1.59 కిలోమిటర్లు). ప్రకృతి సోయగాలు, లోతైన, ఎత్తైన కొండలపై ప్రయాణం. సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో కోరాపుట్ రైల్వే స్టేషన్. అందమైన వంతెనలు ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ మార్గంలో ఉన్నాయి. సాధారణంగా అరకు, బొర్రాగుహలుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు, కానీ ఒకసారి ఈ ప్రాంతాలను సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. వెలుగులోకి తీసుకువచ్చిన వాల్తేర్ డివిజన్ కోరాపుట్–రాయగడ రైల్వే మార్గం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. వాల్తేర్ డివిజన్‌కు డివిజనల్ రైల్వే మేనేజర్ గా వచ్చిన అనూప్‌కుమార్ సత్పతి అతి తక్కువ సమయంలో ఈ మార్గంలో పర్యటించి, తనిఖీలు చేసి దీనిని పర్యాటకులకు పరిచయం చేశారు. ఈ మార్గంలో పర్యాటకుల కోసం తొలిసారిగా విస్టాడోమ్ కోచ్‌ను జతచేశారు. వారానికి మూడుసార్లు నడిచే విశాఖపట్నం–కోరాపుట్ స్పెషల్ ప్యాసింజర్ రైలుకు ఈ విస్టాడోమ్ కోచ్ జతచేస్తున్నారు. (క్లిక్ చేయండి: అడవుల్లోనూ ఆహార పంటలు) 20 ఏళ్ల తరువాత ప్రెస్‌టూర్... దాదాపు 20 ఏళ్ల తరువాత వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ మార్గంలో శనివారం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో గల ప్రముఖ పాత్రికేయులకు ప్రెస్టూర్ను ఏర్పాటుచేశాం. బహుశా కొద్ది డివిజన్లు మాత్రమే ఇటువంటివి ఏర్పాటు చేస్తాయి. ఈ టూర్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెందిన పర్యాటకరంగ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు పరిచయం చేస్తే బాగుంటుంది. – అనూప్ కుమార్ సత్పతి, డీఆర్ఎం అద్భుతంగా ఉంది మొదటిసారిగా ఈ ప్రాంతాలను సందర్శించా. విస్టాడోమ్కోచ్లో ప్రయాణించడం కూడా మరచిపోలేని అను భూతి. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు తనతో పాటు మార్కెటింగ్ డివిజన్ నుంచి కృష్ణమోహన్, రాజేంద్రరావు, లోకనాథరావు కూడా ఈ టూర్లో పాల్గొన్నారు. – కె హరిత, డివిజనల్ మేనేజర్, ఏపీ టూరిజం -
Travel Tips: సోలంగ్ వ్యాలీ పర్యాటన ఓ అందమైన అనుభూతి..!
సోలంగ్ టూర్లో అడ్వెంచరస్ స్పోర్ట్స్ హబ్ సోలంగ్ వ్యాలీనే. సోలాంగ్ నది పరివాహక ప్రదేశం ఇది. మనాలికి 13 కిమీల దూరాన ఉంది. కులు–మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువైన తర్వాత సినిమా షూటింగ్‌లు సోలంగ్ వ్యాలీలో జరుగుతున్నాయి. ఇప్పుడా సోలంగ్ వ్యాలీ పర్యాటకుల సాహస క్రీడావిహారానికి కేంద్రమైంది. ట్రెకింగ్, పారాగ్లైడింగ్, క్యాంపింగ్, రివర్ రాఫ్టింగ్, స్నో స్కీయింగ్, గ్రాస్ స్కీయింగ్, హార్స్ రైడింగ్, స్నో స్కూటర్ రేస్, రివర్ క్రాసింగ్, వాల్ క్లైంబింగ్ వంటి ఆటలన్నీ ఆడుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక్కడ పారా గ్లైడింగ్ చేశారు. అయితే సమీప గతంలో కాదు, అది