సిమ్‌మ్‌..లా | special story to shimla city | Sakshi
Sakshi News home page

సిమ్‌మ్‌..లా

Published Thu, Mar 23 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

సిమ్‌మ్‌..లా

సిమ్‌మ్‌..లా

ప్రకృతి మాత భారతావని సిగలో నెలవంకను తురిమిందా అన్నట్లు ఉంటుంది సిమ్లా ఏరియల్‌ వ్యూ. అర్ధచంద్రాకారపు పర్వత సానువుల పై భాగంలో  ఉండే ఈ పట్టణంలో ఎటు చూసినా పైన్, దేవదారు చెట్లు ఒక దాన్ని మించి మరొకటి ఆకాశాన్నంటాలన్న తాపత్రయంలో  పెరుగుతున్నట్లు ఉంటాయి. శీతాకాలంలో అయితే ఈ చెట్లను మంచు కప్పేసి ముగ్గుబుట్ట తలమీద గుమ్మరించుకున్న పాపాయిలా  ఉంటుంది సిమ్లా.


సిమ్లా వేసవి విడిది మాత్రమే కాదు, ఒకప్పటి వేసవి రాజధాని కూడా. కీలకమైన ద్వైపాక్షిక ఒప్పందాలకు మౌనసాక్షి. సిమ్లా పట్టణం మాత్రమే చూసి వెనక్కి వస్తే టూర్‌ తృప్తినివ్వదు. పట్టణంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలతోపాటు పరిసరాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను ఎన్ని కవర్‌ చేయగలిగితే అంత సంతృప్తి సొంతమవుతుంది.

మే నుంచి సెప్టెంబర్‌ వరకు
ఒక్క సిమ్లానే కాదు, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా మే నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలం అనువైన కాలం. ఇంకా చెప్పాలంటే మే, జూన్‌లే సిమ్లా దర్శించడానికి సరైన కాలం. కల్కా నుండి సిమ్లా వెళ్లే టాయ్‌ ట్రైన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు కనెక్టింగ్‌ ట్రైన్‌. నిజానికి సిమ్లా ప్రయాణంలో ఆనందం కల్కా నుండే మొదలవుతుంది. ఇక్కడి నుంచి నారోగేజ్‌ రూట్‌. పర్యాటకులకు టాయ్‌ట్రైన్‌లో ప్రయాణించడం మరిచిపోలేని అనుభూతిగా మిగులుతుంది.  

ఎటు చూసినా హిమాలయ పర్వత శ్రేణులు, లోయలు, క్రమశిక్షణతో పెరిగినట్లు తిన్నగా పెరిగిన పైన్, ఓక్‌ చెట్లు అడుగడుగునా కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. అలసటగా ఒక్క క్షణం కళ్లు మూసి తెరిస్తే అంతా చీకటిగా ఉంటుది, కళ్లు తెరిచామా లేదా అని విప్పార్చి చూస్తే అప్పుడు తెలుస్తుంది ట్రైన్‌ ఒక టన్నల్‌ గుండా ప్రయాణిస్తోందని. సిమ్లా, కల్కాల మధ్య 103 టన్నళ్లు, 87 బ్రిడ్జిలు ఉన్నాయి. ‘గ్రేటెస్ట్‌ నారో గేజ్‌ ఇంజనీరింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియా’గా గిన్నెస్‌ బుక్‌లో రికార్డయిన మార్గం ఇది. ఈ రూట్‌లో లెక్కలేనన్ని చిన్న పెద్ద నదులుంటాయి. అయితే వీటిలోని చాలా నదుల్లో ఎండకాలంలో నీళ్లుండవు. కొండ పక్కగా కొంతసేపు, సొరంగంలో మరికొంత సేపు, కిందకు చూస్తే నది... ఇలా సహజత్వానికి సాంకేతికత మేళవించిన సిమ్లా యాత్రలో ప్రతిక్షణం అమూల్యమైనదిగా అనిపిస్తుంది. ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉంటే ఏం మిస్సవుతామోనని కళ్లప్పగించి పరిసరాలను, ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూండగానే కనుచూపు మేరలో ట్రెక్కింగ్‌ బృందం కనిపిస్తుంది. కొన్ని పర్వతాలకు ప్రదక్షిణ చేసి, మరికొన్నింటి కడుపులో నుండి దూసుకుపోయి సిమ్లా చేరేటప్పటికే టూర్‌లో కొంత ఆనందం సొంతమవుతుంది.