గుజరాత్‌కి ముఖ్యమంత్రి కాక ముందు మాట. రొటీన్‌కి భిన్నంగా మనాలి పర్యటనలో రొటీన్‌గా చూసే మంచు కొండల్లో విహారానికి పరిమితం కాకుండా మరికొంచెం ఆసక్తిగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే నగ్గర్ కోటలో బస, సాహసక్రీడలు, ప్రాచీన వారసత్వ నిర్మాణాలు, ఆ ప్రదేశానికి పరిమితమైన వైవిధ్యమైన వాస్తుశైలి, జలపాతాల స్వచ్ఛత, నదిలో విహరింతలను ఆస్వాదించడం సాధ్యమవుతుంది. మాల్ రోడ్డులో ఏమీ కొనకపోయినా సరే... హనీమూన్ కపుల్ చెట్టాపట్టగ చేతులు పట్టుకుని నడవడమే జీవితమంతా గుర్తుండిపోయే మధురానుభూతి. అలాగే కేబుల్ కార్ విహారం కూడా. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! ఇవన్నీ చూడాలి! హిడింబాలయం పాండవులలో రెండవ వాడు భీముని భార్య హిడింబి. ఆమె ఆలయమే ఇది. మనాలి సమీపంలోని దుంగ్రీ అటవీ ప్రాంతంలో ఉంది. మనాలి టూర్ ప్యాకేజ్‌లలో హిడింబ ఆలయం తప్పక ఉంటుంది. హిమాచల్ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్స్ మ్యూజియం ఇది హిడింబ ఆలయానికి దగ్గరలోనే ఉంది. ఈ ప్రదేశంలో విలసిల్లిన నాగరకతను పురాతన వస్తువులు, ఆయుధాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. టిబెట్ మఠాలు మనాలిలో స్థిరపడిన టిబెట్ వాళ్ల నివాస ప్రదేశాలివి. నిర్మాణశైలి పరంగా ప్రత్యేకంగా ఉంటాయి. రంగులు కూడా ఆసక్తిగొలుపుతుంటాయి. వశిష్ఠ ఆలయం ఇది ఏకశిలలో తొలిచిన ఆలయం. ఈ ఆలయంతోపాటు ఇక్కడి వేడినీటి గుండాలు ప్రధాన ఆకర్షణ. జోగ్ని జలపాతం మంచుకొండలు, వేగంగా ప్రవహించే నదుల మధ్య ఉధృతంగా నేలకురికే జలపాతం సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేం. స్వయంగా వీక్షించి ఎవరికి వాళ్లు అనుభూతి చెందాల్సిందే. నయింగ్మ టెంపుల్ ఇది మనాలి, మాల్‌రోడ్‌లో ఉన్న బుద్ధుని ఆలయం. నిర్మాణశైలిపరంగా చూసి తీరాల్సిన ఆలయం. శాక్యముని విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. మాల్‌రోడ్‌లో దుకాణాల్లో ఉలెన్ క్లోత్స్, దోర్జీబెల్స్, ప్రేయర్ వీల్స్ వంటి సావనీర్లు, టిబెట్ అగరబత్తులు, తరుణిబట్టిన దారుకళాకృతులు, హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ టర్కోయిస్, సిల్వర్ ఆభరణాలు, టిబెట్ వాళ్లు ధరించే ఆభరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలా తినవచ్చు! ఈ పర్యటనలో రకరకాల రుచులను మిస్ కాకూడదు. మౌంట్ వ్యూ రెస్టారెంట్లో టిబెట్, జపాన్, చైనా, ఇటాలియన్, కాంటినెంటల్ ఫుడ్ రుచి చూడవచ్చు. చలిమంట వెచ్చదనంతోపాటు బార్బిక్యూ వంటలను ఆస్వాదించాలంటే బాసిల్ లీఫ్ రెస్టారెంట్‌కెళ్లాలి. మనాలి హిమాలయాల నేపథ్యంలో ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించాలంటే రూఫ్‌టాప్ రెస్టారెంట్లో భోజనం చేయడం మంచి ఆలోచన. ఇది నగ్గర్ రోడ్లో ఉంది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! ఎప్పుడు! ఎలా! హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలంగ్– మనాలి టూర్‌కి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఏడాది సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మాత్రమే. సమీప విమానాశ్రయం భుంటార్ ఎయిర్‌పోర్టు. ఇది మనాలి సిటీసెంటర్‌కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవన్నీ కొనుక్కోవచ్చు ►మాల్‌రోడ్‌లో దుకాణాల్లో ఉలెన్ క్లోత్స్, దోర్జీబెల్స్, ప్రేయర్ వీల్స్ వంటి సావనీర్లు, టిబెట్ అగరబత్తులు, తరుణిబట్టిన దారుకళాకృతులు, హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ టర్కోయిస్, సిల్వర్ ఆభరణాలు, టిబెట్ వాళ్లు ధరించే ఆభరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ►సింగింగ్ బౌల్: ఇది బౌద్ధానికి ప్రతీక. హిమాచల్ ప్రదేశ్, టిబెట్ రోజువారీ జీవితంలో భాగం. దీని నుంచి వచ్చే శబ్దం, ఆ ప్రకంపనలు వాతావరణాన్ని ఆహ్లాదపరచడంతోపాటు ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రతను కలిగిస్తాయని చెబుతారు. స్నేహితులకు బహుమతిగా ఇవ్వడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ సింగింగ్ బౌల్స్‌ను కొంటారు. ►కులు షాల్: ఉలెన్ దుస్తుల విభాగంలో అడుగుపెడితే దేనిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. స్వెటర్లు, మఫ్లర్లు, క్యాప్‌లు వందల రకాలుంటాయి. ప్రతిదీ అందంగానే ఉంటుంది. ఈ ట్రిప్‌కు గుర్తుగా కులు, కిన్నౌరి షాల్ తెచ్చుకోవడం మర్చిపోకూడదు. రకరకాల షేడ్లలో ఏ రంగు దుస్తులకైనా మ్యాచ్ అయ్యేటన్ని మోడల్స్ ఉంటాయి. ►ప్రేయర్ వీల్: ఇది టిబెట్ సంప్రదాయంలో ప్రధానమైనది. లోహం, చెక్క, తోలుతోపాటు రాతి చక్రాలు కూడా ఉంటాయి. ఈ వీల్స్ మీద టిబెట్ భాషలో ‘ఓంమణి పద్మే’ అనే మంత్రం ఉంటుంది. ఈ టూర్ గుర్తుగా డ్రాయింగ్ రూమ్‌లో పెట్టుకోవచ్చు. ►దోర్జీ బెల్: ఇది కూడా టిబెట్ సంప్రదాయ వస్తు విశేషమే. గంట ఆకారంలో ఉంటుంది. మనాలిలో ఏ వస్తువైనా సరే ప్రభుత్వం అనుమతి పొందిన స్టోర్లలో మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. మామూలు దుకాణాల్లో ధరలు ఆకాశాన ఉంటాయి. బేరం చేయగలిగిన సామర్థ్యానికి పరీక్ష. గట్టిగా బేరం చేయగలిగితే ధరలను నేల మీదకు దించవచ్చు. కానీ టూర్లో సమయం చాలా విలువైనది. బేరం చేయడం కోసం అంత సమయం వృథా చేయడం అర్థరహితం. మాల్ రోడ్ తర్వాత మనాలిలో హాంగ్‌కాంగ్ మార్కెట్ మీద ఓ కన్నేయవచ్చు. ట్రావెల్ టిప్స్ ►మాల్ రోడ్లో పగలు జరిగినంత షాపింగ్ రాత్రి కూడా జరుగుతుంది. హస్తకళాకృతులు లెక్కలేనన్ని రకాలుంటాయి. ఈ దుకాణాలను చూస్తే పురాతనంగా కనిపిస్తాయి. కానీ అన్నింటిలోనూ యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు పేమెంట్ చేయవచ్చు. ►మాల్ రోడ్లో దొంగతనాలు ఎక్కువ. ఇక్కడ పర్యటించేటప్పుడు విలువైన వస్తువులను దగ్గర ఉంచుకోకపోవడమే మంచిది. షాపింగ్ సమయంలో చేతిలో ఉన్న బ్యాగ్‌ను పక్కన పెట్టి మరీ వస్తువుల నాణ్యతను పరిశీలిస్తాం. అలాంటి సమయంలో మళ్లీ చూసుకునేటప్పటికి బ్యాగ్ ఉండకపోవచ్చు. ఒక్కోసారి కింద పెట్టిన బ్యాగ్ గురించి మనమే మర్చిపోవచ్చు కూడా. కొంత దూరం వెళ్లిన తరవాత గుర్తుకు వచ్చి వెనక్కి వచ్చినా ప్రయోజనం ఉండదు. చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట! -