సిమ్లాలో చూడాల్సినవి
సిమ్లా పట్టణం కొండవాలులోనే విస్తరించి ఉంటుంది. దూరం నుండి చూస్తే ఇళ్లన్నీ ఒకదాని మీద మరొకటి ఉన్నట్లుగా అనిపిస్తాయి. సిమ్లా వెళ్లిన వాళ్లు మొదటగా చూసేది మాల్‌రోడ్‌నే. మాల్‌సెంటర్‌ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. షాపింగ్‌ చేసినా, చేయకపోయినా అంతా తిరిగి చూడడం బాగుంటుంది. గుర్రమెక్కి మాల్‌ అంతా చుట్టి, పనిలో పనిగా ఒక ఫొటో తీసుకుంటే ఆ మధురానుభూతి ఎప్పటికీ మర్చిపోలేం.ఇక్కడ ఉలెన్‌ దుస్తులు చాలాతక్కువ ధరకు దొరుకుతాయి. ఇక మిగిలినవన్నీ తాకితే కాలేటట్లు ఉంటాయి. సిమ్లా దాని చుట్టుపక్కల ఆపిల్‌ తోటలు ఎక్కువ. పర్యాటకులు ఈ పండ్లను కోసుకుంటున్నా స్థానికులు ఏమీ అనరు. అయితే పండు కాకుండా పచ్చికాయను ముట్టుకుంటే ఒప్పుకోరు. పట్టణంలో తిరుగుతున్నంత సేపూ మనదేశంలో ఉన్నామా? మరొక దేశానికి వచ్చామా? అన్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ బ్రిటిష్‌ పాలకుల ప్రభావం ఎక్కువ. ఇప్పటికీ ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉందేమోననిపిస్తుంది. స్థానికులు వస్తువులను పిల్లలు స్కూలుబ్యాగు వేసుకున్నట్లు వీపుకు కట్టుకుని వెళ్తుంటారు. కొండ ప్రాంతం కావడంతో ఎగుడుదిగుడు మార్గంలో ఆవిధంగా వెడితేనే సౌకర్యంగా ఉంటుంది.

ఇండియా నుంచి పాకిస్తాన్‌ వేరుపడడానికి జరిగిన ఒప్పందం, కీలకమైన కాశ్మీర్‌ సమస్యపై చర్చ ఇక్కడి వైస్‌రాయల్స్‌ భవనంలో జరిగింది. సిమ్లాకు వచ్చిన పర్యాటకులు తప్పకుండా ఈ భవనాన్ని చూస్తారు. బ్రిటీష్‌ పాలకులు వేసవిలో ఇక్కడికి వచ్చి సేదదీరేవారు, వారి సౌలభ్యం కోసం ఇక్కడి నుంచే పాలన సాగించారు. తరువాత వచ్చిన మన ప్రధానులు కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ దానికి స్వస్తి చెప్పి ఆ భవనంలో ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌’ను ఏర్పాటు చేశారు.

శ్యామలే సిమ్లా
హిమాలయ పర్వతాలు అందంగా కనిపించే స్కాండల్‌ పాయింట్, చర్చి, లైబ్రరీ, లక్కడ్‌ బజార్‌ ముఖ్యమైనవి. లక్కడ్‌ బజార్‌లో కొయ్యతో చేసిన హస్తకళలు దొరుకుతాయి. స్కాండల్‌ పాయింట్‌ నుండి జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వైపు కొద్ది దూరం నడిస్తే కాలాబరి ఆలయం వస్తుంది. ఇందులో ఉన్న దేవత శ్యామల దేవి. సిమ్లాకు ఆ పేరు వచ్చింది శ్యామల దేవత నుంచేనట. ఇక జాకూ ఆలయం ఉన్న శిఖరం చూసి తీరాల్సిందే. ఇక్కడి నుంచి చూస్తే సిమ్లా అంతా కళ్ల ముందుంటుంది. ఇక్కడ హనుమాన్‌ ఆలయం ఉంది.

ఇక్కడికి కొంచెం ఓపిక ఉంటే నడిచి వెళ్లవచ్చు, నడవలేని వాళ్ల కోసం పోనీలు (గుర్రాలు), టాక్సీలు ఉంటాయి. స్టేట్‌ మ్యూజియంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పురాతన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిల్పాలు, పెయింటింగ్స్‌ ఉంటాయి. మన కల్చర్‌ని ఇక్కడ బాగా ఎంజాయ్‌ చేయవచ్చు. ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌’ను తప్పకుండా చూడాలి. ఇక్కడి నుండి పది– పదిహేను నిమిషాలు నడిస్తే ప్రాస్పెక్ట్‌ హిల్‌ వస్తుంది. ఇక్కడ కామనదేవి ఆలయం ఉంది. ఇక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో సమ్మర్‌ హిల్‌ ఉంది. మహాత్మాగాంధీ ఇక్కడ ఉన్న జార్జియన్‌ హౌస్‌లో విడిది చేసారట. హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్శిటీ కూడా ఇక్కడే ఉంది.