సిమ్మ్..లా
ప్రకృతి మాత భారతావని సిగలో నెలవంకను తురిమిందా అన్నట్లు ఉంటుంది సిమ్లా ఏరియల్ వ్యూ. అర్ధచంద్రాకారపు పర్వత సానువుల పై భాగంలో ఉండే ఈ పట్టణంలో ఎటు చూసినా పైన్, దేవదారు చెట్లు ఒక దాన్ని మించి మరొకటి ఆకాశాన్నంటాలన్న తాపత్రయంలో పెరుగుతున్నట్లు ఉంటాయి. శీతాకాలంలో అయితే ఈ చెట్లను మంచు కప్పేసి ముగ్గుబుట్ట తలమీద గుమ్మరించుకున్న పాపాయిలా ఉంటుంది సిమ్లా. సిమ్లా వేసవి విడిది మాత్రమే కాదు, ఒకప్పటి వేసవి రాజధాని కూడా. కీలకమైన ద్వైపాక్షిక ఒప్పందాలకు మౌనసాక్షి. సిమ్లా పట్టణం మాత్రమే చూసి వెనక్కి వస్తే టూర్ తృప్తినివ్వదు. పట్టణంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలతోపాటు పరిసరాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను ఎన్ని కవర్ చేయగలిగితే అంత సంతృప్తి సొంతమవుతుంది. మే నుంచి సెప్టెంబర్ వరకు ఒక్క సిమ్లానే కాదు, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా మే నుంచి సెప్టెంబర్ మధ్య కాలం అనువైన కాలం. ఇంకా చెప్పాలంటే మే, జూన్లే సిమ్లా దర్శించడానికి సరైన కాలం. కల్కా నుండి సిమ్లా వెళ్లే టాయ్ ట్రైన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు కనెక్టింగ్ ట్రైన్. నిజానికి సిమ్లా ప్రయాణంలో ఆనందం కల్కా నుండే మొదలవుతుంది. ఇక్కడి నుంచి నారోగేజ్ రూట్. పర్యాటకులకు టాయ్‌ట్రైన్‌లో ప్రయాణించడం మరిచిపోలేని అనుభూతిగా మిగులుతుంది. ఎటు చూసినా హిమాలయ పర్వత శ్రేణులు, లోయలు, క్రమశిక్షణతో పెరిగినట్లు తిన్నగా పెరిగిన పైన్, ఓక్ చెట్లు అడుగడుగునా కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. అలసటగా ఒక్క క్షణం కళ్లు మూసి తెరిస్తే అంతా చీకటిగా ఉంటుది, కళ్లు తెరిచామా లేదా అని విప్పార్చి చూస్తే అప్పుడు తెలుస్తుంది ట్రైన్ ఒక టన్నల్ గుండా ప్రయాణిస్తోందని. సిమ్లా, కల్కాల మధ్య 103 టన్నళ్లు, 87 బ్రిడ్జిలు ఉన్నాయి. ‘గ్రేటెస్ట్ నారో గేజ్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా’గా గిన్నెస్ బుక్‌లో రికార్డయిన మార్గం ఇది. ఈ రూట్లో లెక్కలేనన్ని చిన్న పెద్ద నదులుంటాయి. అయితే వీటిలోని చాలా నదుల్లో ఎండకాలంలో నీళ్లుండవు. కొండ పక్కగా కొంతసేపు, సొరంగంలో మరికొంత సేపు, కిందకు చూస్తే నది... ఇలా సహజత్వానికి సాంకేతికత మేళవించిన సిమ్లా యాత్రలో ప్రతిక్షణం అమూల్యమైనదిగా అనిపిస్తుంది. ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉంటే ఏం మిస్సవుతామోనని కళ్లప్పగించి పరిసరాలను, ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూండగానే కనుచూపు మేరలో ట్రెక్కింగ్ బృందం కనిపిస్తుంది. కొన్ని పర్వతాలకు ప్రదక్షిణ చేసి, మరికొన్నింటి కడుపులో నుండి దూసుకుపోయి సిమ్లా చేరేటప్పటికే టూర్లో కొంత ఆనందం సొంతమవుతుంది. సిమ్లాలో చూడాల్సినవి సిమ్లా పట్టణం కొండవాలులోనే విస్తరించి ఉంటుంది. దూరం నుండి చూస్తే ఇళ్లన్నీ ఒకదాని మీద మరొకటి ఉన్నట్లుగా అనిపిస్తాయి. సిమ్లా వెళ్లిన వాళ్లు మొదటగా చూసేది మాల్రోడ్నే. మాల్‌సెంటర్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. షాపింగ్ చేసినా, చేయకపోయినా అంతా తిరిగి చూడడం బాగుంటుంది. గుర్రమెక్కి మాల్ అంతా చుట్టి, పనిలో పనిగా ఒక ఫొటో తీసుకుంటే ఆ మధురానుభూతి ఎప్పటికీ మర్చిపోలేం.ఇక్కడ ఉలెన్ దుస్తులు చాలాతక్కువ ధరకు దొరుకుతాయి. ఇక మిగిలినవన్నీ తాకితే కాలేటట్లు ఉంటాయి. సిమ్లా దాని చుట్టుపక్కల ఆపిల్ తోటలు ఎక్కువ. పర్యాటకులు ఈ పండ్లను కోసుకుంటున్నా స్థానికులు ఏమీ అనరు. అయితే పండు కాకుండా పచ్చికాయను ముట్టుకుంటే ఒప్పుకోరు. పట్టణంలో తిరుగుతున్నంత సేపూ మనదేశంలో ఉన్నామా? మరొక దేశానికి వచ్చామా? అన్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ బ్రిటిష్ పాలకుల ప్రభావం ఎక్కువ. ఇప్పటికీ ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉందేమోననిపిస్తుంది. స్థానికులు వస్తువులను పిల్లలు స్కూలుబ్యాగు వేసుకున్నట్లు వీపుకు కట్టుకుని వెళ్తుంటారు. కొండ ప్రాంతం కావడంతో ఎగుడుదిగుడు మార్గంలో ఆవిధంగా వెడితేనే సౌకర్యంగా ఉంటుంది. ఇండియా నుంచి పాకిస్తాన్ వేరుపడడానికి జరిగిన ఒప్పందం, కీలకమైన కాశ్మీర్ సమస్యపై చర్చ ఇక్కడి వైస్రాయల్స్ భవనంలో జరిగింది. సిమ్లాకు వచ్చిన పర్యాటకులు తప్పకుండా ఈ భవనాన్ని చూస్తారు. బ్రిటీష్ పాలకులు వేసవిలో ఇక్కడికి వచ్చి సేదదీరేవారు, వారి సౌలభ్యం కోసం ఇక్కడి నుంచే పాలన సాగించారు. తరువాత వచ్చిన మన ప్రధానులు కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ దానికి స్వస్తి చెప్పి ఆ భవనంలో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’ను ఏర్పాటు చేశారు. శ్యామలే సిమ్లా హిమాలయ పర్వతాలు అందంగా కనిపించే స్కాండల్ పాయింట్, చర్చి, లైబ్రరీ, లక్కడ్ బజార్ ముఖ్యమైనవి. లక్కడ్ బజార్లో కొయ్యతో చేసిన హస్తకళలు దొరుకుతాయి. స్కాండల్ పాయింట్ నుండి జనరల్ పోస్ట్ ఆఫీస్ వైపు కొద్ది దూరం నడిస్తే కాలాబరి ఆలయం వస్తుంది. ఇందులో ఉన్న దేవత శ్యామల దేవి. సిమ్లాకు ఆ పేరు వచ్చింది శ్యామల దేవత నుంచేనట. ఇక జాకూ ఆలయం ఉన్న శిఖరం చూసి తీరాల్సిందే. ఇక్కడి నుంచి చూస్తే సిమ్లా అంతా కళ్ల ముందుంటుంది. ఇక్కడ హనుమాన్ ఆలయం ఉంది. ఇక్కడికి కొంచెం ఓపిక ఉంటే నడిచి వెళ్లవచ్చు, నడవలేని వాళ్ల కోసం పోనీలు (గుర్రాలు), టాక్సీలు ఉంటాయి. స్టేట్ మ్యూజియంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పురాతన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిల్పాలు, పెయింటింగ్స్ ఉంటాయి. మన కల్చర్‌ని ఇక్కడ బాగా ఎంజాయ్ చేయవచ్చు. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’ను తప్పకుండా చూడాలి. ఇక్కడి నుండి పది– పదిహేను నిమిషాలు నడిస్తే ప్రాస్పెక్ట్ హిల్ వస్తుంది. ఇక్కడ కామనదేవి ఆలయం ఉంది. ఇక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో సమ్మర్ హిల్ ఉంది. మహాత్మాగాంధీ ఇక్కడ ఉన్న జార్జియన్ హౌస్‌లో విడిది చేసారట. హిమాచల్‌ప్రదేశ్ యూనివర్శిటీ కూడా ఇక్కడే ఉంది. దారి పొడవునా... సిమ్లా నుండి బయలు దేరినప్పటి నుండి ప్రతి ఐదారు కిలోమీటర్లకు ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది. ‘తత్తపాని’ హాట్ వాటర్ స్ప్రింగ్ మర్చిపోకుండా చూడాలి. హిమాచల్‌ప్రదేశ్ వాసులకు వేడినీటి గుండాలు మామూలు విషయమే కాని, మనకు వాటిని చూస్తే ఆశ్చ ర్యంగానే ఉంటుంది. ఆ నీటిగుండం మినహా పరిసరాల వాతావరణం రక్తం గడ్డకట్టేంత చల్లగా ఉంటుంది. హాట్‌వాటర్ స్ప్రింగ్‌లో నీళ్లు మాత్రం మరుగుతుంటాయి. ఈ నీటిలో సల్ఫర్ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి అలా జరుగుతుందట. ఇక్కడ స్నానం చేస్తే చర్మవ్యాధులు పోతాయంటారు. ఇంకా ఆసక్తి, సమయం ఉంటే ప్రణాళిక ప్రకారం పరిసరాల్లో ఉన్నవన్నీ చూడవచ్చు. సిమ్లాలో హిమాచల్‌ప్రదేశ్ టూరిజం ఆఫీస్‌లో సంప్రదించి ఆ ప్యాకేజ్‌లో వెళ్తే తక్కువ టైంలో ఎక్కువ ప్రదేశాలను చూడవచ్చు. లేదా రూట్ మ్యాప్ ప్రకారం సొంత వాహనంలో వెళ్లడం కూడా సౌకర్యంగా ఉంటుంది. నచ్చిన ప్రదేశంలో ఎక్కువ సమయం గడపడానికి వీలవుతుంది. అడ్వెంచర్ టూర్ సిమ్లా నుంచి నర్కందా వెళ్లే వరకు పర్వతాలన్నీ మంచురాశి పోసినట్లుంటాయి. దట్టంగా పరుచుకున్న మంచుకొండల మీద సూర్యకిరణాలు పడి మెరుస్తూ వెండికొండలన్న విశేషణం అక్షరాలా నిజమనిపిస్తుంది. స్నో స్కీయింగ్ చేయడానికి ఇది చక్కటి లొకేషన్. సిమ్లా నుంచి కుఫ్రి వెళ్ళే దారి అంతా ఒకవైపు ఆకాశాన్నంటే పర్వతాలు ఉంటే మరొక వైపు అగా«ధాలుంటాయి. ఈ శివాలిక్పర్వతశ్రేణులన్నీ మంచుదుప్పటి కప్పుకున్నట్టుంటే, లోయలు రంగురంగుల పూలతో సీతాకోకచిలుకల్లా ఉంటాయి. వింటర్ స్పోర్ట్స్‌కు ఇది కేంద్రం. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో స్పోర్ట్స్ వేడుకలు జరుగుతాయి. రాంపూర్ సట్లెజ్ నది ఒడ్డున ఉంది. ఇది రివర్ రాఫ్టింగ్‌కు అనువైన ప్రదేశం. ఇక్కడ మరొక వింత కూడా ఉంది. ఇక్కడ దుకాణాల్లో లావాదేవీకి డబ్బు పనికిరాదు. కరెన్సీ అమలులోకి రాకముందు వస్తుమార్పిడి విధానం(బార్టర్ సిస్టం) ఉండేదని చిన్నప్పుడు చదువుకున్నాం కదా? దాన్ని ఇక్కడ స్వయంగా చూడవచ్చు. స్థానికంగా తయారైన ఉన్ని ఉత్పత్తులన్నీ చవక. డ్రైఫ్రూట్స్ చాలా రకాలు దొరుకుతాయి. ధర కూడా బాగా తక్కువ. – వాకా మంజులారెడ్డి