దారి పొడవునా...
సిమ్లా నుండి బయలు దేరినప్పటి నుండి ప్రతి ఐదారు కిలోమీటర్లకు ఒక టూరిస్ట్‌ ప్లేస్‌ ఉంది. ‘తత్తపాని’ హాట్‌ వాటర్‌ స్ప్రింగ్‌ మర్చిపోకుండా చూడాలి. హిమాచల్‌ప్రదేశ్‌ వాసులకు వేడినీటి గుండాలు మామూలు విషయమే కాని, మనకు వాటిని చూస్తే ఆశ్చ ర్యంగానే ఉంటుంది. ఆ నీటిగుండం మినహా పరిసరాల వాతావరణం రక్తం గడ్డకట్టేంత చల్లగా ఉంటుంది. హాట్‌వాటర్‌ స్ప్రింగ్‌లో నీళ్లు మాత్రం మరుగుతుంటాయి. ఈ నీటిలో సల్ఫర్‌ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి అలా జరుగుతుందట. ఇక్కడ స్నానం చేస్తే చర్మవ్యాధులు పోతాయంటారు. ఇంకా ఆసక్తి, సమయం ఉంటే ప్రణాళిక ప్రకారం పరిసరాల్లో ఉన్నవన్నీ చూడవచ్చు. సిమ్లాలో హిమాచల్‌ప్రదేశ్‌ టూరిజం ఆఫీస్‌లో సంప్రదించి ఆ ప్యాకేజ్‌లో వెళ్తే తక్కువ టైంలో ఎక్కువ ప్రదేశాలను చూడవచ్చు. లేదా రూట్‌ మ్యాప్‌ ప్రకారం సొంత వాహనంలో వెళ్లడం కూడా సౌకర్యంగా ఉంటుంది. నచ్చిన ప్రదేశంలో ఎక్కువ సమయం గడపడానికి వీలవుతుంది.

అడ్వెంచర్‌ టూర్‌
సిమ్లా నుంచి నర్కందా వెళ్లే వరకు పర్వతాలన్నీ మంచురాశి పోసినట్లుంటాయి. దట్టంగా పరుచుకున్న మంచుకొండల మీద సూర్యకిరణాలు పడి మెరుస్తూ వెండికొండలన్న విశేషణం అక్షరాలా నిజమనిపిస్తుంది. స్నో స్కీయింగ్‌ చేయడానికి ఇది చక్కటి లొకేషన్‌. సిమ్లా నుంచి  కుఫ్రి వెళ్ళే దారి అంతా ఒకవైపు ఆకాశాన్నంటే పర్వతాలు ఉంటే మరొక వైపు అగా«ధాలుంటాయి. ఈ శివాలిక్‌పర్వతశ్రేణులన్నీ మంచుదుప్పటి కప్పుకున్నట్టుంటే, లోయలు రంగురంగుల పూలతో సీతాకోకచిలుకల్లా ఉంటాయి. వింటర్‌ స్పోర్ట్స్‌కు ఇది కేంద్రం. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో స్పోర్ట్స్‌ వేడుకలు జరుగుతాయి.
     
రాంపూర్‌ సట్లెజ్‌ నది ఒడ్డున ఉంది. ఇది రివర్‌ రాఫ్టింగ్‌కు అనువైన ప్రదేశం. ఇక్కడ మరొక వింత కూడా ఉంది. ఇక్కడ దుకాణాల్లో లావాదేవీకి డబ్బు పనికిరాదు. కరెన్సీ అమలులోకి రాకముందు వస్తుమార్పిడి విధానం(బార్టర్‌ సిస్టం) ఉండేదని చిన్నప్పుడు చదువుకున్నాం కదా? దాన్ని ఇక్కడ స్వయంగా చూడవచ్చు. స్థానికంగా తయారైన ఉన్ని ఉత్పత్తులన్నీ చవక. డ్రైఫ్రూట్స్‌ చాలా రకాలు దొరుకుతాయి. ధర కూడా బాగా తక్కువ.
– వాకా మంజులారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement